జహీరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను, నేతలను మభ్యపెట్టి పార్టీలో చేర్చుకుంటోందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు వచ్చిన ఆయన.. మాజీ మంత్రి గీతారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని టీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌లోకి వెళ్లే వారు ప్రజల కోసం కాకుండా తమ స్వలాభం కోసమే వెళ్తున్నారని విమర్శించారు. 16 సీట్లు ఇస్తే కేంద్రంలో అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్ చెబుతున్నారని, అదెలా సాధ్యమో చెప్పాలని నిలదీశారు.
పేద ప్రజలకు ఒక్క కాంగ్రెస్‌తోనే మేలు జరుగుతుందని ఉద్ఘాటించారు. సరైన పాలనను అందించడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కుల, మతాల మధ్య అంతరాలు పెంచి దశ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. జహీరాబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందంటే దానికి గీతారెడ్డి చేసిన కృషి మాత్రమే అని అన్నారు. ఆమె హయాంలోనే మహీంద్ర ట్రాక్టర్ యూనిట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిమ్జ్ వచ్చాయని గుర్తు చేశారు. నిమ్జ్ పూర్తయితే 3 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వై.నరోత్తం, కండెం నర్సింహులు, జి.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల చూపు కాంగ్రెస్ వైపు: గీతారెడ్డి
ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని మాజీ మంత్రి గీతారెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. ఏప్రిల్ 1న జరగనున్న జహీరాబాద్ సభకు రాహుల్ గాంధీ వస్తారని వెల్లడించారు. ఈ సభలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment