ఎ..బి..సి..డి..
- పోలీస్ సిబ్బందికి గ్రేడ్‌లు
- బాధితులకు ఉన్నతాధికారుల ఫోన్లు
- సిబ్బంది పనితీరుపై వివరాలు సేకరణ
- కమిషనర్ మహేందర్‌రెడ్డి చర్యలు
- పూర్తిస్థాయిలో అమలుకు కసరత్తు
‘నమస్తే మేడమ్... మీరు పుస్తెలతాడు చోరీకి గురైందని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు కదూ. ఫిర్యాదు స్వీకరించడానికి మా సిబ్బంది మీకేమైనా ఇబ్బంది పెట్టారా? లేక సహకరించారా? లంచాలేమైనా అడిగారా? పొరపాటుగా మాట్లాడారా లేక మర్యాద పూర్వకంగా మసలుకున్నారా? ఏవైనా సమస్యలు తలెత్తితే చెప్పండి. వారి పనితీరుకు ఏ గ్రేడ్ ఇవ్వమంటారో సూచించండి’ అంటూ బంజారాహిల్స్‌కు చెందిన శాంతికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆరా తీస్తే అది ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చిందని ఆమె తెలుసుకుంది. ఆమెకే కాదు...ఇక ముందు నగరంలో పోలీస్ స్టేషన్లకు వెళ్లే ఫిర్యాదుదారులకు ఇదే తరహా ఫోన్ కాల్స్ రానున్నాయి. పోలీస్ సిబ్బంది పనితీరు తెలుసుకోవడం... వారికి గ్రేడ్‌లు కేటాయించడం ఈ కాల్స్ ముఖ్య ఉద్దేశం.
సాక్షి, సిటీబ్యూరో: నేరాల నియంత్రణకు... పోలీసు సిబ్బంది వైఖరిలో మార్పునకు ఉన్నతాధికారులు విప్లవాత్మక చర్యలు చేపడుతున్నారు. వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రక్రియకు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రజలు తమ సేవలు అందుకున్నాక పోలీసులకు ఎన్ని మార్కులు వేస్తారో అధికారులు స్వయంగా పరిశీలించనున్నారు. సిబ్బంది పనితీరుకు ప్రజలు ఏ గ్రేడింగ్ ఇస్తారో చూడాలని మహేందర్‌రెడ్డి భావిస్తున్నారు.
పాస్‌పోర్టు దరఖాస్తుదారుల నుంచి ఈ ప్రక్రియ మొదలు పెట్టారు. పాస్‌పోర్టు క్లియరెన్స్ కోసం స్పెషల్‌బ్రాంచ్ సిబ్బంది ఏవిధంగా విచారించారు? వారి పని విధానంతో ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా..? వారి పని విధానంపై ఏమేరకు సంతృప్తి చెందారు..? సిబ్బంది ఏమైనా తప్పులు చేశారా..? లంచాలు అడిగారా..? మరేరకమైన వేధింపులకు గురిచేశారా..? అనే విషయాలు తెలుసుకునేందుకు అధికారులే స్వయంగా దరఖాస్తుదారులకు ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు.
సిబ్బంది సక్రమంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించడంతో పాటు దర ఖాస్తుదారుకువేధింపులు, సమస్యలు కలిగించుకుండా ఉండాలన్నదే కమిషనర్ ఉద్దేశం. రాబోయే రోజుల్లో ప్రతి కేసులోనూ సిబ్బంది పనితీరు బేరీజు వేసేందుకు కమిషనర్ యత్నిస్తున్నారు. ఉదాహరణకు స్నాచింగ్ బారిన పడిన బాధితులు ఠాణాకు వ స్తే సిబ్బంది ఎలా స్పందించారు. రాగానే ఫిర్యాదు స్వీకరించారా?లేక ప్రశ్నలతో వేధించారా..అనే వివరాలను బాధితుల నుంచి సేకరిస్తారు.ఠాణాలో బాధితులతో మర్యాదగా మాట్లాడాలనే భావనతో ప్రత్యేకంగా రిసెప్షన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
స్త్రీల కోసం మహిళా సిబ్బందిని సైతం రిసెప్షన్‌లో కేటాయించారు. కాలనీవాసులు, బస్తీ వాసులతో ఫ్రెండ్లీ పోలిసింగ్ నిర్వహించాలని, అందుకు తగ్గ సూచనలు, పోలీసుల నడవడికపై మార్గదర్శకాలను రూపొందించారు. ఇకపై పోలీసుల నుంచి సేవలు పొందే ప్రతి వారి నుంచి సిబ్బంది పనితీరుపై అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఇందుకోసం కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
గ్రేడింగ్‌పై దృష్టితో ఉపయోగాలు
ప్రతి కేసులో బాధితుడిపై ఉన్నతాధికారి పర్యవేక్షణ ఉంటుంది.
బాధితుడికి చట్టపరిధిలో సేవలు అందించేందుకు సిబ్బంది చొరవ చూపుతారు.
బాధితుడు ఊరట చెందడంతో పాటు పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
అక్రమ కేసులు బనాయించడం కుదరదు.
బాధితులకు సరైన న్యాయం చేయక, నిందితులతో కుమ్మక్కైతే ఆ విషయం పై అధికారులకు తెలిసే అవకాశం ఉంది.
ఠాణాలో బాధితుడికి వేధింపులు తగ్గుతాయి.
కేసు దర్యాప్తు, పురోగతి విషయాలపై ఎప్పటికప్పుడు సిబ్బంది సమాచారం అందిస్తారు.
బాధితులు అడిగిన సమాచారం ఇవ్వకుంటే సిబ్బందిపై వేటు పడుతుంది.
తమ పనితీరుపై ప్రజల నుంచి వచ్చే సూచనలు స్వీకరించేందుకు అవకాశం ఉంటుంది.