ఒంటరి మహిళలకూ పింఛన్లు!
- త్వరలోనే సానుకూల నిర్ణయం: మంత్రి కేటీఆర్
- ఈ నెలాఖర్లో అభయహస్తం పింఛన్ల పంపిణీ
- స్థానిక ప్రజాప్రతినిధుల వేతన పెంపు భారం ప్రభుత్వంపైనే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒంటరి మహిళలకు కూడా పింఛన్లు ఇవ్వాలనే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. దీనిపై సహచర మంత్రుల నుంచి కూడా డిమాండ్ వస్తోందని, త్వరలోనే ఈ విషయంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సోమవారం అసెంబ్లీలో పంచాయతీరాజ్‌శాఖ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పింఛన్ల పంపిణీపై సామాజిక తనిఖీ చేపట్టే యోచన ఉందన్నారు. మార్చి నెలాఖరులో అభయహస్తం పింఛన్లను పంపిణీ చేస్తామన్నారు.
ఆరు నెలల అభయహస్తం పింఛన్లను విడుదల చేశామన్నారు. శిథిలావస్థలో ఉన్న జిల్లా, మండల, గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణం కోసం రూ. 78 కోట్లు కేటాయించినట్లుగా మంత్రి చెప్పారు. గతంలో ఎప్పుడూ లేనట్లుగా రూ. 5,470 కోట్లతో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్లకు రిపేర్లు, కొత్త రోడ్లు, మట్టి రోడ్లు నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రోడ్ల నాణ్యత పరిశీలనకు జిల్లాకో క్వాలిటీ కంట్రోల్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే వేసవిలో నీటి కొరత నివారణకు రూ. 263 కోట్లు కేటాయించామన్నారు.
మిషన్ కాకతీయలో చేపట్టకుండా మిగిలిపోయిన కుంటలను ఉపాధి హామీ పథకంలో చేపడతామని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధాన కార్యక్రమాలు ఎక్కువగా తీసుకుంటామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాల పెంపు వల్ల రూ. 102 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కువగా భరిస్తుందని కేటీఆర్ వెల్లడించారు.
గౌరవవేతనాల పెంపు భారాన్ని 80-90 శాతం భారం రాష్ట్ర ప్రభుత్వమే మోస్తుందన్నారు. కోఆప్షన్ సభ్యులకూ వేతనాల పెంపు వర్తిస్తుందన్నారు. అయితే రాష్ట్రంలోని 87 వేల మంది వార్డు సభ్యులకు గౌరవ వేతనాల పెంపు సాధ్యంకాదని కేటీఆర్ స్పష్టం చేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలనే నిర్ణయానికి ముందు ఎన్నో చర్చలు, ప్రతిపాదనలు వచ్చాయన్నారు. గ్రామ పంచాయతీల ఆర్థిక స్వావలంబన కోసమే కనీసం 500 జనాభాను ప్రాతిపదికగా చేసుకున్నామని వివరించారు.
రోడ్ల విస్తరణకు భారీగా నిధులు: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో రోడ్ల విస్తరణకు గతంలో ఎన్నడూ లేనివిధంగా నిధులను ఖర్చు చేస్తున్నామని రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వెల్లడించారు. ఏకకాలంలో 149 మండలాల్లో 1,996 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ. 2,580 కోట్లను ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఆరు ప్రధాన నదులపై వంతెనలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. మెట్రో రైల్‌ను 2017కు ముందే ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మున్సిపాలిటీల్లో నీటికొరతను తీర్చడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
కరెంటు కోతలు లేవు... ఉండవు: మంత్రి జగదీశ్‌రెడ్డి
రాష్ట్రంలో ఇప్పటికే కరెంటు కోతలు లేవని, భవిష్యత్తులోనూ ఉండవని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విడిపోతే కరెంటు ఉండదని, పంటలు ఎండిపోతాయని, పరిశ్రమలు తరలిపోతాయని, విద్యార్థులు చీకట్లో నలిగిపోతారని బ్లాక్‌మెయిల్ చేసినవారు ఇప్పుడు ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు. గతంలో జనవరి నుంచే కరెంటు కోతలు ఉండేవని గుర్తుచేశారు. సబ్‌స్టే షన్ల కోసం స్థలం దానం చేసిన వారికి అర్హతలుంటే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.