ఐదు నెలల్లో ఇళ్లు కట్టిస్తాం.. | Five months kattistam home .. | Sakshi
Sakshi News home page

ఐదు నెలల్లో ఇళ్లు కట్టిస్తాం..

Published Sat, Jan 10 2015 2:22 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

ఐదు నెలల్లో ఇళ్లు కట్టిస్తాం.. - Sakshi

ఐదు నెలల్లో ఇళ్లు కట్టిస్తాం..

  • వరంగల్ బస్తీ వాసులకు సీఎం కేసీఆర్ హామీ
  • కాలనీల నిర్మాణానికి రేపు శంకుస్థాపన
  • రెండోరోజూ వరంగల్ బస్తీల్లో పర్యటన
  • భూపాలపల్లి నియోజకవర్గంపై ప్రత్యేకంగా సమీక్ష
  • నేడు, రేపు వరంగల్‌లోనే ఉండనున్న సీఎం
  • సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరుసగా రెండోరోజు కూడా వరంగల్ జిల్లాలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని దీన్‌దయాళ్ నగర్, ప్రగతి నగర్, నాగేంద్ర నగర్, జితేందర్ నగర్ బస్తీలకు వెళ్లి అక్కడి ప్రజలతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. దీన్‌దయాళ్ నగర్‌లో మహిళల వద్దకు వెళ్లి వారి మధ్యలో కూర్చుని సమస్యలు విన్నారు. మూడు బస్తీల వద్ద గుడిగూడిన స్థానికులను ఉద్దేశించి వేర్వేరుగా ప్రసంగించారు.

    ‘వరంగల్‌లో 500 ఎకరాల్లో మొత్తం 160 బస్తీలు ఉన్నయట. నిన్న మూడు బస్తీలల్ల తిరిగిన. ఇయ్యాల ఇక్కడ, మరో రెండు బస్తీలల్ల తిరుగుత. ఇప్పుడైతే ఈ ఆరు బస్తీలను సమగ్రంగా అభివృద్ధి చేస్త. మార్చి తర్వాత మరికొన్ని కాలనీలు, ఆ తర్వాత ఇంకొన్ని పూర్తి చేసుకుందం. మీ కాలనీని ఐదు నెలల్లో అడ్వొకేట్స్ కాలనీ స్థాయిలో అభివృద్ధి చేస్త. ఇప్పుడు మీరున్నది చెరువు శిఖం భూములు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటున్నరు.

    ఇప్పుడు మీకు ఆన్‌స్టేక్ చట్టం మేరకు హక్కు పత్రాలు ఇయ్యాలె. ఆర్థికంగా సమకూర్చుకున్నవాళ్లు ఇండ్లు కట్టుకున్నరు. మిగిలిన అందరికీ వెంటనే ఇళ్ల పట్టాలిస్తం. ఈ బస్తీల్లో ఉన్న వారు ఎందరనేది కచ్చితంగా తేలాలె. మీ ఎమ్మెల్యే వినయభాస్కర్ రేపు ఇక్కడే కుర్చీ వేసుకుని కూసుంటడు. బస్తీలో ఉన్న వాళ్లు రేపు ఎక్కడికీ వెళ్లొద్దు. అధికారులు వస్తరు. మీ వివరాలు చెప్పాలి. నేను నైట్ ఇక్కడే ఉంట. జాబితా ప్రకారం అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తం. వెంటనే వన్ ప్లస్ వన్ (గ్రౌండ్ ఫ్లోర్, ఒక అంతస్తు) పద్ధతిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తం.

    ఇప్పుడు నేలపై ఉన్న వారు కింద (గ్రౌండ్ ఫ్లోర్‌లో) ఉంటరు. వేరే వారు పైన (మొదటి అంతస్తులో) ఉంటరు. ఇక్కడ వసతులు ఏమీ లేవు. నడిచిచూస్తే తెలుస్తాంది. నేను వస్తాన్నని మొరంబోసిన్రు. నాకు తెలుసు నిన్న ఇక్కడ ఎట్టుండెనో. వరద నీరు పోయేందుకు మోరీ కట్టాలె. తాగునీరు ఉండాలె. అన్నీ ఏర్పాటు చేయిస్తాం. ఎల్లుండి నేను వచ్చి కొత్త కాలనీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్త. ఐదు నెలల్లో పూర్తి చేసి ప్రారంభిస్తాం. ఇప్పుడు కాదు ఈలలు, సంబరాలు. పూర్తి చేసినంక మీ కాలనీలనే బ్రహ్మాండమైన దావత్ చేసుకుందం’ అని అన్నారు.

    పింఛన్ల విషయంలో మహిళలు ఫిర్యాదులు చేయడంపై సీఎం స్పందిస్తూ ‘అర్హులందరికీ పింఛన్లు అందుతయ్. రేపు ఉదయమే అధికారులు వచ్చి అన్నీ సరిచేస్తరు. పట్టాలతోపాటు పింఛన్లు ఇస్తరు’ అని భరోసా ఇచ్చారు.  దీన్‌దయాళ్ నగర్‌లో కేసీఆర్ ప్రసంగిస్తుండగా ఒక మహిళ పదేపదే ఏదో చెప్పబోతూ అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. కేసీఆర్ సరదాగా... ‘నన్ను మీ ఇంటికి తీసుకబోయి కట్టేసుకోమ్మా. లొల్లిబోతది’ అని సరదాగా అనడంతో అక్కడున్న వారంతా నవ్వారు. స్థానిక రేషన్ డీలర్‌పై సీఎంకు బస్తీవాసులు ఫిర్యాదు చేయగా డీలర్‌ను వెంటనే మార్చాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో కేసీఆర్ వెంట ఉప ముఖ్యమంత్రి రాజయ్య, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎంపీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, ధర్మారెడ్డి, యాదగిరిరెడ్డి ఉన్నారు.
     
    ఆర్డీవో కేంద్రంగా భూపాలపల్లి!

    తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనచారి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉదయం తెలంగాణ అర్చక సమాఖ్య సదస్సులో పాల్గొన్న కేసీఆర్ మధ్యాహ్నం హెలికాప్టర్‌లో వరంగల్ నుంచి కేటీపీపీకి చేరుకున్నారు. స్పీకర్‌తో కలసి అక్కడే అన్ని శాఖల అధికారులతో నియోజకవర్గ సమస్యలపై సమీక్షించారు. రూ.75 కోట్ల విలువైన అభివృద్ధి పనులను మంజూరు చేశారు. భూపాలపల్లిని ఆర్డీవో కేంద్రంగా మారుస్తామన్నారు. అనంతరం కేటీపీపీ రెండో దశ పనులను పరిశీలించి మళ్లీ వరంగల్‌కు వచ్చారు.
     
    నేడు, రేపు వరంగల్‌లోనే..

    వరంగల్ జిల్లాకు గురువారం ఆకస్మిక పర్యటనకు వచ్చిన సీఎం శనివారం ఇక్కడే ఉండనున్నారు. ఆయన శనివారం వరంగల్ నగరపాలక సంస్థలో ఇటీవల విలీనమైన వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పర్యటించే అవకాశం ఉంది. ఆదివారం సైతం వరంగల్‌లోనే ఉంటానని దీన్‌దయాళ్ నగర్ బస్తీలో కేసీఆర్ ప్రకటించారు. సీఎం గురువారం పర్యటించిన బస్తీల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వరంగల్ నగరపాలక సంస్థ, రెవెన్యూ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి సామాజిక పింఛన్ల అర్హుల వివరాలను సేకరించారు. అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేశాకే తాను హైదరాబాద్ వెళ్తానని వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీపురం బస్తీలో కేసీఆర్ గురువారం ప్రకటించారు. ఆదివారం వరకు ఈ ప్రక్రియ పూర్తవుతుందని, అప్పటి వరకు కేసీఆర్ వరంగల్‌లోనే ఉంటారని టీఆర్‌ఎస్ వర్గాలు చెప్పాయి.
     
    టీఆర్‌ఎస్‌లో చేరిన తాటి వెంకటేశ్వర్లు

    ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా కండువా కప్పి వెంకటేశ్వర్లును పార్టీలోకి ఆహ్వానించారు. తాటి వెంకటేశ్వర్లుతోపాటు ఆయన అనుచరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వరంగల్‌లోని విష్ణుప్రియ గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు కడియం శ్రీహరి, ఎ.సీతారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement