మంత్రివర్యా.. మాకేయి సూడయ్యా | People Demanding Medical Facilities In Adilabad | Sakshi
Sakshi News home page

మంత్రివర్యా.. మాకేయి సూడయ్యా

Published Sat, Jul 13 2019 11:43 AM | Last Updated on Sat, Jul 13 2019 11:45 AM

People Demanding Medical Facilities In Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: వెనుకబడిన ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీలు, గిరిజనులు ఉన్న ఈ ప్రాంతంలో వైద్యసేవలు మృగ్యమయ్యాయి. పేరుకు పెద్దపెద్ద సర్కారు దవాఖానాలు ఉన్నా రోగులకు సరైన వైద్యం అందడం లేదు. చిన్నచిన్న రోగాలకు కూడా రిమ్స్‌ వైద్యులు హైదరాబాద్, నాగ్‌పూర్, యావత్మాల్‌ తదితర ప్రాంతాలకు రెఫర్‌ చేస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేని నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పుసప్పు చేసి ప్రైవేటు వైద్యం చేయించుకుంటున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో రిమ్స్‌ ఆస్పత్రి ఉన్నా చిన్న చిన్న రోగాలు, జ్వరాలకు తప్ప మరే వైద్యం అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల ఖాళీలు, మౌలిక వసతుల కొరత, పరికరాలు లేక నాణ్యమైన వైద్యం అందడం లేదు. ఉన్నతాధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో పర్యవేక్షణ గాడి తప్పింది. శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. రోగులు, వారి బంధువులు జిల్లాలోని ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, పీహెచ్‌పీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అమాత్యునికి విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు.

 పీహెచ్‌సీల్లో అందని వైద్యం..
 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 129 ఉప ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్, ఒక ఏరియా ఆస్పత్రి ఉన్నాయి. అదే విధంగా ఆదిలాబాద్‌ పట్టణంలో ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 24 గంటలు పని చేసే పీహెచ్‌సీలు ఉన్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలందించాలి. పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉదయం 8నుంచి రాత్రి 8 గంటల వరకు వైద్యసేవలు అందించాల్సి ఉండగా ఎక్కడా పూర్తి స్థాయిలో రోగులకు  వైద్యసేవలు అందడం లేదు.

పీహెచ్‌సీలో చాలా మంది వైద్యులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకే విధుల్లో ఉంటున్నారు. ఆ తర్వాత ఆదిలాబాద్‌లో ప్రైవేటు క్లీనిక్‌లు నడుపుతున్నారు. బయోమెట్రిక్‌లు ఏర్పాటు చేసినా మూలనపడ్డాయి. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో మెడికల్‌ ఆఫీసర్లు సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. 

ఖాళీల జాతర..
జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీహెచ్‌సీల్లో, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల పోస్టులు తీవ్రంగా వేధిస్తున్నాయి. నాలుగు సివిల్‌ సర్జన్‌ పోస్టులకు గాను ఒక్కరే ఉన్నారు. అదే విధంగా జిల్లా మలేరియా అధికారి పోస్టు ఖాళీగా ఉంది. మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు 52 గాను 13 మంది కాంట్రాక్ట్, 33 మంది రెగ్యులర్‌ ఉన్నారు. ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాలుగు డిప్యూటీ పారామెడికల్‌ పోస్టులకు గాను ఇద్దరు ఉన్నారు. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

మాస్‌ మీడియా అధికారి పోస్టు, గణాంక అధికారి పోస్టు ఖాళీగా ఉంది. 34 స్టాఫ్‌ నర్సులకు గాను 6 గురు కాంట్రాక్ట్, 21 మంది రెగ్యులర్, 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌–2 పోస్టులు 29 ఉండగా 17 రెగ్యులర్, 5 కాంట్రాక్ట్, 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 29 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు 19 మంది రెగ్యులర్, 5 కాంట్రాక్ట్, 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెకండ్‌ ఏఎన్‌ఎం పోస్టులు 129 ఉండగా వీటిలో 117 కాంట్రాక్ట్, 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవే కాకుండా ఇతర సిబ్బంది పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి.

రిమ్స్‌.. పేరుకే పెద్దాసుపత్రి
జిల్లా కేంద్రంలో రిమ్స్‌ మెడికల్‌ కళాశాల ఉన్నా రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు రిఫర్‌ చేస్తున్నారు. ఏడాది క్రితం కన్జర్వేటర్‌ ఫారెస్ట్‌ గుండె నొప్పిరావడంతో వైద్యం కోసం రిమ్స్‌లో చేరారు. సరైన వైద్యం అందక ఆయన మృత్యువాత పడ్డ సంఘటన తెలిసిందే. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. చిన్నచిన్న రోగాలు జ్వరాలు, మెటర్నటీ సేవలు అందుతున్నాయి. నిపుణులైన వైద్యులు లేకపోవడంతో క్యాన్సర్, గుండెనొప్పి, కిడ్నీ సంబంధిత వ్యాధులు, ఇతరాత్ర చికిత్సల కోసం హైదరాబాద్, మహారాష్ట్రకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా రిమ్స్‌ కళాశాలకు రెగ్యులర్‌ డైరెక్టర్‌ లేరు. అదే విధంగా రిమ్స్‌ కళాశాలకు ప్రిన్సిపాల్‌ కూడా ఇన్‌చార్జే.

ఆస్పత్రిని పర్యవేక్షించాల్సిన సూపరింటెండెంట్, ఆర్‌ఎంవో పోస్టుల్లో సైతం ఇన్‌చార్జులతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో పర్యవేక్షణ గాడి తప్పింది. రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందడం లేదు. చాలా మంది డాక్టర్లు ఉదయం 8 గంటల వరకు వచ్చి మధ్యాహ్నం 12 గంటల వరకే రిమ్స్‌లో వైద్యసేవలు అందిస్తున్నారు. రాత్రి వేళల్లో కాల్‌ డ్యూటీ విధులు నిర్వహిస్తున్నారు. వారు వచ్చే వరకు రోగుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. రిమ్స్‌ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్లతోనే వైద్యసేవలు అందుతున్నాయి.

ప్రొఫెసర్‌ పోస్టులు 21కి గాను 9 మంది పని చేస్తున్నారు. 12 ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 30కి గాను 15 మంది పని చేస్తున్నారు. 15 ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 41కి గాను 34 మంది పని చేస్తుండగా 7 ఖాళీగా ఉన్నాయి. ట్యూటర్‌ పోస్టులు 59కి గాను 37 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిమ్స్‌ అనేక సమస్యలతో కొట్టమిట్టాడుతోంది. జూనియర్‌ డాక్టర్లకు నాలుగు నెలల నుంచి స్టైఫండ్‌ ఇవ్వడం లేదని ఆందోళన బాటపట్టారు. అదే విధంగా పారిశుధ్య కార్మికులకు కూడా నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రిమ్స్‌ ఆస్పత్రిలో ఆధునిక పరికరాలు ఉన్నా వైద్యులు లేకపోవడంతో నిరుపయోగం మారుతున్నాయి. జిల్లాలో ఆస్పత్రుల సమస్యలను పరిష్కరించాలని రోగులు ఆమాత్యున్ని వేడుకుంటున్నారు. 

నేడు  రిమ్స్‌ను సందర్శించనున్న మంత్రి  
ఎదులాపురం(ఆదిలాబాద్‌): రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శనివారం జిల్లా కేంద్రానికి రానున్నారు. అందులో భాగంగా రిమ్స్‌ ఆస్పత్రిని సాయంత్రం 5 గంటలకు సందర్శించనున్నారు. అనంతరం ఆస్పత్రిలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు ఇక్కడి నుంచి బయల్దేరనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement