హైదరాబాద్: వ్యవసాయ రుణమాఫీ పత్రాలను రైతులకు అందించడంలో అధికారులు చేస్తున్న జాప్యంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ పత్రాలను వెంటనే రైతులకు అందించాలని పదేపదే చెబుతున్నా అది కార్యరూపం దాల్చకపోవడం క్షమార్హం కాదన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో వ్యవసాయ అభివృద్ధి, మిషన్ కాకతీయ కార్యక్రమాలపై ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్యతోపాటు తొమ్మిది జిల్లాలకు చెందిన వ్యవసాయ, ఉద్యానవనశాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ రుణమాఫీ పత్రాలను ఈ నెల 16 నుంచి 21 లోగా రైతులకు అందించాలన్నారు. ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణపై రైతులకు ప్రచారం ద్వారా అవగాహన కల్పించాలన్నారు. రుణమాఫీ ప్రతాల అందజేతలలో నిజామాబాద్, నల్లగొండ జిల్లాలు ముందుండగా, మహబూబ్‌నగర్ వెనుకబడి ఉందని, దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
‘మిషన్’తో రాష్ట్రం సస్యశ్యామలం: హరీశ్
‘మిషన్ కాకతీయ’కు సహకరించేందుకు అనేక సంస్థలతోపాటు వ్యక్తులు కూడా ముందుకు వస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చెరువుతో ముడిపడి ఉందని, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు బోర్లు, చెరువులు, బావులు ఎండిపోవడమే కారణమని పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో ‘మిషన్ కాకతీయ’ ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మారుస్తామన్నారు. ‘మిషన్ కాకతీయ’కు స్పందించిన ఆమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీ... ఈ పథకాన్ని అధ్యయనం చేసేందుకు లక్ష డాలర్లను కేటాయించి ఐదుగురు విద్యార్థులను రాష్ట్రానికి పంపించిం దని మంత్రి చెప్పారు.
రుణమాఫీ పత్రాల పంపిణీలో జాప్యమా?
Published Tue, Feb 3 2015 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM
Advertisement