నేనే కమిషనర్.. కాదు నేనే.. | peoples have concern on both commissioners | Sakshi
Sakshi News home page

నేనే కమిషనర్.. కాదు నేనే..

Published Tue, Sep 23 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM

నేనే కమిషనర్.. కాదు నేనే..

నేనే కమిషనర్.. కాదు నేనే..

హుస్నాబాద్ : కార్యాలయం ఒక్కటే.. కానీ కమిషనర్లు ఇద్దరు.. ఇది హుస్నాబాద్ నగర పంచాయతీలో సోమవారం చోటుచేసుకున్న విచిత్ర పరిస్థితి. దీనికి  ఇటీవల చోటుచేసుకున్న బదిలీ అనంతర పరిణామాలే కారణం. ఇక్కడి కమిషనర్ కూచన ప్రభాకర్‌ను ఈ నెల 15న ప్రభుత్వం వరంగల్ కార్పొరేషన్‌కు, సిరిసిల్లలో పని చేస్తున్న సుధాకర్‌గౌడ్‌ను హుస్నాబాద్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సుధాకర్‌గౌడ్ 16న విధుల్లో చేరారు. అయితే ఈ బదిలీని సవాల్ చేస్తూ ప్రభాకర్ రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ప్రభాకర్‌కు అనుకూలంగా ట్రి బ్యునల్ శనివారం స్టేటస్ కో జారీ చేసింది.
 
సోమవారం బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై ఏర్పాటు చేసిన సమావేశానికి ఇద్దరు కమిషనర్లు హాజరయ్యారు. ఒకరి పక్కనే ఒకరు కూర్చున్నారు. కార్యాలయానికి వచ్చిన కౌన్సిలర్లు అసలు కమిషనర్ ఎవరని ప్రశ్నించారు. కౌన్సిలర్ గాదపాక రవీందర్, బీజేపీ నాయకుడు కవ్వ వేణుగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకుడు అయిలేని మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడుతూ పండుగ ఏర్పాట్ల గురించి ఎవరితో చర్చించాలని అడిగారు.

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పరిస్థితిలో మార్పు రాలేదు. వైస్‌చైర్మన్ బొలిశెట్టి సుధాకర్, పలువురు వార్డు కౌన్సిలర్లు గోవింద్ రవి, ఇంద్రాల సారయ్య, కామిరెడ్డి రామేశ్వర్‌రెడ్డి,  కాంగ్రెస్‌నాయకులు మైల కొంరయ్య, బొల్లి శ్రీనివాస్ వచ్చి చైర్మన్ వివరణ ఇవ్వాలని కోరారు.  ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే నడుచుకుంటామని, ట్రిబ్యునల్ తీర్పు అమలు అధికారులు చూస్తారని చైర్మన్ చంద్రయ్య బదులిచ్చారు. ఈ వివాదంపై చైర్మన్ రీజినల్ డెరైక్టర్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఆర్‌డీ సలహా మేరకు ప్రభాకర్ ఆయన వద్దకు వెళ్లగా సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేశారు.
 
నేను విధుల్లోనే ఉన్నాను.. : సుధాకర్‌గౌడ్
ఈనెల 16న విధుల్లో చేరాను. ప్రభాకర్ రిలీవ్ అయ్యారు. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించేటప్పుడు చార్జీ ఇవ్వడమనేది ఉండదు. పైగా బదిలీ అనంతరం ప్రభాకర్‌కు స్టేటస్‌కో వచ్చింది.
 
నేను చార్జీ ఇవ్వలేదు.. రిలీవ్‌కాలేదు.: ప్రభాకర్
బదిలీ జరిగిన తర్వాత నేను ఎవరికీ చార్జీ ఇవ్వలేదు. రిలీవ్‌సైతం కాలేదు. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు విధుల్లో చేరేందుకు వచ్చాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement