టీపీసీసీ చీఫ్ మార్పు!
పొన్నాలను తప్పించే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్!
తెరపైకి మల్లు భట్టి విక్రమార్క పేరు
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను తప్పించాలని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు భావిస్తున్నారు. ఆయన స్థానంలో టీపీసీసీ సారథిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే అంశంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. పొన్నాల నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పలువురు సీనియర్ నేతలు ఆయనను తప్పించాలని కోరుతూ గత కొంత కాలంగా హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా కాంగ్రెస్ లబ్ధి పొందకపోవడానికి నాయకుల మధ్య ఐక్యత లోపించడమేనని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర నాయకులను సమన్వయపర్చడంలో పొన్నాల వైఫల్యం చెందారనే అంచనాకు వచ్చింది. అయితే గతంలోలా హైకమాండ్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అవకాశాల్లేవని, సీనియర్ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అధ్యక్షుడిని నియమించాలని నిర్ణయించిందని ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఆయన వ్యాఖ్యలకు బలం చేకూరే విధంగా పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోని పలువురు నేతలకు ఫోన్లు చేసి పొన్నాల పనితీరుతోపాటు కొత్త సారథి ఎవరయితే బాగుంటుందని ఆరా తీస్తుట్టు తెలిసింది.
సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్షనేత డీఎస్, ఉపనేత షబ్బీర్‌అలీ, ఏఐసీసీ కార్యదర్శులు వి.హనుమంతరావు, జి.చిన్నారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డితోపాటు పలువురు సీనియర్ నేతలకు ఫోన్‌చేసి వారి అభిప్రాయాలను తీసుకున్నట్లు సమాచారం. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనమైనందున ఆ ప్రాంత నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగించాలని కొందరు, సామాజికవర్గాలతో పనిలేకుండా పార్టీ బలోపేతమే లక్ష్యంగా కొత్త అధ్యక్షుడిని నియామకం ఉండాలని మరికొందరు నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. సామాజిక సమీకరణల్లో భాగంగా ఎస్సీ లేదా బీసీ నేతను టీపీసీసీ చీఫ్‌గా నియమించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే రెడ్డి సామాజికవర్గానికి సీఎల్పీ, బీసీ సామాజిక వర్గానికి మండలి ప్రతిపక్షనేత పదవి ఇచ్చినందున ఇతరవర్గాలకు టీపీసీసీ పగ్గాలు అప్పగించడం ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని అంచనా వేసిన హైకమాండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మరో పక్క ఏఐసీసీ ప్రక్షాళనలో భాగంగా దిగ్విజయ్‌సింగ్‌ను తప్పిస్తే రాష్ట్ర ఇన్‌చార్జి పగ్గాలను ముకుల్ వాస్నిక్‌కు అప్పగించే అవకాశాలున్నాయని తెలిసింది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల తొలివారంలో ఏఐసీసీని పునర్‌వ్యవస్థీకరిస్తారని, ఆ తరువాతే టీపీసీసీ చీఫ్ నియామకం ఉంటుందని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.