అప్పుడెప్పుడో వచ్చిన సినిమాలోని బాబుమోహన్ డైలాగ్ ఇది.. ప్రతి విషయంలోనూ ఈ మూడు ప్రశ్నలు వేసుకుంటే.. కొత్త కొత్త విషయాలు తెలుస్తాయంటూ.. ఆయన పడే పాట్లు అప్పట్లో అందరినీ కడుపుబ్బా నవ్వించాయి. కామెడీ సంగతి పక్కనపెట్టి.. కరోనా విషయానికొచ్చేస్తే.. సుదీర్ఘ లాక్‌డౌన్ తర్వాత ఇప్పుడు జనమంతా రోడ్డుమీదకు వస్తున్న రోజులివీ.. చాలా మందిలో రకరకాల భయాలు.. బయట నుంచి వస్తే.. తప్పనిసరిగా స్నానం చేయాలని చెప్పేవాళ్లు కొందరు.. కనీసం చేతులు కూడా కడగని వాళ్లు మరికొందరు.. ఎన్నో అనుమానాలు.. మరెన్నో అపోహలు.. అందుకే.. బాబుమోహన్‌లాగా కామెడీగా కాకుండా.. సీరియస్‌గానే శోధిద్దాం.. ఎందుకు? ఏమిటి? అన్నది తెలుసుకుందాం.. ఎలా?.. ఇదిగో ఇలా..
(వ్యక్తి నుంచి వ్యక్తికే)
మార్కెట్‌కు వెళ్లి వచ్చాను.. నేను తప్పనిసరిగా స్నానం చేయాలా?
►అవసరం లేదు. చేతులు శుభ్రంగా కడుక్కుంటే చాలు. అయితే మార్కెట్లు వంటి చోట్లకు వెళ్లినప్పుడు భౌతిక దూరం పాటిం చాలి.. మాస్క్ మస్ట్‌గా వేసుకోవాలి.. అది సరిగ్గా చేస్తే చాలు.
నా జుట్టు లేదా గడ్డంలో వైరస్ ఉండే అవకాశముందా?
►భౌతిక దూరం వంటివి పాటిస్తూ ఉంటే.. ఇలాంటి వాటి గురించి భయపడాల్సిన అవసరమే లేదు. నిజంగానే మీ జుట్టు లేదా గడ్డంలో వైరస్ ఉండాలంటే.. ఇవి జరగాలి.. అవేంటంటే.. ఎవరైనా కరోనా రోగి మీ గెడ్డం లేదా జుట్టు మీద తుమ్మాలి.. మీ జుట్టు మీద అతడు తుమ్మిన ప్రాంతాన్ని మీరు చేతులతో ముట్టుకోవాలి.. ఆ చేతులను మళ్లీ మీ ముఖంపై పెట్టాలి.. అప్పుడు వైరస్ వస్తుంది (ఇలాంటివి చాలా అంటే చాలా తక్కువగా జరిగే అవకాశముంది
కాబట్టి.. లైట్ తీసుకోండి)
నేను ధరించిన దుస్తులకు వైరస్ అంటుకునే అవకాశముందా?
►సాధారణంగా మనం ముందుకు కదులుతుంటే గాలి పక్కకు తప్పుకొంటుంది. అంటే వైరస్ గాలిలో ఉన్నా కూడా మనం నడుచుకుంటూ వెళ్తుంటే పక్కకు తొలగుతూ ఉంటుంది.. నిజంగా మీ దుస్తులపై వైరస్ పడాలంటే.. ఇన్‌ఫెక్షన్ ఉన్న వ్యక్తి మీకు దగ్గరగా వచ్చి.. దగ్గడం లేదా తుమ్మడం చేయాలి.. అంతేకాదు.. మనం నడుస్తున్నప్పుడు చెదిరిపోకుండా ఉండాలంటే.. ఆ బిందువులు చాలా పెద్దవిగా ఉండాలి..
నా కుక్కతో నేను వాకింగ్‌కు వెళ్లొచ్చా.. లేదా బయటకు వెళ్లి ఎక్సర్‌సైజ్ చేసుకోవచ్చా?
►ఇండోర్‌తో పోలిస్తే.. అవుట్‌డోర్‌లో వైరస్ బలహీనంగా ఉంటుంది.. స్థిరత్వం తక్కువ ఉంటుంది.. భౌతిక దూరం పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటే.. బయట తిరిగినా కూడా వైరస్ సోకే ప్రమాదం చాలా తక్కువ.
బయటికి వెళ్లొచ్చాక షూస్ తుడవాలా?
►షూస్, చెప్పులపై బ్యాక్టీరియా, వైరస్ ఉండవచ్చు. కానీ దీని వల్ల కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే.. కరోనా వైరస్ మీ షూపై పడాలంటే.. మళ్లీ పాత పద్ధతే.. మీకు దగ్గరగా వచ్చి.. తుమ్మడం దగ్గడం చేయాలి.. అది మీ షూపై పడాలి. కాబట్టి.. నో ప్రాబ్లెం. లేదూ..కాదూ అంటే.. ఉతికేందుకు వీలుండే బూట్లైతే ఉతికేసుకోండి. మరో విషయం.. షూ కింది భాగంలో డిస్‌ఇన్‌ఫెక్టెంట్లతో అస్సలు తుడవకండి. ఎందుకంటే అక్కడ ఉన్న సూక్ష్మ క్రిములు మీ చేతులకు అంటుకునే ప్రమాదముంటుంది.
►మొత్తమ్మీద విషయం అర్థమైందిగా.. కరోనాకు నిజమైన మందు.. ముందు జాగ్రత్తే.. సో.. మాస్కులు ధరించండి.. భౌతిక దూరం పాటించండి.. బేఫికర్ కండి..
Comments
Please login to add a commentAdd a comment