నీళ్లకోసం రోడ్డెక్కిన జనం | people protest for water | Sakshi
Sakshi News home page

నీళ్లకోసం రోడ్డెక్కిన జనం

Published Thu, May 28 2015 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM

people protest for water

సంపునకు తాళం... సిబ్బంది నిర్బంధం
గంటపాటు రాస్తారోకో...

 
 నారాయణపేట : మంచినీటి ఎద్దడిని తీర్చాలంటూ అప్పక్‌పల్లి గ్రామస్తులు బుధవారం సత్యసాయి సంపుహౌస్‌కు తాళంవేసి సిబ్బందిని నిర్బంధించారు. అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మూడు నెలలుగా సత్యసాయి నీరు గ్రామానికి అందడం లేదంటూ సిబ్బందికి అనేకసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈసందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సర్పంచ్ రమేశ్ తాగునీటి ఎద్దడిని నివారించేందుకు గ్రామ శివారులో మూడు బోర్లు వేసినా నీళ్లు పడలేదన్నారు. దీనికితోడు ఉన్న బోర్లలో భూగర్భజలాలు తగ్గడంతో నీటి సమస్య తీవ్రమైందన్నారు.

గ్రామంలో ఉన్న సత్యసాయి సంపు నుంచి ట్యాంకుకు పైపులైన్ ఉన్నా నీరందించడం లేదని వాపోయారు. ధర్నా విషయం తెలుసుకున్న సర్పంచ్ అక్కడికి చేరుకొని గ్రామస్తులకు సముదాయించేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రాస్తారోకోకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రామలింగారెడ్డి అక్కడికి చేరుకొని రాస్తారోకో చేస్తున్న యువకులపై విరుచుకుపడ్డారు. రోడ్డుపై రాస్తారోకో చేయడం... సంపుహౌస్‌కు తాళం వేయడం సరికాదని అగ్రహించారు.

రాస్తారోకోకు దిగిన సర్పంచ్ రమేశ్, గ్రామస్తులను స్టేషన్‌కు తరలించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి తన అనచరులతో పోలీసుస్టేషన్‌కు చేరుకొని సర్పంచ్‌నే పోలీస్ వాహనంలో ఎక్కించుకొని వచ్చి కేసు చేస్తారా అంటూ ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగారు. అనంతరం సత్యసాయి నీటి పథకం అధికారులతో మాట్లాడారు. త్వరలోనే పైపులైన్ లీకేజీని సరిచేస్తామని హామీ ఇచ్చారు. సొంత పూచీకత్తుపై సర్పంచ్‌ను, గ్రామస్తులను పోలీసులు వదిలేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement