
ఉత్కంఠ
- కేసీఆర్ మంత్రివర్గంలో చోటెవరికో...
- చందూలాల్, చారి, సురేఖ, రాజయ్య ధీమా
- రేసులో వినయ్‌భాస్కర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
- ‘గులాబీ’ అధినేత నిర్ణయంపై ఆసక్తి
సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ తొలి ప్రభుత్వంలో జిల్లా నుంచి మంత్రులు ఎవరుంటారనే విషయంపై ఉత్కంఠ పెరుగుతోంది. మంత్రివర్గం ఏర్పాటు చేసేందుకు ఒక్క రోజే గడువు ఉండడంతో చోటు కోసం ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 12 అసెంబ్లీ స్థానాలున్న జిల్లాలో టీఆర్‌ఎస్ ఏకంగా 8 స్థానాలను గెలుచుకుంది. దీనిని బట్టి జిల్లాకు రెండు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ నేతలు అజ్మీరా చందూలాల్, సిరికొండ మధుసూదనాచారి, టి.రాజయ్య హైదరాబాద్‌లోనే ఉండి మంత్రి పదవి విషయంలో కేసీఆర్ వద్ద జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా తమ మార్గాల్లో క్యాబినెట్‌లో బెర్త్ కోసం ప్రయత్నిస్తున్నారు.
ములుగు నుంచి గెలిచిన అజ్మీరా చందూలాల్ మంత్రి పదవిపై ఆశతో ఉన్నారు. గిరిజనుల కోటాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉండడం చందూలాల్‌కు సానుకూలంగా ఉంది. తెలంగాణలో లంబాడ వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో మంత్రి పదవి కోసం చందూలాల్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. బీసీ సామాజికవర్గం కావడం తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. మంత్రి పదవి కోసం ఆయన హైదరాబాద్‌లో మకాం వేసి జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ టీఆర్‌ఎస్‌కు సంబంధించి జిల్లాలో సీనియర్ ప్రజాప్రతినిధి. 2009లో జిల్లాలో వినయభాస్కర్ ఒక్కరే టీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. వినయభాస్కర్ మూడోసారి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఉద్యమానికి సంబంధించిన అన్ని సమయాల్లోనూ కీలకంగా వ్యవహరించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు విధేయుడిగా ఉన్న వినయభాస్కర్... మంత్రి పదవిపై ఆశతో ఉన్నారు.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖకు మహిళా కోటా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన మహిళా ఎమ్మెల్యేల్లో కొండా సురేఖ సీనియర్‌గా ఉన్నారు. వరంగల్ తూర్పులో బస్వరాజు సారయ్యపై విజయం సాధించడం.. మహిళా కోటా సురేఖకు అనుకూలంగా ఉండనుంది. డిసెంబరులో జరగనున్న వరంగల్ నగర పాలక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో వరంగల్ జిల్లా కోటాపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని కొండా వర్గీయులు భావిస్తున్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య మంత్రివర్గంలో స్థానంపై ధీమాతో ఉన్నారు. సామాజిక సమీకరణలు తనకు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమవుతుందని రెండేళ్ల క్రితం జరిగిన ప్రచారాన్ని ఎదుర్కొవాలని చూస్తున్న తరుణంలో టి.రాజయ్య కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌లో చేరి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. దళిత వర్గంలో సీనియర్ ఎమ్మెల్యేగా అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై భారీ మెజారిటీతో విజయం సాధించిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి మొదటి నుంచి కేసీఆర్‌తో సాన్నిహిత్యం ఉంది. పార్టీకి ఇబ్బందులున్న సమయాల్లో ‘సహకారం’ అందించినందున ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి మంత్రి పదవి వస్తుందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారికి మంత్రి పదవుల ఇవ్వకూడదని ఏమైనా విధానాన్ని అమలు చేస్తే తప్పించి... ముత్తిరెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని జనగామలో గులాబీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణలో అత్యధిక మెజారిటీ సాధించిన మొదటి మూడో స్థానంలో నిలిచిన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు ప్రభుత్వ విప్ వంటి పదవి వరించే పరిస్థితి కనిపిస్తోంది. ఎంఎస్‌పీ అధినేత మంద కృష్ణపై విజయం సాధించడం రమేశ్‌కు అనుకూలంగా మారింది.