లాక్‌డౌన్‌ ఫెయిల్‌! | People Ignore Janata Curfew in Hyderabad | Sakshi
Sakshi News home page

చప్పట్లు కొట్టేసి.. స్ఫూర్తి చుట్టేసి!

Published Tue, Mar 24 2020 8:08 AM | Last Updated on Tue, Mar 24 2020 11:52 AM

People Ignore Janata Curfew in Hyderabad - Sakshi

ప్రధాని చెప్పారని చప్పట్లు కొట్టారు...జనతా కర్ఫ్యూకి జైకొట్టారు.మరుసటి రోజే అన్నీ మర్చిపోయి మళ్లీ రోడ్డెక్కారు...సాయంత్రానికి పోలీసులు ఆపుతున్నారని తెలిసి మళ్లీ ఇంటిబాట పట్టారు...కోవిడ్‌ కట్టడిపై... ఇదీ మన సిటీజనుల సీరియస్‌నెస్‌. గ్రేటర్‌ వాసులు కరోనా తీవ్రతను లైట్‌ తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఎంతగా విన్నవిస్తున్నా...ప్రపంచం ఎంత భయపడుతున్నా...పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా మనోళ్లు పట్టించుకోవడం లేదు. కేవలం ఆదివారం ఒక్కరోజే జనతా కర్ఫ్యూ సక్సెస్‌ చేశామంటూ చప్పట్లు కొట్టేసి..అసలు స్ఫూర్తినిచుట్టేశారు. జాతి యావత్తునూ గడగడలాడిస్తోన్న కోవిడ్‌ విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను కాదని..సోమవారం ఒక్కసారిగా జనాలు తమ వ్యక్తిగత వాహనాలతో రహదారులను ముంచెత్తారు.

ఒకటి కాదు.. రెండు కాదు లక్షలాది వాహనాలు యథావిధిగా రోడ్లపైకి రావడంతో లాక్‌డౌన్‌తుస్సుమనిపించింది. వెంటనే కళ్లు తెరచిన సర్కారు..పోలీసు యంత్రాంగం...మధ్యాహ్నం నుంచి నియంత్రణ చర్యలకు శ్రీకారం చుట్టారు. పలు ఫ్లైఓవర్లనుమూసివేశారు. అడుగడుగునా చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహించినఅనంతరమే రాకపోకలకు అనుమతించారు. నిత్యావసరాల కోసమో..కూరగాయల కోసమో..ఎమర్జెన్సీ పనులపైనే బయటకు వస్తున్నామని కొందరంటున్నా..దానికొక పద్ధతుంది. సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ...గుంపులుగా రాకుండా ఉండాలి. కోవిడ్‌నియంత్రణపై ప్రభుత్వం చెబితేనో...పోలీసులు హెచ్చరిస్తేనో కాకుండా...ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తేనే ఫలితం ఉంటుంది. ప్రజలంతా కరోనా వైరస్‌ వ్యాప్తి..దాని పర్యవసానాలు ఎప్పటికప్పుడు మీడియా ద్వారా తెలుసుకుంటూనే..తమ దాకా వస్తే మాత్రం నిబంధనలు పట్టించుకోవడం లేదు. ఇలా చేస్తే కోవిడ్‌ రక్కసి విజృంభించి..మన సిటీ ఇటలీగా మారుతుందేమో..సిటీజనులారా ఒక్కసారి ఆలోచించండి. ఇకనైనా మారండి.ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ లాక్‌డౌన్‌తో కరోనాను తరిమికొట్టండి. 

సాక్షి, సిటీబ్యూరో: రోడ్లపైకి ఎక్కే క్యాబ్‌లు, ఆటోల యజమానులతో పాటు వినియోగదారులపైనా కూడా కేసులు నమోదు చేస్తామని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు. లాక్‌డౌన్‌ అంటేనే ఎక్కడి వారు అక్కడే ఉండాలని, ఆ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రజలు అనుసరించాల్సిన విధానాలపై గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్, ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావులతో కలిసి సీపీ సజ్జనార్‌ సోమవారం మీడియాకు వెల్లడించారు.    ఇప్పటికే ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వస్తున్నారన్న సమాచారం ఉందని, అందుకే తొమ్మిది చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఒకవేళ ఎవరైనా ఇతరప్రాంతం నుంచి మరోచోటకు వెళుతున్నారని తేలితేమాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   ఓలా, ఉబర్, ర్యాపిడ్‌ వాహనాల తదితర అద్దె సంస్థలుకూడా మూసివేయాలన్నారు. లాక్‌డౌన్‌ను సీరియస్‌ గా తీసుకోవాలని, ఐదుగురు మించి గుమిగూడవద్దన్నారు. ‘ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి పరిస్థితిని చేయిదాటనియవద్దు.  సాయంత్రం ఆరు తర్వాత ఫుడ్‌ డెలివరీ సంస్థలు ఆర్డర్‌ తీసుకోవద్దు. ప్రయాణాల విషయంలో ఎలాంటి కారణాలు చెప్పినా ఉపేక్షించేది లేదు. సమీపంలో ఉన్న కిరాణా దుకాణాల్లో సరుకులు కొనుక్కొని వెంటనే వెళ్లాలని సూచించారు. ఏమైనా సందేహలు, సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ1800 4250817కు, 23230811,  23230 813, 23230 814, 23230 817 ల్యాండ్‌లైన్‌లకు కాల్‌ చేయచ్చన్నారు.

లాక్‌డౌన్‌ ఫెయిల్‌!
సాక్షి, సిటీబ్యూరో: జనతా కర్ఫ్యూ స్ఫూర్తిని సిటీజనులు ఒక్కరోజుకే పరిమితం చేశారు. ఆదివారం పూర్తిగా ఇళ్లకై పరిమితమైనా...సోమవారం మాత్రం వారు సిటీ లాక్‌డౌన్‌ను పట్టించుకోలేదు. కరోనా నేపథ్యంలో పరిస్థితి తీవ్రతను స్వయంగా సీఎం వివరించి...జనం బయటకు రావొద్దని విజ్ఞప్తి చేసినా...ఎవ్వరూ పట్టించుకున్నట్లు లేదు. సోమవారం ఉదయం క్యాబ్‌లు..ఆటోలు..ఇతర ట్యాక్సీలు సిటీరోడ్లను ముంచెత్తడంతో ట్రాఫిక్‌ జాంఝాటం కనిపించింది. నిత్యావసర వస్తువుల రవాణా...కొనుగోలుకు అనుమతించడంతో కృత్రిమ కొరతను సృష్టించిన పలువురు రిటెయిల్‌ వ్యాపారులు కూరగాయల ధరలను అమాంతం పెంచేశారు. రెట్టింపు ధరలకు విక్రయించడంతో వినియోగదారులు గగ్గోలు పెట్టారు. పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నేపథ్యంలో పాలు, పండ్లు, ఇతర నిత్యావసరాల కొనుగోలు జనం ఎగబడడంతో పలు దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. కొన్ని చోట్ల వ్యాపారులు ధరలను పెంచినట్లు పోలీసులకు ఫిర్యాదులందాయి. ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి కంపెనీలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను తెరచిన వారిని పోలీసులు కౌన్సిలింగ్‌ నిర్వహించి వాటిని మూసివేయించారు. పనిచేయని కాలానికి సైతం తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని స్పష్టంచేశారు. మంగళవారం నుంచి లాక్‌డౌన్‌ ఉత్తర్వులను కట్టుదిట్టంగా అమలు చేస్తామని స్పష్టంచేశారు.

90 శాతం ఐటీ కంపెనీలు వర్క్‌ఫ్రం హోం
ఐటీకి రాజధానిగా మారిన గ్రేటర్‌ సిటీలో మంగళవారం నుంచి చిన్న, మధ్యతరహా, బహుళజాతి కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీచేశాయి. వారికి అవసరమైన ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్, సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్‌ తదితర ప్రక్రియలను పూర్తిచేసినట్లు హైసియా వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. సుమారు పదిశాతం కంపెనీలు అత్యవసర సమావేశాలు, ఇతర ముఖ్యమైన సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలకు పోలీసుల అనుమతితో కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించాయి. కోవిడ్‌ కలకలం నేపథ్యంలో మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ తదితర ప్రాంతాల్లోని సుమారు 600 ఐటీ కంపెనీల్లో స్టెరిలైజేషన్‌ ప్రక్రియను నిర్వహించారు. కోవిడ్‌ కలకలం నేపథ్యంలో ఉద్యోగులు, యాజమాన్యాలు అమలు చేయాల్సిన ప్రోటోకాల్‌ను అమలుచేస్తున్నట్లు ఐటీశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

జీఓ జారీతో మారిన సీన్‌
లాక్‌డౌన్‌ విఫలమవడంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం సోమవారం సాయంత్రం జి.ఓ.నెం.46జారీచేసి లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగాఅమలుచేశారు.
సాయంత్రం 6.30 గంటల తరవాత అత్యవసర పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారినే రాకపోకలకు అనుమతించారు. అడుగడుగునా చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు ముమ్మరం చేశారు. పలు ఫార్మసీ,ఆస్పత్రులు మినహా నిత్యావసరాలు విక్రయించే దుకాణాలను సైతం సాయంత్రం 6.30 గంటల తర్వాత మూయించారు. మంగళవారం నుంచి ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.   

ఇలా అయితే కష్టమే!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ విజ్ఞప్తులను, పోలీసుల ఆదేశాలను బేఖాతార్‌ చేస్తూ గుంపులు.. గుంపులుగా జనం రోడ్లపైకి వస్తున్నారు. రద్దీతో మార్కెట్లు, మాల్స్‌ కిక్కిరిసి పోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రమాదకరమైన కరోనా వైరస్‌ను నియంత్రించడం కష్టమేనని అంటున్నారు వైద్య నిపుణులు. చైనా, ఇటలీ, ఇరాన్, అమెరికా దేశాలను కుదిపేసిన ఈ వైరస్‌ ప్రస్తుతం మన గ్రేటర్‌ హైదరాబాద్‌లో చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఆదివారం అర్థరాత్రి నాటికి 27 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, సోమవారం కొత్తగా మరో ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 33కు చేరింది. మరో 250 మంది వరకు గాంధీ కరోనా ఐసోలేషన్‌ వార్డుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రోజు రోజుకు అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్యులు కూడా తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఏమీ చేయలేక రోగులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ఎవరి ఆరోగ్యాన్ని వారే కాపాడుకోవాలి....
ప్రస్తుతం కరోనా వైరస్‌ రెండో దశలో ఉంది. ఇప్పటికే నగరంలో రెండు థర్డ్‌కాంటాక్ట్‌ కేసులు కూడా నమోదయ్యాయి. మూడో దశకు చేరుకుంటే వైరస్‌ను నియంత్రించడం చాలా కష్టం. ఒక్కసారిగా వచ్చిపడే మాస్‌ క్యాజువాలిటినీ ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య సిబ్బంది కూడా మన వద్ద లేదు. ఆస్పత్రులు, పడకలు, ఇతర మౌలిక సదుపాయాలు చాలా తక్కువ. ఇదే జరిగితే చికిత్సల విషయంలో వైద్యులు కూడా చేతులెత్తేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తక ముందే ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడమే ఉత్తమని వైద్యులు సూచిస్తున్నారు. ‘మేం మీ కోసం ఆస్పత్రిలో ఉంటాం... మీరు మీ ఇంట్లో ఉండండి’ అంటూ పిలుపునిస్తున్నారు. వైద్యులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రోగులకు సేవలు చేస్తుంటే..సిటీజనులు మాత్రం తమకేమాత్రం బాధ్యత లేదన్నట్లు వ్యవహరిస్తుండటం ఎంత వరకు సబబని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చినప్పటికీ మనిషికి..మనిషికి కొంత దూరం పాటించాలనే నియమాన్ని కూడా కనీసం పాటించడం లేదంటే వైరస్‌ పట్ల ప్రజలకు ఎంత చిన్న చూపు ఉందో ఇట్టే అర్థం అవుతుంది. కరోనా వైరస్‌కు మందు లేదు. స్వీయ నియంత్రణ ఒక్కటే దీనికి పరిష్కారమని, ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించి, ఎవరి ఆరోగ్యాన్ని వారే కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  

నేటి నుంచి ఓపీ సేవలు బంద్‌
కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలను రద్దు చేసింది. ప్రస్తుతం గాంధీ, ఫీవర్, ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రుల్లో కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. గాంధీ, ఛాతి ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డుల్లో ప్రస్తుతం 33 మంది పాజిటివ్‌ బాధితులు చికిత్స పొందుతుండగా, మరో వంద మందికిపైగా అనుమానితులు ఉన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌వచ్చిన వారిని వెంటనే హోం ఐసోలేషన్‌కు పంపుతున్నారు. క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్న వారితో పాటు వ్యాధి లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని మాత్రం ఆయా ఆస్పత్రుల ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచుతున్నారు. ఇప్పటికే ఆయా ఆస్పత్రుల్లో ఎలక్టివ్‌ సర్జరీలను వాయిదా వేసిన ప్రభుత్వం...తాజాగా గాంధీ, ఫీవర్, ఛాతి ఆస్పత్రుల్లో ఓపీ సేవలను కూడా తాత్కాలి కంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఓపీకి బాధితులు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉండటం, వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లైతే వారి నుంచి ఇతర రోగులను విస్తరించే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ అత్యవసర సర్జరీలు మినహా ఎలక్టివ్‌ సర్జరీలన్నీ వాయిదా వేయాల్సిందిగా సూచించడంతో ఆయా ఆస్పత్రులన్నీ సర్జరీలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. 

రోగులను ఖాళీ చేయిస్తున్న అధికారులు
ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్‌ విస్తరించే ప్రమాదం ఉండటంతో..దీర్ఘకాలిక  నొప్పులతో బాధపడుతూ గత కొంత కాలంగా ఆయా ఆస్పత్రుల్లోని ఇన్‌పేషంట్‌ వార్డుల్లో వైద్య సేవలు పొందుతున్న రోగులతో పాటు డెలివరి కోసం ఆస్పత్రుల్లో చేరినప్పటికీ..ప్రసవానికి ఇంకొంత సమయం ఉన్న గర్భిణులను ఆయా ఆస్పత్రులను నుంచి డిశ్చార్జ్‌ చేయించి ఇంటికి పంపుతున్నారు. అత్యవసర రోగులు మినహా ఇతరులెవరూ ఆస్పత్రిలో లేకుండా జాగ్రత్త పడుతున్నారు. సాధారణ రోగులను ఖాళీ చేయించడంతో ఖాళీగా ఉన్న పడకలను కరోనా బాధితుల కోసం కేటాయించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆయా పడకలన్నీ కరోనా బాధితులకు అందుబాటులో ఉంచనున్నారు.  కాగా గాంధీ ఐసోలేషన్‌ వార్డులో 201 మంది విడతల వారిగా పని చేస్తున్నారు. ఇక ఫీవర్‌ ఆస్పత్రిలో 50 మంది, ఛాతి ఆస్పత్రిలో వంద మందికిపైగా పని చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్‌తో పోరాడుతున్న బాధితులకు చికిత్స అందించి, విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన తర్వాత వారిని చూసి కుటుంబ సభ్యులే కాదు ఇరుగు, పొరుగు వారు కూడా భయపడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

1306 వాహనాలు సీజ్‌
సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించి రోడ్డెక్కిన 1306 వాహనాలను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు సీజ్‌ చేశారు. రోడ్లపైకి రావొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెట్టి రోడ్డెక్కినందుకు ఈ వాహనాల్లో దాదాపు సగానిపైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఐపీసీసెక్షన్‌ 188 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో 948, సైబరాబాద్‌లో 244, రాచకొండలో 114 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఆయా కమిషనరేట్‌ల అధికారులు తెలిపారు.  కూకట్‌పల్లిలో అత్యధికంగా 100 ఆటోలు సీజ్‌ ప్రయాణికులను ఎక్కించుకొని ఆటోలు నడుపుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో అత్యధికంగా 948 ఆటోలు సీజ్‌ చేస్తే, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఒక్క కూకట్‌పల్లిలో 100 ఆటోలు సీజ్‌ చేశారు. మొత్తంగా సైబరాబాద్‌లో చూసుకుంటే 182 ఆటోలు సీజ్‌ చేశారు. వీటితో పాటు 29 ఎంసీ, తొమ్మిది కార్లు, నాలుగు తూఫాన్‌లు, 20 ద్విచక్ర వాహనాలను సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీజ్‌ చేశారు. ఇక రాచకొండ విషయానికొస్తే 66 ఆటోలు, 34 ద్విచక్ర వాహనాలు, 14 ఫోర్‌వీలర్లను సీజ్‌ చేశారు. ఇక నుంచి ఆటోలతో పాటు కార్లు, బైక్‌లు ఏవైనా రోడ్డు మీద కనిపిస్తే సీజ్‌ చేస్తామని మూడు కమిషనరేట్ల ట్రాఫిక్‌ పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement