పెట్రో ధరల పెంపుపై విపక్షాలు భగ్గుమన్నాయి. శనివారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ, దళిత సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు. పలుచోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సంగారెడ్డిలో తోపుడు బండిపై బైక్‌లను ఉంచి తాళ్లతో లాగారు. రామాయంపేటలో ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపారు. జగదేవ్‌పూర్‌లో కాంగ్రెస్, టీడీపీ నాయకులు రాస్తారోకో చేశారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
సీపీఎం వినూత్న నిరసన
సంగారెడ్డి మున్సిపాలిటీ : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జయరాజ్ డిమాం డ్ చేశారు. పెంచిన ధరలకు నిరసనగా స్థానిక సుందరయ్య భవన్ నుంచి కొత్త బస్టాండ్ వరకు తోపుడు బండ్లపై బైక్‌లను ఉంచి తాళ్లతో లాగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ధరలను పెంచి పేద, మధ్య తరగ తి వారిపై మోయలేని భారం వేస్తున్నారని విమర్శించారు. తాజా ఇంధన ధరలతో నిత్యావసర సరుకులతోపాటు, రవాణా చార్జీలు పెరిగే అవకాశం ఉందన్నారు. కార్పొరేట్ సంస్థలకు రాయితీని ప్రకటిస్తున్న ప్రభుత్వం పేద, మధ్యతరగతి వారికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు సాయిలు, అశోక్, యాదగిరి, బాలరాజు, మహబూబ్, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో...
దుబ్బాక: పెట్రో ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మచ్చ శ్రీని వాస్, తెలంగాణ రాష్ట్ర దళిత బహుజన శక్తి జిల్లా కార్యదర్శి బిట్ల జయాకర్ మాట్లాడుతూ... బీజేపీ ప్రభుత్వం ఇంధన చార్జీలు పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజలపై పెను భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన గతే బీజేపీ సర్కార్‌కు పడుతోందని వారు హెచ్చరించారు. అనంతరం తహశీల్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు సత్యనారాయణ, భరత్‌కుమార్, ఆస అభినయ్, కిరణ్, అజిద్ పాషా, టీడీబీఎస్ నాయకులు మాడ్గుల రమేశ్, సుధాకర్, కుమార్, విజయ్, నాగరాజు పాల్గొన్నారు.
టీడీబీఎస్ ఆధ్వర్యంలో...
సిద్దిపేట అర్బన్: తెలంగాణ దళిత బహుజన శక్తి ఆధ్వర్యంలో సిద్దిపేటలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీడీబీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు దేవి రవీందర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి ఐరేని రమేష్, సిద్దిపేట మండల అధ్యక్షుడు నర్సయ్య, నాయకులు నర్సింలు, మల్లేశం, రాములు, గణేశ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, టీడీపీ నేతల రాస్తారోకో
జగదేవ్‌పూర్: ఇంధన ధరల పెంపును నిరసిస్తూ శనివారం సాయంత్రం కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. జగదేవ్‌పూర్‌లోని గణేశ్‌పల్లి చౌరస్తాలో గంటపాటు రాస్తారోకో చేయడంతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్‌రావు మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డగోలుగా పెంచడం దారుణమన్నారు. కార్యక్రమంలో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు గుడాల శేఖర్, శరత్, శివలింగం, భూపాల్‌రెడ్డి, బాలమల్లు, సీతయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆటోను తాడుతో లాగి నిరసన..
రామాయంపేట: దళిత సంఘాల ప్రతినిధులు తాడుతో ఆటోను లాగి వినూత్న నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మాసాయిపేట మల్లేశం, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పాతూరి రాజు, కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బైరం కుమార్, నాయకులు దుబాసి సంజీవు, మేకల భూదయ్య, గావు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
‘పెట్రో’ పెంపుపై భగ్గు..
Published Sat, May 16 2015 11:31 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement