పరుగు ఇక 3 కిలోమీటర్లే!
పోలీసు నియామకాల్లో సంస్కరణల దిశగా ప్రభుత్వ యోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు నియామకాల్లో భారీ సంస్కరణలు రాబోతున్నాయి. దేహదారుఢ్య పరీక్షల సరళీకృతం.. సివిల్స్, పబ్లిక్ సర్వీసు కమిషన్ తరహాలో ప్రిలిమ్స్, మెయిన్ రాత పరీక్షలు.. అభ్యర్థుల మానసిక స్థితి పరిశీలన కోసం నిపుణులతో పరిశీలన... రాష్ట్ర పోలీసుల నియామకాల్లో రాబోతున్న భారీ మార్పులివి. పోలీసు నియామకాల్లో సంస్కరణలపై డీజీపీ అనురాగ్ శర్మ పంపిన ఈ ప్రతిపాదనలను... రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఆమోదించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది.
ఆ ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు..
⇒ ఇటీవలి కాలంతో వివాదాస్పదమైన ‘ఐదు కిలోమీటర్ల పరుగు (5 కేఎం రన్)’ను ఉపసంహరించుకోనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు నియామకాల్లో ఐదు కిలోమీటర్ల పరుగును నిర్వహించేవారు. పోస్టులు తక్కువగా ఉండడం, వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చిపడడంతో అభ్యర్థుల వడపోత కోసం గత ప్రభుత్వాలు ఈ కఠిన పరీక్ష పెట్టేవి. ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో ఈ పరుగు పరీక్షలో పాల్గొని కొందరు అక్కడికక్కడే ప్రాణాలు విడవడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురికావడం జరిగింది. దీంతో 5 కిమీ పరుగును మూడు కిలోమీటర్లకు కుదించాలని పోలీసు శాఖ నిర్ణయించింది.
⇒ అభ్యర్థుల వడపోత కోసం ఇక నుంచి ముందుగానే సివిల్స్, గ్రూప్స్ పరీక్షల తరహాలో ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షలను నిర్వహించనున్నారు. తొలుత అభ్యర్థులకు బహుళ ఐచ్ఛిక (ఆబ్జెక్టివ్) విధానంలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. అందులో నెగ్గిన అభ్యర్థులకు మళ్లీ వ్యాస రూప(సబ్జెక్టివ్) పరీక్ష (మెయిన్స్) నిర్వహిస్తారు. పోస్టుల సంఖ్యను బట్టిన మెయిన్స్‌లో నెగ్గిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. దేహదారుఢ్య పరీక్షల్లో పరుగు తగ్గింపు మినహా ఇతర ఏ మార్పులూ ఉండవు.
⇒ పోలీసు ఉద్యోగం మానసిక ఒత్తిడితో కూడినది. సెలవులు, విశ్రాంతి లేకుండా నిర్విరామంగా విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. మానసిక స్థితి బలంగా లేనివారు తీవ్ర ఒత్తిడికిలోనై సంయమనాన్ని కోల్పోయి అఘాయిత్యాలకు పాల్పడే అవకాశముంటుంది. ప్రధానంగా టీఎస్‌ఎస్‌పీ, ఏఆర్ విభాగాల్లో పనిచేసే కింది స్థాయి సిబ్బంది విధి నిర్వహణలోనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యలకు పాల్పడడం, ఇతరులపై కాల్పులు జరపడం వంటి ఘటనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసు ఉద్యోగంలో చేరకముందే అభ్యర్థుల్లోని మానసిక బలం, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యంపై మానసిక నిపుణులతో పరీక్షలు జరిపించి పరిశీలించనున్నారు. దేహదారుఢ్య పరీక్షల తర్వాత అభ్యర్థులకు మానసిక పరీక్షలు నిర్వహిస్తారు.