సాక్షి, నాగర్‌కర్నూల్: ఆమె.. భర్తతో ఏడు అడుగులు నడిచింది. వేదమంత్రాల సాక్షిగా తాళి కట్టించుకుంది. సమాజం ఎగ‘తాళి’ చేసేలా ప్రియుడితో కలిసి పథకం ప్రకారం కట్టుకున్నోడిని హతమార్చింది. భార్యాభర్తల ఆత్మీయబంధాన్ని మంటగలిపింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగిన ఈ హత్యోదంతం నిజంగానే ‘సీరియల్’ను తలపించింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో కలకలం సృష్టించిన యాసిడ్ దాడి కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వివరాలను నాగర్‌కర్నూల్ జిల్లా ఏఎస్పీ జోగుల చెన్నయ్య, డీఎస్పీ లక్ష్మీనారాయణ, కొల్లాపూర్ సీఐ శ్రీనివాసరావు ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఆరోజు ఏం జరిగిందంటే..!
గతనెల 27న నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన సుధాకర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌పై యాసిడ్ దాడి జరిగిందని అతని సోదరుడు సురేందర్‌రెడ్డి 28న ఉదయం 11గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన అన్న, వదిన స్వాతి పట్టణంలోని రవితేజ కళాశాల పక్కన ఓ అద్దెఇంట్లో నివాసం ఉంటున్నారని అందులో పేర్కొన్నాడు. స్వతహాగా కాంట్రాక్టర్ అయిన సుధాకర్‌రెడ్డి భార్యను ఇంట్లో ఉంచి కాంట్రాక్ట్ పనుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లేవాడు. ఆ సమయంలో ఆమె టీవీ సీరియళ్లు ఎక్కువగా చూసేది. దీనికితోడు ఒంటరిగా ఉండే స్వాతికి రాజేష్ పరిచయమయ్యాడు. ఈ క్రమంలో సుధాకర్‌రెడ్డికి వీరి వ్యవహారం తెలియడంతో భార్య స్వాతిని 26న నిలదీయడమే కాకుండా ఆమెపై చేయిచేసుకున్నాడు. ఇరువురూ తోసుకోవడంతో సుధాకర్‌రెడ్డి తలకు గాయమైంది. అదేరోజు రాత్రి 12గంటల ప్రాంతంలో సుధాకర్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి వెళ్లి తలకు కుట్లు వేయించుకుని ఇంటికివచ్చాడు. అప్పటికే రాజేష్‌తో కలిసి సుధాకర్‌రెడ్డిని హత్య చేసేందుకు స్వాతి పథకం రచించింది.
ఆరోజు రాత్రే పని ముగించాలని అనుకున్నప్పటికీ ఇంట్లో మరో వ్యక్తి ఉండటంతో కుదరలేదు. తెల్లవారుజామున అతను బయటకు వెళ్లిన వెంటనే రాజేష్‌ను ఇంటికి పిలిపించుకున్న స్వాతి నిద్రిస్తున్న సుధాకర్‌రెడ్డి మెడకు మత్తు ఇంజక‌్షన్ ఇచ్చే సమయంలో అతను అరవకుండా నోట్లో బట్టలు కుక్కింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇనుప రాడ్‌తో సుధాకర్‌రెడ్డి తలపై బాదడంతో అతను అక్కడే మరణించాడు. వెంటనే దుప్పట్లో సుధాకర్‌రెడ్డి శవాన్ని మూటగట్టి కారు డిక్కీలో వేసుకుని ఇంట్లో నుంచి స్వాతి, రాజేష్ బయలుదేరారు. ఉదయం ఏడు గంటలకల్లా నవాబ్‌పేట వద్దనున్న అటవీ ప్రాంతానికి చేరుకుని రోడ్డుకు వంద మీటర్ల దూరంలో శవాన్ని విసిరేశారు. వెంట తీసుకెళ్లిన పెట్రోల్‌తో సుధాకర్‌రెడ్డి శవాన్ని తగులబెట్టి అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు చేరుకున్నారు. అక్కడ అప్పటి వరకు వాడిన కారును మెకానిక్ షెడ్డులో సర్వీసింగ్ చేయాలంటూ ఇచ్చేశారు.
వెలుగులోకి ఇలా..
27వ తేదీ నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి సుధాకర్‌రెడ్డిపై యాసిడ్ దాడికి పాల్పడ్డారని, దీంతో తమ వదిన స్వాతి సుధాకర్‌రెడ్డిని చికిత్స కోసం హైదరాబాద్‌కు హుటాహుటిన తీసుకెళ్తున్నట్లు తనకు తెలిపిందని సురేందర్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్ సంఘటన స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. జిల్లా కేంద్రంలోని అన్ని సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. తమ దర్యాప్తు కొనసాగుతుండగానే ఈనెల 9న ఫిర్యాదుదారు మంద సురేందర్‌రెడ్డి, అతని తల్లి సుమతమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి సుధాకర్‌రెడ్డి కాదని, స్వాతి ప్రియుడని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. స్వాతితో పాటు ముఖం కాలి చికిత్స పొందుతున్న స్వాతి ప్రియుడు రాజేష్‌ను విచారించడంతో వారు పథకం ప్రకారమే సుధాకర్‌రెడ్డిని హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో స్వాతిని అదుపులోకి తీసుకుని సుధాకర్‌రెడ్డి శవాన్ని తగలబెట్టిన నవాబ్‌పేట మండలం ఫతేపూర్ మైసమ్మ అడవి ప్రాంతానికి చేరుకున్నారు. సంఘటన స్థలంలో గుర్తుపట్టకుండా కాలిన శవం, ఎముకలు, పుర్రె మాత్రమే లభించింది. వీటిని నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని పోలీసులు తెలిపారు.
టీవీ సీరియల్ ప్రభావమే..
తరచూ టీవీ సీరియళ్లు చూసే స్వాతికి ప్రియుడిని భర్త స్థానంలోకి తెచ్చుకోవాలన్న ఆలోచనతో అతనికి సుధాకర్‌రెడ్డిలా ప్లాస్టిక్ సర్జరీ చేయించాలన్న ఆలోచన వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో ఓ నిర్జలప్రదేశంలో రాజేష్ తన ముఖానికి ఓ టవల్ కట్టుకుని దానిపై పెట్రోల్ పోసుకుని పెద్దగా గాయాలు కాకూడదని నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత ముఖం నల్లగా మారడంతో ఇక ఎవరూ గుర్తుపట్టరని, ప్లాస్టిక్ సర్జరీ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని భావించాడు. ఆ తర్వాత స్వాతి అతను ఉన్న ప్రదేశానికి ఓ ప్రైవేట్ ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్లి హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆ తర్వాత బంధువులు, పోలీసులకు చికిత్స పొందుతున్నది సుధాకర్‌రెడ్డే అని వారంరోజులకు పైగా స్వాతి అందరిని నమ్మిస్తూ వచ్చింది. వైద్యులు కాలిన గాయాలు నయం అయ్యాయని, డిశ్చార్జి చేస్తామని చెప్పడంతో సుధాకర్‌రెడ్డి సోదరుడు, తల్లి ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటి వరకు ముఖం చూపించకుండా జాగ్రత్తపడ్డ రాజేష్ తప్పనిసరి పరిస్థితుల్లో ముఖానికి ఉన్న ముసుగు తీయాల్సి వచ్చింది. దీంతో అతను సుధాకర్‌రెడ్డి కాదని మంద సురేందర్‌రెడ్డి, తల్లి సుమతమ్మ గుర్తుపట్టి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బండారం బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment