
టీవీ-9 కార్యాలయాన్ని తీసెయ్యండి
- లేకుంటే తీవ్ర ఆందోళన
- తెలంగాణ ఎమ్మెల్యేలను హీనంగా చూస్తారా..?
- కార్యాలయం ఎదుట ధర్నా
బంజారాహిల్స్: తెలంగాణ ముఖ్యమంత్రి కే సీఆర్‌తోపాటు తెలంగాణ శాసనసభ్యులను కించపర్చేలా కథనాలు ప్రసారం చేసిన టీవీ-9 చానల్‌ను వెంటనే ఇక్కడినుంచి తీసేయాలంటూ నవతెలంగాణ టీఆర్‌ఎస్ బ్రాహ్మణ, అర్చక సేవాసంఘం సభ్యులు శనివారం పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. తెలంగాణ అడ్వకేట్ల జేఏసీ సభ్యులతోపాటు అర్చకులు పెద్దసంఖ్యలో ఇక్కడికి చేరుకొని తెలంగాణ శాసనసభ్యులకు టీవీ-9 తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మా ఎమ్మెల్యేలను పాచిపోయిన కల్లుతో పోలుస్తారా..? టూరింగ్ టాకీస్‌లో కూర్చొండే ముఖాలంటారా..? అని తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇక్కడినుంచి టీవీ-9 కార్యాలయాన్ని ఎత్తివేయకుంటే మళ్లీ ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సంఘం అధ్యక్షుడు రాహుల్ దేశ్‌పాండే, సీతారామశర్మ, శ్రీకాంత్‌శర్మ, సాయికుమార్‌శర్మ, వెంకన్న పంతులు, సంజీవరావు, శరత్‌శర్మ, గణేష్‌శర్మ తదితరులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి అక్కడ్నించి తరలించారు.
ఆ చానెల్ వైఖరి దారుణం
అంబర్ పేట: తెలంగాణ శాసనసభ్యులను అవహేళన చేస్తూ టీవీ9 న్యూస్‌చానెల్ కథనాలను ప్రసారం చేయడాన్ని ఆం ధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్(ఏపీడబ్ల్యూజేఫ్), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్‌లు తీవ్రంగా ఖండించాయి.
మీడియాలో ప్రమాణాలు పడిపోయాయని అన్నివర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న తరుణంలో ఇలాంటి చర్యలకు పాల్పడడం అత్యంత దారుణమ ని ఫెడరేషన్ భావిస్తోందని ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధానకార్యదర్శి జి.ఆంజనేయులు, టీడబ్ల్యూజేఎఫ్ కన్వీనర్ బసవపున్నయ్యలు అన్నారు. తప్పుచేశామని టీబీ-9 చానెల్ క్షమాపణలు చెప్పినప్పటికీ ఆ ధోరణి ప్రజాస్వామ్య విలువలను, మీడియా ప్రతిష్టను ఎంతమాత్రం నిలబెట్టేవిగా లేవన్నారు.