శీనన్నకు జేజేలు | peoples given grand welcome to ponguleti srinivasa reddy | Sakshi
Sakshi News home page

శీనన్నకు జేజేలు

Published Wed, Oct 15 2014 3:05 AM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM

శీనన్నకు జేజేలు - Sakshi

శీనన్నకు జేజేలు

‘జై జగన్.. జైజై శీనన్న..వైఎస్‌ఆర్‌సీపీ జిందాబాద్’ అనే నినాదాలు జిల్లా సరిహద్దు మొదలు ఖమ్మం వ రకు హోరెత్తాయి. వైఎస్‌ఆర్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులై తొలిసారి మంగళవారం జిల్లాకు వచ్చిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆ పార్టీ కేడర్ బ్రహ్మరథం పట్టింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి కనీవినీ ఎరుగనిరీతిలో ఆయనకు స్వాగతం పలికారు. బాణసంచా కాలుస్తూ..పూలవర్షం కురిపిస్తూ..స్వాగతించారు. మహిళానేతలు మంగళహారతులు పట్టారు. ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు శీనన్నను ఆత్మీయంగా ఆహ్వానించారు.     
 
సాక్షి, ఖమ్మం: ‘మీ శీనన్న వస్తున్నాడు.. ఘనస్వాగతం పలకాలని భారీగా తరలివచ్చారు.. మీలో సందేహం, బాధ, సంతోషం ఉంది. కానీ మీ అభిమానాన్ని ఎప్పటికీ మరువను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఎప్పటికీ మిమ్మల్ని విస్మరించను’ అని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ కేడర్‌కు భరోసా ఇచ్చారు. పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి మంగళవారం జిల్లాకు వచ్చిన ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.

ఈ సభకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, ఎంపీ పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు.  పార్లమెంట్‌కు వచ్చిన 543 మంది ఎంపీల్లో తనను ఒకడిగా పంపిన జిల్లా ప్రజల ఆత్మీయ అభిమానాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానన్నారు. ఓ కుటుంబ సభ్యుడిగా ఇంతకు ముందు ఎలా ఉన్నానో.. పార్టీ బాధ్యతలు ఇచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటానని చెప్పారు. జిల్లా ప్రజలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి, పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పై చూపిన అభిమానంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పరంగా ఖమ్మంజిల్లా ఆదర్శంగా నిలిచిందన్నారు. దీనికి కారణం పార్టీ కేడర్ సహాయ సహకారాలు, అహర్నిశలు కృషి చేసిన ఫలితమేనని కొనియాడారు.

జిల్లా ప్రజలు తనపై ఉంచిన నమ్మకంతో జిల్లా అభివృద్ధికి  కృషి చేస్తానన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వారి పక్షాన ఉద్యమిస్తూ ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామన్నారు. జిల్లాతోపాటు తెలంగాణ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి 2019 ఎన్నికల నాటికి ఒక శక్తిగా మారుస్తామని చెప్పారు. హుదూద్ తుపానుతో దెబ్బతిన్న బాధితులను ఆదుకోవడానికి వైఎస్సార్‌సీపీ ముందంజలో ఉంటుందన్నారు. మండల పార్టీ నేతలు బాధితుల సహాయం కోసం విరాళాలు సేకరించి నష్టపోయిన వారికి అందించాలని సూచించారు.

పది జిల్లాల్లో పార్టీ బలోపేతం: పాయం
పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నమ్మకంతో శీనన్నపై బాధ్యతలు పెట్టారు..తెలంగాణలోని పది జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ బలోపేతం అవుతుందని జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా సమస్యలను పార్లమెంట్ సమావేశాల్లో నిలదీస్తూ పొంగులేటి ప్రజల గొంతుకై నిలిచారన్నారు. తెలంగాణ సారథిగా వైఎస్సార్‌సీపీని బలీయమైన శక్తిగా శీనన్న తీర్చిదిద్దుతారన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న శీనన్నకు పార్టీ శ్రేణులు ఊహించని రీతిలో ఘనస్వాగతం పలకడం అభినందనీయమన్నారు. కార్యకర్తల కష్టాల్లో శీనన్న పాలుపంచుకుంటారని,  వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.

అధికార ప్రభుత్వం కళ్లు తెరవాలి: తాటి
టీఆర్‌ఎస్ ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసింది.. వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి హామీలను అమలు చేయాలన్నారు. దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు అంటూ సంక్షేమ పథకాల అమలును ముఖ్యమంత్రి కేసీఆర్ దాటవేస్తున్నార ని విమర్శించారు. రేషన్‌కార్డు దరఖాస్తుల పేరుతో ప్రజలు ఇచ్చిన అర్జీలను డ్రమ్ముల్లో వేస్తున్నారని, అవి నిండిన తర్వాత ఎక్కడ వేస్తారని ప్రశ్నిం చారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నమ్మకంతో శీనన్నపై బాధ్యతలు పెట్టారని, తెలంగాణలోనే వైఎస్సార్‌సీపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు.

శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేయడం ద్వారా రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ  తెలంగాణ వర్కింగ్ కమిటీ సభ్యులు నల్లా సూర్యప్రకాశరావు అన్నారు. వైఎస్సార్‌సీపీ సత్తా చాటిన ఖమ్మంజిల్లాలాగా తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో పొంగులేటి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని వర్కింగ్ కమిటీ సభ్యులు, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

సభలో పార్టీ రాష్ట్ర నాయకులు కొండా రాఘవరెడ్డి, వీఎల్‌ఎన్ రెడ్డి, గున్నం నాగిరెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి తెల్లం వెంకట్రావు,  పాలేరు, ఖమ్మం, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల ఇన్‌చార్జులు సాధు రమేష్‌రెడ్డి, కూరాకుల నాగభూషణం, మట్టా దయానంద్, బొర్రా రాజశేఖర్, జిల్లా అధికార ప్రతినిధులు ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఆకుల మూర్తి, కొదమసింహం పాండురంగాచార్యులు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండి.ముస్తఫా, నగర పార్టీ అధ్యక్షులు తోట రామారావు, మహిళా విభాగం జిల్లా పార్టీ అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, టీచర్స్ విభాగం అధ్యక్షులు కొత్తపల్లి గురుప్రసాద్, జిల్లా నాయకులు ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, షర్మిలా సంపత్, అశోక్‌రెడ్డి, కొత్తకొండ్ల శ్రీలక్ష్మి, జల్లేపల్లి సైదులు, పత్తి శ్రీనివాస్, ఏలూరి కోటేశ్వరరావు, కాంపెల్లి బాలకృష్ణ, భీమా శ్రీధర్, భాస్కర్‌నాయుడు,షకీనా, జ్యోతిర్మయి, అప్పిరెడ్డి, సత్యం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement