
నీళ్లు పెట్టేందుకు వెళ్లి.. మృత్యు ఒడిలోకి..
నర్సింహులపేట : రాత్రి కరెంట్ ఓ రైతు ప్రాణం తీసింది. అర్ధరాత్రి పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన కౌలు రైతు ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతిచెందిన సంఘటన మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ఎస్సై యూసర్ అరాఫత్ కథనం ప్రకారం.. కురవి మండలంలోని ఉప్పరగూడెంకు చెందిన పెదమాముల నర్సయ్య (55)కు 35 ఏళ్ల క్రితం నర్సింహులపేటకు చెందిన సుగుణమ్మతో వివాహమైంది. సుగుణమ్మ ఆమె తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు కావడంతో అత్తగారింట్లోనే ఉంటున్నాడు.
గతంలో కూలీనాలీ చేసి జీవనం సాగించిన ఆయన ఇదే గ్రామానికి చెందిన కాల్సాని నర్సింహరెడ్డి వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. మోటార్లకు కరెంట్ రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు సరఫరా అవుతుండడంతో రాత్రి 10 గంటలకు మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లాడు. బావి పక్కనే చిన్న కాలిబాట వెంట నడుస్తూ వెళుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి మృతిచెందాడు. రాత్రి వెళ్లిన నర్సయ్య తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆయన కుమారుడు యాకయ్య శనివారం ఉదయం చుట్టుపక్కల బావులు, సాగు చేస్తున్న పత్తి, పసుపులో పిలుచుకుంటూ తిరిగాడు.
చివరకు ఆయన కౌలుకు చేస్తున్న వ్యవసాయ బావిలో శవమై కనిపించాడు. తండ్రి మృతదేహాన్ని చూడగానే కుమారుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురై రోదిస్తూ గ్రామస్తులకు సమాచారమిచ్చాడు. నిరుపేద కుటుంబానికి చెందిన నర్సయ్యకు భార్య సుగుణమ్మతోపాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఎస్సై అరాఫత్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుమారుడు యాకయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
తల్లడిల్లిన కుటుంబ సభ్యులు
నర్సయ్య మృతితో అతడి కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. రోజూ రాత్రి భార్యతో కలిసి బావి వద్దకు వెళ్లే అతడు శుక్రవారం రాత్రి ఆమెకు అనారోగ్యంగా ఉండడంతో ఒక్కడే వెళ్లాడు. ప్రమాదవశాత్తూ మృత్యువాతపడ్డాడు. అందరికి తలలో నాలుకగా ఉండే నర్సయ్య అకస్మాత్తుగా మృతిచెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నారుు. నర్సయ్య మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులు వేలాదిగా తరలివచ్చారు.
రాత్రి పూట కరెంట్ అతడి పాలిట శాపంగా మారిందని, పగలు కరెంట్ ఇస్తే ఈ దారుణం జరిగి ఉండేది కాదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వైస్ ఎంపీపీ వేముల రాంరెడ్డి, సర్పంచ్ కాల్సాని దామోదర్‌రెడ్డి, నాయకులు ఇట్టి వీరారెడ్డి, సంపెట రాముగౌడ్, మిర్యాల వెంకన్న , వెంకట్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, రమేష్ తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయూలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు.