సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని ఇంటర్ బోర్డు వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. న్యాయం అడగడానికి వచ్చిన విద్యార్థులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అధికారులతో మాట్లాడాలని కోరిన ఓ విద్యార్థినిపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. పదుల సంఖ్యలో పోలీసులు ఆమెను బలవంతంగా అక్కడి నుంచి లాక్కునివెళ్లి అరెస్ట్ చేశారు. దీనిని అడ్డుకున్న విద్యార్థిని ఇద్దరు సోదరులను, తల్లిని కూడా పోలీసులు దారుణంగా ఈడ్చుకెళ్లారు. పోలీసుల తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలపై ఇంటర్ బోర్డ్ వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అధికారులు ఇంటర్ బోర్డ్ కార్యాలయానికి తాళాలు వేశారు. విద్యార్థులు ఆందోళనల నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇంటర్మీడియెట్ ఫలితాల విషయంలో ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment