
ఉప ఎన్నికలో రేసుగుర్రం నేనే: పిడమర్తి
తొర్రూరు (వరంగల్): తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అవకాశం ఇస్తే.. వరంగల్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికలో రేసుగుర్రాన్ని తానే అవుతానని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. వరంగల్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దళిత నాయకుడిగా కడియం శ్రీహరి.. డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగినందుకు స్వాగతించాలే తప్ప.. ఓర్వలేక, జీర్ణించుకోలేక ఎర్రబెల్లి దయాకర్‌రావు పదేపదే వ్యక్తిగత, ఇతర విమర్శలకు దిగడం మానుకోవాలన్నారు.
డిప్యూటీ సీఎం పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ, నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తున్నారని తెలిపారు. అయితే ఎక్కడ తన ఉనికిని కోల్పోతాననే భయం, ఈర్ష్యతో దయాకర్‌రావు విమర్శలు చేస్తున్నాడని, వాటిని మానుకోకుంటే ఆయన ఇంటి ఎదుట చావుడప్పు కొడతామని రవి హెచ్చరించారు.