డీసీపీ తప్సీర్ ఇక్బాల్ తెలిపిన వివరాల ప్రకారం ... సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరికి చెందిన చెరుకు నగేష్ అలియాస్ కార్తిక్(30) 2011 నుంచి తెలుగురాష్టాల్లో 21 చోరీ కేసుల్లో నిందితుడు. విశాఖపట్టణం మునగపాక మండలం చెరుకుకొండ గ్రామానికి చెందిన ఎల్లపు నాగేశ్వరావు అలియాస్ నాగా(29) మణికొండలో నివాసముంటున్నాడు. ఇతను కూడ అనేక చోరీల కేసులో నిందితుడు. జైలుకు కూడా వెళ్లాడు. జైళ్లలో ఉన్నప్పుడే నగేష్, నాగేశ్వరావులకు పరిచయం ఏర్పడింది. 2016 మే నెలలో జైలు నుంచి ఇద్దరూ విడుదల అయ్యారు.
ఈ క్రమంలో ఇద్దరూ కలసి రాచకొండ పోలీస్ కమిషర్‌రేట్ పరిధిలో 13 దొంగతనాలు, సైబరాబాద్ పరిధిలో రెండు, రాజమండ్రిలో ఆంధ్రాబ్యాంకు చోరీ, చెన్నైలో 2 చోరీలకు పాల్పడ్డారు. దొంగిలించిన బంగారాన్ని విశాఖపట్టణం ముత్తూట్, మణప్పురం పైనాన్స్‌లలో తాకట్టు పెట్టారు. వచ్చిన డబ్బులు రూ.5 లక్షలతో స్కోడా కారును కొనుగోలు చేసి జల్సాలకు అలవాటుపడ్డారు. అనుమానాస్పదంగా ఎల్‌బీనగర్‌లో కారులో తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. విచారించగా చేసిన నేరాలను ఒప్పుకున్నారు. వీరి నుంచి 200 గ్రాముల బంగారం, స్కోడా కారును స్వాధీనం చేసుకున్నారు. వీరిని గురువారం రిమాండ్‌కు తరలించారు.