సాక్షి, హైదరాబాద్: కరోనా భయం మన వాళ్లపై బాగానే ప్రభావం చూపుతోంది. గతంలో చేతుల శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతకు అంతంత మాత్రంగానే ప్రాధాన్యమిచ్చే వారిలో ఒక్కసారిగా పెద్దమార్పే వచ్చింది. కరోనా వైరస్ సోకకుండా చేతులను శానిటైజర్‌తో పదే పదే శుభ్రం చేసుకోవాలన్న ప్రభుత్వాలు, వైద్యుల సూచనలు ఈ విషయంలో బాగానే పనిచేస్తున్నట్లు కన్పిస్తోంది. గత 2 నెలల్లోనే దేశంలో దాదాపు 70 రెట్ల మేర హ్యాండ్ శానిటైజర్ వినియోగం పెరగడమే దీనికి నిదర్శనం. కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందువరకు దేశంలో ఏడాదికి 10 లక్షల లీటర్ల ఇథనాల్ ఆధారిత శానిటైజర్‌ను వివిధ అవసరాల కోసం ఉపయోగించేవారు.
ప్రధానంగా ఆసుపత్రులు, క్లినిక్‌లలో వైద్యులు, సిబ్బంది ఉపయోగించేవారు. ఇళ్లల్లో శానిటైజర్ల వినియోగం దాదాపు లేదనే చెప్పొచ్చు. అలాంటిది కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండేందుకు శానిటైజర్ వినియోగమే పరిష్కార మార్గమని తెలిశాక, దీని డిమాండ్ గత 2, 3 నెలల్లో అమాంతంగా పెరిగింది. గతంలో నెలకు లక్ష లీటర్ల కంటే తక్కువ శానిటైజర్‌ను వినియోగించగా, ఇప్పుడు ఏకంగా నెలకు దాదాపు 70 లక్షల లీటర్ల దాకా శానిటైజర్ వినియోగిస్తున్నారు. ఇళ్లల్లో, వ్యక్తిగతంగా దాదాపు మెజారిటీ ప్రజలు శానిటైజర్‌ను వాడుతున్నారు.
1,200 సంస్థలకు కొత్త లైసెన్స్‌లు..
శానిటైజర్ల వినియోగానికి ఒక్కసారిగా పెద్దమొత్తంలో డిమాండ్ పెరగ డంతో దీని తయారీ కోసం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఇథనాల్ ఆధారిత శానిటైజర్ల ఉత్పత్తికి కొత్తగా 1,200 సంస్థలకు లైసెన్స్‌లు ఇచ్చింది. షుగర్ కంపెనీలు, డిస్టిలరీలతో పాటు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు ఈ లైసెన్స్‌లు ఇచ్చారు. శానిటైజర్ తయారీతో పాటు బాటిలింగ్ చేసి, చిన్న ప్యాక్‌ల్లో నింపి అమ్మేందుకు సిద్ధం చేసేలా ఈ సంస్థలు ఉత్పత్తి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఏప్రిల్ తర్వాత వీటిలో చాలా యూనిట్లు ఉత్పత్తిని మొదలుపెట్టి ఇప్పటివరకు 3 కోట్ల లీటర్ల వరకు ఉత్పత్తి చేశాయి. దీంట్లో ఇప్పటికే 2 కోట్ల లీటర్ల శానిటైజర్‌ను విక్రయించడంతో దేశంలో నెలకు దాదాపుగా 70 లక్షల లీటర్ల దాకా ప్రజలు ఉపయోగిస్తున్నట్లు తేలిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు ఇక్కడి అవసరాలకు మించి ఉత్పత్తి జరుగుతుండటంతో ఎగుమతి చేసేందుకు కూడా ఆయా సంస్థలు సిద్ధమవుతున్నాయి. దేశంలో శానిటైజర్ల కొరత ఏర్పడుతుందేమోనన్న భయంతో శానిటైజర్ల ఎగుమతిని తొలుత కేంద్రం నిషేధించింది. ప్రస్తుతం దేశీయ అవసరాలకు మించి ఉత్పత్తి అవుతుండటంతో శానిటైజర్ల ఎగుమతులపై నిషేధాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఎత్తేసింది. ఇది అమల్లోకి వచ్చిన వెంటనే కొన్ని కంపెనీలు ఈ ఉత్పత్తుల ఎగుమతిని కూడా ప్రారంభించాయి. శానిటైజర్లు విరి విగా అందుబాటులోకి రావడంతో గతంతో పోలిస్తే ధరలు కొద్దిమేర తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment