‘పోలీస్’ వనం
- నందనవనం జల్లెడ
- అర్ధరాత్రి సోదాలు
- పోలీసుల అదుపులో 110 మంది అనుమానితులు
- 48 ఆటోలు, 56 బైక్‌లు స్వాధీనం
- 20 క్వింటాళ్ల రేషన్ గోధుమల పట్టివేత
సరూర్‌నగర్ : నాలుగు వందల మంది పోలీసులు.. పది బృందాలుగా ఏర్పడి ఆదివారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని నందనవనం, పరిసర కాలనీల్లో ‘కార్డన్ అండ్ సెర్చ్’ పేరిట విస్తృత తనిఖీలు నిర్వహించారు. క్రైమ్ అడిషనల్ డీసీపీ జానకీషర్మిల, ఎల్బీనగర్ డీసీపీ విశ్వప్రసాద్ నేతృత్వంలో ఒక్కమారుగా పోలీసు బృందాలు బస్తీలోని ఇళ్ల మీదకి రావటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమై సోదాలు ఉదయం 7 గంటల వరకు కొనసాగాయి.
ఈ సోదాల్లో పలువురు అనుమానితులను, కొత్త,పాతనేరస్తులను తమ అదుపులోకి తీసుకున్నారు. ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పది అవుట్ పాయింట్‌లు, పది ఇన్నర్ పాయింట్‌లతో కూంబింగ్ నిర్వహించారు. జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, వాంబే కాలనీ, దేవినగర్, నందనవనంలోని 1044 బ్లాక్‌లను అంగుళం కూడా వదలకుండా తనిఖీలు చేశారు. 110 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బస్‌లలో పిక్‌పాకెటింగ్ చేసే రమాదేవి, 16 మంది పాతనేరస్తులు, రౌడీషీటర్ బంగారు శ్రీను, కరుడు గట్టిన హౌస్‌బ్రేకర్ కరీంనగర్‌కు చెందిన ఉస్మాన్, హబీబ్‌లు చిక్కారు.
వీరందరిపై పలు జిల్లాల్లో నాన్‌బెయిలబుల్ కేసులున్నాయి. 20 క్వింటాళ్ల రేషన్ గోధుమల స్టాక్‌తో కూడిన, టాటా ఏస్ వాహనం పట్టుబడింది. 9 ఎల్‌పీజీ సిలిండర్‌లు, 48 ఆటోలు, 56 బైక్‌లతోపాటు 2 బెల్ట్ షాప్‌లపై దాడి చేసి బీర్లు, వైన్ బాటిళ్లు, గుట్కాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ పద్మవ్యూహం ముగిసిన తర్వాత డీసీపీలు విశ్వప్రసాద్, జానకీషర్మిల మీడియాతో మాట్లాడుతూ.. కార్డన్ అండ్ సెర్చ్ ఇప్పటి వరకు ఐదుసార్లు నిర్వహించామని, అందులో నందనవనంలో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు.
ఇక నుంచి జోన్ల వారీగా ఈ సోదాలు చేస్తామన్నారు.. ఈ ఆపరేషన్‌లో నలుగురు ఏసీపీలు, 60 మంది ఇన్‌స్పెక్టర్‌లు, 80 మంది ఎస్‌ఐలు, 300 మంది కానిస్టేబుళ్లు, 2 స్పెషల్ టీమ్‌లు, జోనల్‌టాస్క్‌ఫోర్స్ బృందాలుగా పాల్గొన్నాయి.