‘పోలవరం’ రద్దు చేయాలి
కోదండరాం డిమాండ్ తెలంగాణ వచ్చిన సంతోషం లేదని ఆవేదన
ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం
కాంట్రాక్టర్ల మేలుకే పోలవరం
గ్రామ సభలను పరిగణనలోకి తీసుకోవాలి
ఆర్డినెన్స్‌పై చంద్రబాబు సమాధానం చెప్పాలి
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను మార్చడం కాదు ఆదివాసీల ఉనికినే కనుమరుగు చేయనున్న పోలవరం ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలనే అంశాన్ని ఆది వాసీలు ముందుకు తేవాలని తెలంగాణ రాజకీయ జెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. కేంద్రప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ వ్యతిరేకించే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఆర్డినెన్స్ పార్లమెంట్‌లో చట్టం కాకముందే ఉద్యమాన్ని ఉదృతం చేస్తే న్యాయం జరుగుతుందని కోదండరాం అన్నారు. కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చడానికే ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారని, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం లో రైతుల, ప్రజల ప్రయోజనాలు ఏమీలేవని ఆయన పేర్కొన్నారు. ఒక రాష్ట్రంలోని ముంపు ప్రాంతాలను మరో రాష్ట్రానికి తరలించడం దేశంలో ఇప్పటి వరకు జరుగలేదన్నారు. సరిహద్దులను ప్రజల నిర్ణయాల మేరకు ఏర్పాటు చేయాలి తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.పెసా చట్టం ప్రకారం ముంపు గ్రామాల గ్రామసభలు, మండల పరిషత్‌ల తీర్మానాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్డినెన్స్‌పై తన వైఖరి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని, ఈ అంశాన్ని తాను శాసనమండలిలో లేవనెత్తనున్నట్టు చెప్పారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్యను అప్రజాస్వామికంగా అరెస్టు చేశారన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు శ్రీరాంనాయక్, సిపిఎం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, నాయకులు వెంకటరమణ, ధర్మానాయక్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీల మునకతో తీరని వ్యథ
సుందరయ్య కళానిలయంలో ఆదివారం తెలంగాణ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ విజయోత్సవ సభలో కోదండరాం మాట్లాడుతూ, తెలంగాణ వచ్చినా మనలో పూర్తి సంతోషం లేదన్నా రు. ఆదివాసీ సమాజం మన కళ్ల ముందే మునిగిపోతుందనే బాధ ఉందన్నారు. అనేక రూపాల్లో పోరాటాలు చేయడం వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. ఇది ఆంధ్రా వాళ్ల ఆధిపత్యం నుంచి బయటపడటానికి జరిగిన పోరాటమన్నారు. ఐతే పోలరం ప్రాజెక్ట్‌వల్ల ఆదివాసీలు మునిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలు కాకుండా బలమైన సామాజిక వర్గం అక్కడ ఉంటే ఆ ప్రాజెక్టును నిర్మించేవారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నిజమైన మానవతావాది అయితే ప్రాజెక్టు నిర్మాణం గురించి ఆలోచించాలన్నారు. కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని అన్నారు. ముంపునకు గురయ్యే ఆదివాసీలకు న్యాయం జరిగేలా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజల కలలను సాకారం చేయాలన్నారు. తెలంగాణ వచ్చిం దని సంబరాలు చేసుకోవడం కాదు వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు జూలూరి గౌరిశంకర్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యోగులు అవినీతిలో మునిగిపోవద్దని కోరారు. జాయింట్ యాక్షన్ కమిటి చైర్మన్ జగన్‌మోన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, ప్రొఫెసర్ హరగోపాల్, రాజకీయ విశ్లేషకులు వి.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.