సాక్షి, అశ్వారావుపేట: ‘మీకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో డబుల్ బెడ్రూం ఇల్లు కావాలా? అయితే మాకు ఒక్క రూ.2,500 చెల్లించండి. వాటితోపాటు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఓటర్‌ఐడీకార్డు జిరాక్స్‌లు కూడా ఇవ్వండి. అంతే కొద్ది రోజుల్లో మీకు ఆ పథకంలో డబుల్ బెడ్రూం వచ్చినట్లే’ అంటూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొందరు వ్యక్తులు ప్రజల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. ఈ దందా కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లోనే జరిగిందనుకుంటే పట్టణ ప్రాంతాలకు కూడా పాకింది. కొద్ది రోజులుగా ఉమ్మడి జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట, ములకలపల్లి మండలాలతోపాటు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో ఇలాంటి దందాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దందాలో ఉమ్మడి జిల్లా వాసులతోపాటు ఏపీలోని విజయవాడ, గుంటూరుకు చెందిన కొందరు వ్యక్తులు భాగస్వాములుగా ఉన్నట్లు తెలిసింది.
పీఎం ఆవాస్ యోజన పేరిట..
ఈ మాయగాళ్లు ఏకంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్నే బూచీగా చూపి, కేవలం రూ.2,500 చెల్లించి, ఆధార్, రేషన్, ఓటర్ కార్డు ఇస్తే చాలు ఇరవై రోజుల్లోనే డబుల్ బెడ్రూం ఇల్లు కోసం రూ.3.50 లక్షలు మంజూరు చేయిస్తామని నమ్మబలికారు. కొద్ది మొత్తం డబ్బులకే సొంతింటి కల సాకారం చేసుకోవచ్చని గిరిజనులు, నిరక్షరాస్యులకు గాలం వేయడంతో వారు సులభంగా వీరి మాటలను నమ్మారు. సొంతింటి కల నేరవేరుతుందని ఆశతో ఈ మాయగాళ్ల వలలో పడిన బాధితులు ఒకొక్కరు రూ.2500 చొప్పున, మరికొంత మంది రూ.2000, ఇంకొందరు రూ.1,500 చొప్పున కట్టేశారు. ఇలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సాగిన ఈ దందాలో ఒక్క అశ్వారావుపేట మండలంలోనే 26 గ్రామ పంచాయతీల్లో ఈ తరహా బాధితులు దాదాపు 900 మంది వరకు ఉన్నారు.
ఇక్కడే కాకుండా ములకలపల్లి, పెనుబల్లి, సత్తుపల్లి మండలాల్లో మరో వంద మందికిపైనే అంటే దాదాపు వెయ్యి మందికిపైనే బాధితుల సంఖ్య ఉంటుందని పేరు చెప్పేందుకు ఇష్టపడని అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఈ వసూళ్లు సుమారు రూ.30 లక్షల వరకు ఉండొచ్చని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాగా, ఇప్పుడు అధికారులు పీఎం ఆవాస్ యోజన పేరుతో సాగిన వసూళ్ల పర్వంపై విచారణ మొదలు పెట్టారు. ఏజెన్సీలోని అమాయక గిరిజనులే లక్ష్యంగా, ఈ అక్రమ వసూళ్ల దందాలో కొంతమంది ప్రజాప్రతినిధులు, కమ్యూనిస్టు పార్టీ మాజీ నాయకుడు ప్రధాన సూత్రధారులు కావడం విస్మయానికి గురిచేస్తోంది.
ఊరూరా బాధితులే..
సొంతింటి కల, తక్కువ డబ్బులకు రెండు గదుల ఇల్లు వస్తుందనే ఆశతో నిరక్షరాస్యులు, అమాయకులైన గిరిజనులు ఈ దళారుల వలలో పడ్డారు. దీంతో అశ్వారావుపేట మండలంలోని రెడ్డిగూడెం, తిరుమలకుంట, తిరుమలకుంటకాలనీ, తోగ్గూడెం, కొత్త మామిళ్లవారిగూడెం, ఉసిర్లగూడెం, దురదపాడు (దిబ్బగూడెం), అనంతారం, గాండ్లగూడెం, మల్లాయిగూడెం, దిబ్బగూడెం (రామన్నగూడెం), పండువారిగూడెం, తాటి నాగుల గుంపు, కావడిగుండ్ల, కొత్త కావడిగుండ్ల, కన్నాయిగూడెం, అశ్వారావుపేట గ్రామాల్లో అత్యధికంగా ఈ మాయగాళ్లను నమ్మి మోసపోయిన బాధితులు ఉన్నారు. ఈ గ్రామాల్లోనే దాదాపు 800 మంది వరకు ఉన్నారు. వారంతా దళారులకు రూ.1500 నుంచి రూ.2500 చొప్పున చెల్లించారు.
ప్రజా ప్రతినిధులు సైతం..
పీఎం ఆవాస్ యోజన పేరుతో సాగుతున్న ఈ దందా గురించి పూర్వా పరాలు, నిజానిజాలు తెలుసుకోకుండానే కొందరు సర్పంచ్‌లు సైతం ఈ మోసగాళ్లతో చేతులు కలిపి, డబ్బులు వసూలుకు పాల్పడ్డారు. ఏకంగా తమ సర్పంచ్‌లే డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఇది నిజమేనని భావించిన గిరిజనులు నగదు కట్టేందుకు ముందుకు వచ్చారు. ఈ వసూళ్ల దందాలో ఓ కమ్యూనిస్టు పార్టీ మాజీ నాయకుడితోపాటు మండలంలోని ముగ్గురు సర్పంచ్‌లు, ఓ ఉప సర్పంచ్‌కు తోడు ఓ గ్రామానికి చెందిన వ్యక్తి (విలేకరి ముసుగు) కూడా గిరిజనుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసనట్లు తెలిసింది. ఈ ముఠాలో స్థానికులు, ప్రజాప్రతినిధులు ఉండటంతో గిరిజనలంతా వారిని నమ్మారు
కదిలిన పోలీసులు..
ఈ దందా విషయం తెలుసుకున్న తహసీల్దార్ వి.రాఘవరెడ్డి.. వసూళ్ల పర్వంపై విచారణ చేపట్టాలని స్థానిక ఎస్‌ఐకి నాలుగు రోజుల కిందట లేఖ రాశారు. తహసీల్దార్ ఫిర్యాదుతో ఈ ముఠా చేసిన వసూళ్లు, దోపిడీపై పోలీసులు రంగంలోకి దిగి విచారిస్తున్నారు. వసూళ్లకు పాల్పడిన ముఠాలోని ఏడుగురి గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ, కలెక్టర్ సైతం స్పందించడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఈ వసూళ్ల పర్వం ఎక్కడెక్కడ జరిగింది.? దీనికి ప్రధాన సూత్రధారులు ఎవరు.? వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి చేరాయి.? అసలు బాధితులు ఎందరు..? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
మోదీ స్కీం అంటే డబ్బులు కట్టాను
మోదీ స్కీం కింద రెండు గదుల ఇళ్లు ఇస్తారని చెబితే డబ్బులు కట్టాను. నా దగ్గర నుంచి ఆధార్, రేషన్, ఓటరు కార్డుల జిరాక్స్‌తోపాటు రెండు పాస్ ఫొటోలు కుడా తీసుకొని ఆన్‌లైన్ చేసి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. దీని కోసం రూ.2,500 కట్టాలని చెబితే గాండ్లగూడేనికి చెందిన వ్యక్తికి డబ్బులిచ్చాను. మా ఊరిలో 20 మంది దాకా ఇలానే ఇళ్ల కోసం డబ్బులు కట్టారు. ఎలాంటి రసీదులు ఇవ్వలేదు. - తాటి జయమ్మ, దిబ్బగూడెం
ప్రజాప్రతినిధికి రూ.1,500 కట్టాను
రెండు గదుల ఇల్లు వస్తుందని చెప్పడంతో మా ఊరి ప్రజా ప్రతినిధికి రూ.1,500 కట్టాను. డబ్బుతోపాటు రేషన్, ఆధార్, ఓటరు కార్డుల జిరాక్స్‌తోపాటు రెండు పాస్ ఫొటోలు ఇచ్చాను. ఆన్‌లైన్ చేసిన తర్వాత మాకు ఇల్లు వచ్చిందని చెబుతున్నారు. నాకు ఎలాంటి రసీదు ఇవ్వలేదు. - ఉమ్మల పార్వతి, రెడ్డిగూడెం
డబ్బులు కట్టి మోసపోయాం..
కేంద్ర ప్రభుత్వ స్కీంలో ఇల్లు ఇస్తామని చెప్పి, కొంత నగదు కట్టాలని చెప్పడంతో నేను కుడా మా ఊరి వాళ్లందరిలానే డబ్బులు ఇచ్చాను. మా ఊరిటో 30 మంది వరకు ఈ స్కీంలో ఇళ్ల కోసం రూ.1,500 చొప్పున ఇచ్చాం. -ఉమ్మల పద్మావతి, రెడ్డిగూడెం
Comments
Please login to add a commentAdd a comment