సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలోని బీడీ కార్మికులకు ఒకటో తేదీ నుంచి వెయ్యి రూపాయల పింఛన్ అందించనున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. బీడీ కార్మికులు, విద్యుత్, రైల్వే బడ్జెట్, కేంద్ర సాయం తదితర అంశాలపై శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. అర్హులైన బీడీ కార్మికులందరికీ పింఛను అందిస్తామని, ఎంతమంది ఉన్నా వెనకాడేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పింఛను రాని వారు తహశీల్దారుకు దరఖాస్తు చేసుకుంటే 20 రోజుల్లోగా విచారించి, వారికి కూడా మార్చి 1 నుంచే పింఛను అమలు చేస్తామన్నారు.
‘‘సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రాష్ట్రంలో 4.9 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నట్లు తేలింది. వీరిలో 1.40 లక్షల మంది ఇప్పటికే ఏదో ఒక రకమైన (వితంతు, వృద్ధాప్య, వికలాంగ తదితర) ఆసరా పింఛన్లు పొందుతున్నారు. మరో లక్ష మంది బీడీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా భవిష్య నిధి పింఛను అందుతోంది. పద్దెనిమిదేళ్లలోపున్న మైనర్లు, పీఎఫ్ కార్డు ఉండీ సమగ్ర కుటుంబ సర్వేలో నమోదు కానివారు, ఇతర పనులు కూడా చేసుకుంటూ వేతనం పొందుతున్నవారు కలిపి మొత్తం 80 వేల మంది ఉన్నట్లు తేలింది. నిబంధనల ప్రకారం వీరికి పింఛను ఇచ్చేందుకు వీలుకాదు. ఇక మిగిలిన 1.70 లక్షల మందికి మాత్రం మార్చి 1 నుంచి పింఛను ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇతర అంశాలపైనా ఆయన స్పందించారు.
రుణ పరిమితి పెంచాలని కోరాం
‘రాష్ట్రం విడిపోతే తెలంగాణ ధనిక రాష్ట్రమవుతుందని నేను ముందే చెప్పా. తాజాగా 14వ ఆర్థిక కమిషన్ చేసిన సర్వే ద్వారా దేశంలో గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు ధనిక రాష్ట్రాలుగా తేలాయి. చెల్లించే సామర్థ్యం ఉన్నందునే ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించగలిగాం. ఆకలితో ఉన్న 11 రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వడం పట్ల మాకు అభ్యంతరం లేదు కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం రుణ పరిమితిని పెంచాలని కేంద్రాన్ని కోరాం. దీనిపై గుజరాత్ సీఎంతోనూ చర్చించా. ఎఫ్‌ఆర్‌బీఎం సడలింపు గురించి కేంద్రంతో పోరాడాలని నిర్ణయించాం.
సడలింపునిస్తే మరో 8 నుంచి 10 వేల కోట్ల నిధులు రాష్ట్రానికి వచ్చే అవకాశముంది’ అని సీఎం పేర్కొన్నారు. ధనిక రాష్ట్రంగా ప్రకటించినందున కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి పెద్దగా నిధులు వస్తాయని ఆశించడం లేదన్నారు. రాష్ట్రాల నిధుల వాటా 42 శాతానికి పెంచడం శుభపరిణామమన్నారు. 122 కేంద్ర ప్రాయోజిత పథకాల(ఇటీవల 66కు కుదించారు) అమలు రాష్ట్రానికి భారంగా ఉందన్నారు. కాగా, రాష్ట్ర బడ్జెట్ వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు.
2018 కల్లా మిగులు విద్యుత్
మరో మూడేళ్లలో తెలంగాణ మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రమవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ‘2017 నాటికి రాష్ట్రానికి సరిపోయేంత విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలుగుతాం. అప్పట్నుంచి పుట్టినోళ్లకు విద్యుత్ కోతల గురించి తెలియక పోవచ్చు. ప్రస్తుతమైతే రాష్ట్రంలో అధికారికంగా విద్యుత్ కోతలేమీ లేవు. అయితే ఈ సీజన్లో కొంత ఇబ్బందులు రావచ్చు. ఇప్పటికే రైతులను వరిపంట వేసుకోవద్దని చెప్పాం. కేరళ నుంచి 400 మెగావాట్లు, ఈశాన్య రాష్ట్రాల నుంచి నాలుగు వేల మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకోబోతున్నాం. ఎంత రేటైనా కొనుగోలు చేయాలని నిర్ణయించాం.
దక్షిణ భారత గ్రిడ్ నుంచి కూడా 1,300 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంది. ఏడు ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిసినా తెలంగాణ నుంచే విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. బీహెచ్‌ఈఎల్, సింగరేణి, భూపాలపల్లి విద్యుత్ ప్లాంట్ల ద్వారా ఈ ఏడాది చివరికల్లా 1,800 మెగావాట్లను సొంతంగా సమకూర్చుకోగలుగుతాం. పవర్ గ్రిడ్ వేస్తున్న లైన్లు పూర్తయితే ఆరు నెలల్లో రెండు వేల మెగావాట్ల విద్యుత్ అందుతుంది. 2018 నాటికి హైడల్, థర్మల్, సోలార్ పవర్ ప్లాంట్ల ద్వారా మొత్తం 23 వేల మెగావాట్ల విద్యుత్ తెలంగాణ సొంతమవుతుంది.
కేంద్రానికి ధన్యవాదాలు
‘నిజామాబాద్ - కరీంనగర్ - పెద్దపల్లి లైన్‌ను పూర్తి చేసేందుకు రైల్వే బడ్జెట్‌లో నిధులు కేటాయించినందుకు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను వరల్డ్‌క్లాస్ స్టేషన్‌గా మారుస్తామని ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇక వరంగల్ జిల్లాలో వ్యాగన్ ఫ్యాక్టరీ, ఇతర సదుపాయాల గురించి ఎన్నోసార్లు అడిగినా ప్రయోజనం చేకూరలేదు. అడిగిన వన్నీ కేంద్రం ఇవ్వదు. అయినా ఇచ్చేదాకా ప్రయత్నం చేస్తూనే ఉంటాం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.
యూడీసీకి టెంపుల్ సిటీ బాధ్యత
‘యాదగిరిగుట్టను టెంపుల్ సిటీగా మార్చే బాధ్యతను అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(యూడీసీ)కు అప్పగించాం. 6.5 ఎకరాల స్థలంలో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం. గర్భగుడిని, ఆంజనేయ స్వామిని కదల్చకుండా అదే ప్రాంగణంలో యజ్ఞ, ప్రవచన శాలలతోపాటు కళామండపాలను నిర్మిస్తాం. 10 వేల వాహనాలు నిలిపేలా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తాం. ఆలయ అభివృద్ధికి నిధులిచ్చేందుకు ఇప్ప టికే రిలయన్స్, టాటాగ్రూప్ కంపెనీలు ముందుకొచ్చాయి. వాటన్నింటినీ యూడీసీకి జమచేస్తాం’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఇక ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి రాష్ట్రానికి నీళ్లు తేవడానికి కర్ణాటక ప్రభుత్వంతో చర్చించనున్నట్లు చెప్పారు. ‘ఆల్మట్టి నుంచి తెలంగాణకు నీళ్లు వస్తాయని 2003లో చెబితే నన్ను ద్రోహి అన్నారు. ఆల్మట్టి ద్వారా కర్ణాటకకు నీటి కేటాయింపులు 196 టీఎంసీలే ఉన్నాయి. ఆ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు గ్రావిటీ ద్వారా 100 టీఎంసీలకుపైగా నీరు వచ్చే అవకాశముంది. దీనిపై కర్ణాటక సీఎం తో మాట్లాడతా. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌లో లోపాలున్నాయి. దీన్ని సవరించేం దుకు సమీక్ష జరపనున్నాం. మహారాష్ట్ర బాగా సహకరిస్తోంది. ప్రాజెక్టు నుంచి 160 టీఎంసీలు తెచ్చుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు లేవు’ అని సీఎం వివరించారు.
బీడీ కార్మికులకు రేపట్నుంచి పింఛన్
Published Sat, Feb 28 2015 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM
Advertisement