టైప్ రైటర్. అక్షరాలను అందంగా చెక్కే అపురూప శిల్పి. కాలంతో పోటీపడి అక్షరాలను పరుగెత్తించిన యంత్రం. చెట్టుకింది ప్లీడర్లు, గవర్నమెంట్ ఆఫీసుల్లో యూడీసీలు, ఎల్‌డీసీలు, కోర్టుల్లో రిజిస్టర్లు, అకౌంటెంట్‌లు.. ఇలా ఒక్కరా, ఇద్దరా ప్రతి ఒక్కరి చేతిలో టైప్‌రైటర్ ఒక శక్తిమంతమైన సాధనమైంది. అక్షరాలను పరుగులు పెట్టించింది. రహదారులకు ఇరువైపులా టైప్‌రైటింగ్ ఇనిస్టిట్యూట్లతో టకటకమంటూ వినిపించే లయబద్ధమైన కీబోర్డు శబ్దాలు, ఉద్యోగాల కోసం టైప్‌రైటింగ్ నేర్చుకొనే విద్యార్థుల కళ్లల్లో మెరిసే ఆత్మస్థైర్యం ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక వాతావరణాన్ని సృష్టించాయి. విద్యార్హతలతో పాటు ‘టైప్ లోయర్, హయ్యర్’ తప్పనిసరైంది. ఇది ఒకప్పటి మాట. సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కంప్యూటర్‌తో పోటీపడలేక నేడు టైప్‌రైటర్ మనుగడ కష్టసాధ్యంగా మారింది.కొత్త తరానికి ఇది పాతదైపోయింది.
దీని అస్తిత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
టైప్‌రైటింగ్‌లో కనీసం 18 రకాల ఫార్మెట్లు ఉంటాయి. ప్రభుత్వ జీఓలను ఒక విధమైన ఫార్మెట్‌లో టైప్ చేస్తే వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అంశాలను మరో రకమైన ఫార్మెట్‌లో టైప్ చేస్తారు. ఉద్యోగాల కోసం చేసుకొనే దరఖాస్తులు, గవర్నమెంట్ స్టేట్‌మెంట్‌లు, అకౌంట్స్‌లో డెబిట్, క్రెడిట్‌లు, ఇన్‌వాయిస్‌లు, అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, న్యాయస్థానం వెలువరించే తీర్పులు, ఒక ఐఏఎస్ మరో ఐఏఎస్‌కు రాసే లేఖలు, పోలీస్‌స్టేషన్ ఎఫ్‌ఐ ఆర్‌లు, నివేదికలు.. ఇలా ప్రతిదానికి ఒక్కో ఫార్మెట్ ఉంటుంది. టైప్ నేర్చుకొనే వాళ్లు ఈ అన్ని ఫార్మెట్‌లలో లోయర్ హయ్యర్ స్థాయిలను పూర్తి చేస్తారు. లోయర్ స్థాయిలో నిమిషానికి 30 పదాలు, హయ్యర్‌లో 60 పదాల చొప్పున టైప్ చేయాలి. ఒక్కో కోర్సుకు 6 నెలల పరిమితి ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికే ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో, పలు సంస్థల్లో కంప్యూటర్లపై పని చేసే ఉద్యోగులు టైప్ నేర్చుకొనేందుకు మాత్రం కొంత వరకు టైప్ రైటర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో 250 వరకు టైప్ రైటింగ్ ఇనిస్టిట్యూట్లు ఉన్నాయి. వీటిలో సుమారు 400 మిషన్‌ల ద్వారా 7వేల మంది శిక్షణ పొందుతున్నారు. ఒకప్పుడు లక్షల్లో ఉన్న ఈ సంఖ్య ఇప్పుడు వేలల్లోకి పడిపోయింది.
ఇనిస్టిట్యూట్‌ల పరిస్థితి ప్రశ్నార్థకం..
టైప్‌రైటింగ్ ఇనిస్టిట్యూట్‌లు సాంకేతిక విద్యాశాఖ పరిధిలో పని చేస్తున్నాయి. ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు శిక్షణనిస్తూ ఉపాధి పొందుతున్నాయి. ఇటు నిర్వాహకులకు, అటు ఉద్యోగార్థులకు టైప్‌రైటర్‌లు ఉద్యోగావకాశంగా మారాయి. కానీ కొంతకాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ఉద్యోగ భర్తీ ప్రకటనల్లో అభ్యర్థులు తప్పనిసరిగా టైప్ లోయర్, హయ్యర్, షార్ట్‌హాండ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలనే’ నిబంధన లేకపోవడంతో ఈ కోర్సులకు ప్రాధాన్యం తగ్గింది. దీంతో ఇనిస్టిట్యూట్ల మనుగడ ప్రశార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ‘తెలంగాణ రికగ్నైజ్‌డ్ టైప్‌రైటింగ్/షార్ట్‌హాండ్ అండ్ కంప్యూటర్ అసోసియేషన్ చైర్మన్ మర్రి రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో ఇటీవల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ను సంప్రదించింది. టైప్ రైటర్‌లను కనుమరుగు చేయొద్దని, ఉద్యోగార్థులకు టైప్‌రైటింగ్, షార్ట్‌హాండ్ తప్పనిసరి చేయాలని కోరుతూ అసోసియేషన్ ప్రతినిధులువినతిపత్రం అందజేశారు.
నాడు వేల సంఖ్యలో..
ఒకప్పుడు సిటీలో అడుగడుగునా టైప్‌రైటింగ్ శిక్షణ కేంద్రాలు ఉండేవి. వీటిలో వేలాది మంది ట్రైనింగ్ పొందేవారు. కానీ కంప్యూటర్లు వచ్చిన తర్వాత టైప్ రైటర్ ప్రాభవం సన్నగిల్లింది. ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్యలో టైప్ ఇనిస్టిట్యూట్లు ఉన్నాయి. వీటి మనుగడ కూడా చాలా కష్టసాధ్యంగా మారింది.– రాజేశ్వర్, టైప్ రైటింగ్ ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు, ఈసీఐఎల్
ఇదే ఆధారం..
1979లో టైప్ ఇనిస్టిట్యూట్ పెట్టాం. మా కుటుంబ జీవోనోపాధికి ఇదే ఆధారం. పిల్లల్ని బాగా చదివించాం. మా ఇనిస్టిట్యూట్ ద్వారా లక్షలాది మందికి శిక్షణనిచ్చాం. అంతా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మొదట్లో నెలకు రూ.8 ఫీజు ఉండేది. ఇప్పుడు రూ.1000 వరకు ఉంది. – కృష్ణవేణి, వేణి టైప్‌రైటింగ్‌ఇనిస్టిట్యూట్, వారాసిగూడ
ఇనిస్టిట్యూట్లనుఆదుకోవాలి
ప్రభుత్వం టైప్‌రైటింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను గుర్తించాలి. క్రమం తప్పకుండా రెన్యువల్ చేయాలి. ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగాల్లో టైప్‌ను తప్పనిసరి చేయడం ఒక్కటే పరిష్కారం. – సతీష్, వెంకటేశ్వర టైప్‌రైటింగ్‌ఇనిస్టిట్యూట్, తార్నాక
Comments
Please login to add a commentAdd a comment