ప్రశ్నించినందుకు ప్రాణం తీశారు!
► ఎద్దులు పొలంలో పడటంతో ఇరు వర్గాల ఘర్షణ
►భార్య, తండ్రితో కలిసి వృద్ధుడిపై పిడిగుద్దులు
►ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి..
మాడ్గుల: ఎద్దులు తన వ్యవసాయ పొలంలోకి వచ్చి మోటారు పైపులను తొక్కి ధ్వంసం చేశాయని, నీటి కుండలను పగలగొట్టాయని ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి పిడిగుద్దులకు దారి తీసింది. ఈ ఘటనలో గాయపడిన వృద్ధుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సీఐ చంద్రకుమార్ కథనం ప్రకారం.. మాడ్గుల మండలంలోని ఇర్విన్ దిల్‌వార్‌ఖాన్‌పకి చెందిన షేక్ ముస్తాఫా (65) తన పొలం వద్ద ఉన్నాడు.
సాయంత్రం దాయాదుల ఎద్దులు తన పొలంలోకి ప్రవేశించి మోటారు పైపులను తొక్కి ధ్వంసం చేయడంతో పాటు నీటి కుండలను పగులగొట్టాయి. దీంతో ముస్తాఫా తన దాయాదులైన షేక్ ఫారూఖ్‌ను ఎద్దులు పొలంలోకి వదిలివేస్తే ఎలా.. పైపులు, కుండలు పగులగొట్టాయంటూ ప్రశ్నించాడు. దీంతో మాటామాటా పెరిగి దాడికి దారితీసింది. ఇరు కుటుంబాల మధ్య భూవివాదం ఉన్న నేపథ్యంలో పాత కక్షలతో పెట్టుకున్న ఫారూఖ్ అతని భార్య గౌసియాభేగం, తండ్రి లాల్‌మహ్మద్‌లతో కలిసి ముస్తాఫాపై దాడికి దిగి పిడిగుద్దులు కురిపించారు.
తీవ్ర గాయపడిన ముస్తాఫాను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆమనగల్లుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుమారుడు అమీరుద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ చంద్రకుమార్ చెప్పారు.