జిల్లాలోనూ పెన్సి‘డీల్’ | Pensidil the districts' | Sakshi
Sakshi News home page

జిల్లాలోనూ పెన్సి‘డీల్’

Published Thu, Nov 27 2014 3:57 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

Pensidil the districts'

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పెన్సిడిల్ (దగ్గు మందు) సిరప్ బాటిళ్ల అక్రమ రవాణా తీగలాగితే డొంక కదులుతోంది. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి కేంద్రంగా బంగ్లాదేశ్‌కు అక్రమంగా సరఫరా అవుతున్న పెన్సిడిల్ సిరప్ బాటిళ్ల వ్యవహారంలో కరీంనగర్ జిల్లా వ్యాపారుల పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. దగ్గు మందు బాటిళ్ల అక్రమ రవాణాపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు తాజాగా జరిపిన విచారణలో కరీంనగర్, కోరుట్ల కేంద్రాలుగా జిల్లాలోనూ నార్కోటిక్ డ్రగ్ వ్యాపారం సాగినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈ అంశాలను బయటకు వెల్లడించేందుకు అధికారులు ఇష్టపడటం లేదు.

 మత్తు కోసమే దగ్గు మందు!
 బంగ్లాదేశ్‌లో మద్యనిషేధం ఉండడంతో వంద మిల్లీలీటర్ల పెన్సిడిల్ దగ్గు మందును మత్తు కోసం అక్కడి యువత వాడుతున్నట్లు అధికారుల విచారణలో తేలింది. వారి వ్యసనాన్ని ఆసరాగా చేసుకున్న రష్యా, బంగ్లాదేశ్ ప్రాంతాల స్మగ్లర్లు మన రాష్ట్రానికి చెందిన కొందరు మెడికల్ రిప్రజెంటేటివ్‌లతో కుమ్మక్కై భారీ మొత్తంలో పెన్సిడిల్ బాటిళ్లను దిగుమతి చేసుకుంటున్నట్లు తేలింది.

మన జిల్లాలోని కరీంనగర్, కోరుట్లలోని రెండు మెడికల్ హోల్‌సేల్ స్టాకిస్ట్‌లు గత రెండు నెలలుగా భారీ ఎత్తున పెన్సిడిల్ సిరప్‌లను సరఫరా చేసినట్లు అధికారుల విచారణలో బయటపడింది. వంద మిల్లీలీటర్ల దగ్గు మందు బాటిల్ ధర రూ.96 ఉండగా, మరో రూ.50 అదనంగా కలిపి ఒక్కో బాటిల్‌ను రూ.146 చొప్పున ఐదువేల బాటిళ్లను సరఫరా చేసినట్లు తెలిసింది. కరీంనగర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి ఈ బాటిళ్లను హైదరాబాద్‌కు సరఫరా చేయగా, అటు నుంచి ఎటు వెళ్లాయనేది ఇంకా తెలియరాలేదు.

దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారు.అత్యధికంగా లాభం వస్తుందన్న ఆశతోనే హోల్‌సేల్ స్టాకిస్టులు నేరుగా స్మగ్లర్లకు సరఫరా చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. పెన్సిడిల్ సిరప్‌లో క్లోడిన్ పాస్ఫేట్ (నార్కోటిక్ డ్రగ్) ఉండడంతో వైద్యుల సిఫారసు మేరకే ఈ మందును రిటైల్ వ్యాపారులు వినియోగదారులకు అందించాల్సి ఉంటుంది. దీనివల్ల ఇష్టారీతిన దగ్గు మందును విక్రయించే అవకాశం లేకపోవడం, దీనికితోడు ఆశించిన లాభం కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో అక్రమ రవాణాకు పూనుకున్నట్లు తెలుస్తోంది.

రిటైల్ వ్యాపారుల సంఘం ప్రతినిధి హస్తం?
కరీంనగర్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారి ఈ అక్రమ దందాలో భాగస్వామిగా ఉన్నట్లు సమాచారం. కరీంనగర్ రిటైల్ వ్యాపారుల సంఘం ప్రతినిధికి చెందిన డ్రగ్ ఏజెన్సీ ద్వారా సదరు వ్యాపారి పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు పెన్సిడిల్ మందును సరఫరా చేసినట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. కోరుట్లకు చెందిన మరో డిస్ట్రిబ్యూటర్ సైతం ఎక్కువ సంఖ్యలో పెన్సిడిల్ సిరప్‌లను సరఫరా చేసినట్లు సమాచారం.

కరీంనగర్ జిల్లాలో డ్రగ్ అధికారులు హోల్‌సేల్ వ్యాపారంపై అంతగా దృష్టి సారించకపోవడంతోనే ఈ అక్రమ వ్యాపారం సాగినట్లు భావిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో ఈ అక్రమ దందా పట్టుబడడంతో  ఔషధ నియంత్రణ అధికారులు జిల్లాలోనూ లోతుగా విచారణ జరుపుతున్నారు. అయితే పలువురు ప్రముఖులకూ ఇందులో ప్రమేయం ఉండడంతో చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
విచారణ జరుపుతున్నాం..వెంకటేశ్వర్‌రావు, ఔషధ నియంత్రణశాఖ ఏడీ
పెన్సిడిల్ అక్రమ రవాణాపై విచారణ జరుపుతున్నాం. మా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు హోల్‌సేల్ షాపులను తనిఖీ చేసి పెన్సిడిల్ మందుల క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. తప్పులు జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement