పోలీస్ అధికారులకు బదిలీ ఫీవర్
వరంగల్‌క్రైం : జిల్లా పోలీసు శాఖకు బదిలీ ఫీవర్ పట్టుకుంది. మితిమీరిన రాజకీయ జోక్యంతో తప్పుదోవపడుతోంది. పోలీస్ ఉన్నతాధికారులు బదిలీల జాబితా సిద్ధం చేయడం.. ఆ వెంటనే అధికార పార్టీ నేతలు కలుగజేసుకుని రద్దు చే రుుంచడం ఇటీవల మామూలైపోరుుంది. లక్షలు పోసి.. పోస్టింగ్ కొనుక్కుంటున్నప్పటికీ పోటీ తీవ్రస్థాయిలో ఉండడంతో సీటులో కూర్చున్నాక కూడా గ్యారంటీ లేకుండాపోతోంది. ప్రస్తుతం జరుగుతున్న పోలీసు శాఖలో పోస్టింగ్‌లు ప్రమాదకర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. లక్షల్లో డబ్బులు ముట్టజెప్పి పోస్టింగ్ తెచ్చుకోవడం.. ఆ తర్వాత జనాలను పీడించడం గత కొన్నేళ్లుగా జిల్లాలో జరుగుతూనే ఉంది.
పోస్టింగ్‌లు.. వెనువెంటనే రద్దు..
ఇటీవల చేపట్టిన పోలీసు అధికారుల బదిలీల్లో ప్రతిష్టంభన నెలకొంది. అక్టోబర్ 17న వరంగల్ జిల్లాలో 14 మంది సీఐల బదిలీలు జరిగాయి. ఇందులో కొందరు లైఫ్‌లైన్ సర్వీస్‌లో ఉన్నవారికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇది ప్రజాప్రతినిధులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో వారు రాజధానికి చేరుకుని ఏకంగా పోస్టింగ్‌లనే నిలిపి వేయించారు. కొందరు ప్రజాప్రతినిధులు మంచి స్థానాల్లో పోస్టింగ్‌లు ఇప్పిస్తామని పోలీసుల వద్ద లక్ష లాది రూపాయలు దండుకోవడమే ఇందుకు ఉదాహణ. ఆ తర్వాత నవంబర్ 17న జిల్లాలో 9 మంది డిఎస్పీలను బదిలీ చేశారు. ఒక్క జనగామ డీఎస్పీని మాత్రమే ముట్టుకోలేదు. ఎందుకంటే సదరు డీఎస్పీ రాష్ట్రంలోని కీలకమైన మంత్రికి క్లాస్‌మేట్ కావడమేనని పోలీసు వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
మొదట 9 మంది డీఎస్పీలను బదిలీ చేసి ఆ తర్వాత పరకాల పోస్టింగ్‌ను నిలిపివేశారు. వెనువెంటనే గతంలో ఉన్న సంజీవరావునే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనేక మంది అధికారులు లక్షలాది రూపాయలు పోసి పోస్టింగ్‌లు కొనుక్కున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పోలీస్‌శాఖలో డబ్బులు పెట్టుబడిగా పెట్టి పోస్టింగ్‌లు తెచ్చుకుని ఆ తర్వాత జనాలను పీడించి సంపాదించేకు సంస్కృతికి ఉద్యోగులు స్వస్తి పలుకాలని ప్రజలు కోరుతున్నారు.
బ్యాంకు సొత్తు రికవరీతో ప్రతిష్ట పదిలం..
పోలీసింగ్‌లో దేశంలోనే ప్రత్యేకత కలిగిన వరంగల్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ భూపాలపల్లి, ఆజంనగర్ శాఖల్లో నవంబర్ 15న జరిగిన భారీ దోపిడీ మిస్టరీని త్వరగానే ఛేదిం చారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడైన ఏపీజీవీబీ మెస్సేంజర్ వెలమ రాజేంద్రప్రసాద్ అలియూస్ రమేష్ కోసం వరంగల్ పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి దేశ వ్యాప్తంగా నిందితుల కోసం గాలించారు. ఎట్టకేలకు నిందితుడి కదలికలు గుర్తించి ఎనిమిది రోజుల్లో పట్టుకుని రూ.9.60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందే అతడి భార్యను అదుపులోకి తీసుకుని దోపిడీ సొత్తులో 34 కిలోల బంగారం, రూ.2 లక్షలు రికవరీ చేశారు. బ్యాంకు దోపిడీ సొత్తును త్వరగా రికవరీ చేసి వరంగల్ పోలీసులు తమ సత్తాను మరోసారి చాటారు.