
సాక్షి, దుబ్బాక : ఓ గొడవలో పోలీసుల జోక్యం వ్యక్తి మృతికి కారణమైంది. విచారణ నిమిత్తం వచ్చిన తమకే అడ్డు వస్తారా అని హెడ్‌కానిస్టేబుల్ బూటు కాలితో తన్నడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. కోపోద్రిక్తులైన గ్రామస్తులు పోలీస్‌స్టేషన్ ఎదుట మృతదేహంతో బైఠాయించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన శుక్రవారం సిద్దిపేట జిల్లా రాయపోలు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గజ్వేల్‌లోని ఓ సామిల్‌లో పనిచేసే రాయపోలు మండల కేంద్రానికి చెందిన తుప్పతి యాదగిరి గురువారం రాత్రి యథావిధిగా పనికి వెళ్లాడు.
కాగా, వారి ఇంటిపక్కన ఉన్న కృష్ణ అర్ధరాత్రి దాటిన తర్వాత యాదగిరి ఇంటి తలుపు తట్టాడు. తలుపు తీసిన యాదగిరి భార్య అతన్ని కోపగించుకుని పంపించేసింది. అయితే తనపై అఘాయిత్యం చేసేందుకు రాత్రి కృష్ణ వచ్చాడని శుక్రవారం ఉదయం ఆమె బావ గౌరయ్య (45)కు తెలిపింది. దీంతో తన తమ్ముడి భార్య పట్ల కృష్ణ ప్రవర్తనపై కోపగించుకున్న గౌరయ్య, తమ్ముడు యాదగిరికి ఫోన్ చేసి వెంటనే రమ్మన్నాడు. ఇద్దరూ కలసి కృష్ణ ఇంటికి వెళ్లగా అతను ఇంట్లోనే తలుపులు వేసుకుని పోలీసులకు ఫోన్ చేశాడు. వెంటనే స్థానిక హెడ్ కానిస్టేబుల్ యాదగిరి, హోంగార్డు సంతోష్‌లు అతని ఇంటికి వెళ్లి కృష్ణను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన యాదగిరి, గౌరయ్యలు పోలీసుల వాహనానికి అడ్డుతగిలారు. హెడ్‌కానిస్టేబుల్ యాదగిరి తమకు అడ్డుగా వస్తారా.. అంటూ ఆగ్రహంతో బూటుకాలితో గౌరయ్య పొట్టపై పలుమార్లుతన్నాడు. కిందపడిపోయిన గౌరయ్యను స్థానికులు ప్రాథమికారోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు గౌరయ్య మృతిచెందాడని ధ్రువీకరించారు.
పోలీస్‌స్టేషన్ ఎదుట స్థానికుల ఆందోళన
గౌరయ్య మృతికి పోలీసు కానిస్టేబుల్ యాదగిరే కారణమంటూ మృతదేహంతో స్థానికులు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. గ్రామస్తులు గంటకు పైగా ధర్నా చేయడంతో గజ్వేల్–రామాయంపేట రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పరిస్థితి అదుపుతప్పుతోందని భావించిన పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించారు.
గజ్వేల్, హుస్నాబాద్ ఏసీపీలు నారాయణ, మహేందర్‌లతో పాటు పలువురు సీఐలు, దాదాపు 10 పోలీసుస్టేషన్‌లకు చెందిన సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఓ దశలో పోలీసులు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం ఏసీపీలు గ్రామపెద్దలతో మాట్లాడి మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment