మత్తు దిగేలా చర్యలు | Police Taking Strict Action On Drunk And Drive Cases | Sakshi
Sakshi News home page

మత్తు దిగేలా చర్యలు

Published Fri, Dec 20 2019 10:13 AM | Last Updated on Fri, Dec 20 2019 10:15 AM

Police Taking Strict Action On Drunk And Drive Cases - Sakshi

సంగారెడ్డిలో బ్రీత్‌ అనలైజర్‌తో తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు (ఫైల్‌)

సాక్షి, సంగారెడ్డి: జిల్లా పరిధిలోని హైదరాబాద్‌–ముంబై 65వ నంబరు జాతీయ రహదారి, అకోలా–నాందేడ్‌ 161 నంబరు జాతీయ రహదారులున్నాయి. ఈ రహదారుల్లో లారీ డ్రైవర్లు, ఇతర వాహనాల డ్రైవర్లు రాత్రివేళల్లో ఎక్కువగా మద్యం సేవించి నడుపుతున్నట్లు వెల్లడైంది. దీంతో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించి డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు ముమ్మరం చేశారు. డ్రంకెన్‌ డ్రైవ్‌తో జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని కోర్టులకు తరలిస్తూ శిక్ష పడేవిధంగా చూస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా తరచుగా వాహనాల డ్రైవర్లకు బ్రీత్‌ అనలైజర్‌ పరికరం ద్వారా మద్యం తాగారా? లేదా అనే విషయాలను తెలుసుకుంటున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నా పలువురు పట్టుబడుతూనే ఉన్నారు.  డ్రంకెన్‌ డ్రైవ్‌ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ తాగి నడుపుతూ తనిఖీలలో పట్టుబడుతూనే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 2018 సంవత్సరంలో 1705 మంది మద్యం తాగి వాహనాలను నడుపుతూ పట్టుబడ్డారు.

వీరి నుంచి రూ.3,52,700 జరిమానాగా వసూలు చేశారు. ఇందులో 1130 మందికి తాగిన పరిమాణాన్ని (క్వాంటిటీ)ని బట్టి 1 నుంచి 10 రోజుల వరకు జైలుశిక్ష విధించారు. అదే విధంగా 2019 డిసెంబరు 5వతేదీ వరకు 1221 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు కాగా, వీరినుంచి రూ.25,33,100 జరిమానాగా వసూలు చేశారు. వీరిలో 454 మందికి జైలుశిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుబడిన వారిలో ఎక్కువ శాతం 18 నుంచి 35 సంవత్సరాల వారే అధికంగా ఉంటున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడమే కాకుండా అతి వేగంగా ప్రయాణిస్తూ మూలమలుపుల వద్ద ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్న సంఘటనలు కూడా ఉన్నాయి.  

అందుబాటులో లేని క్యాబ్‌ డ్రైవర్ల వ్యవస్థ.. 
జిల్లాలో పబ్‌లు లేవు. బార్లు మాత్రం 19 ఉన్నాయి. పబ్‌లలో మద్యం సేవించిన వారిని సురక్షితంగా ఇంటివద్దకు చేర్చడానికి హైదరాబాద్‌ నగరంలో ప్రత్యేకంగా క్యాబ్‌ సర్వీస్‌లను అందుబాటులో ఉంచారు. అకున్‌ సబర్వాల్‌ నగర పోలీసు కమిషనర్‌గా ఉన్నప్పుడు ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు.   సొంత వాహనాలు కలిగి ఉంటే డ్రైవర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మద్యం సేవించిన వారు సురక్షితంగా ఇంటికి చేరడమే కాకుండా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలతో పట్టుబడే అవకాశం ఉండకపోవడం, ప్రమాదాలను నివారించవచ్చుననే ఉద్దేశ్యంతో బార్ల యజమానులు ఈ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఈ తరహా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జిల్లాలో ఎక్కడా కల్పించలేదు.

జిల్లాలో పబ్‌ కల్చర్‌ లేనప్పటికీ బార్లు మాత్రం ఉన్నా..ఎక్కడా కూడా క్యాబ్‌ వ్యవస్థను గాని ప్రత్యేకంగా పేయింగ్‌ డ్రైవర్లను ఏర్పాటుచేయలేదు. ఈ విషయంపై జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ చంద్రయ్యను వివరణ  అడుగగా..జిల్లాలో బార్ల వద్ద క్యాబ్‌లు గాని, డ్రైవర్ల వ్యవస్థగాని అందుబాటులో లేదని తెలిపారు. 

దాబాల్లో మద్యం.. 
జిల్లా పరిధిలో జాతీయ రహదారులు ఉండడంతో రాత్రి వేళ అనుమతులు లేకుండా కొన్ని చోట్ల దాబాల్లో మద్యం సేవించడంతో పాటుగా విక్రయిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల పోలీసులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దాబాల్లో మద్యం సేవనం, విక్రయాలు నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

అవగాహన కార్యక్రమాలు.. 
మద్యం తాగి వాహనాలు నడిపితే జరిగే అనర్థాలను పట్టుబడిన వారికి అవగాహన కార్యక్రమాల ద్వారా వివరిస్తున్నారు. ప్రమాదాలపై వీడియోలు చూపించడం, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్, పోలీసు కళాబృందాలచే జనచైతన్య కార్యక్రమాలు, మద్యం తాగి వాహనాలు నడిపిన సంఘటనల్లో మృతిచెందిన కుటుంబాల దుర్భర పరిస్థితులు, తదితర విషయాలపై పోలీసు శాఖ, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి.

తనిఖీలు నిర్వహిస్తున్నాం.. 
మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలు ఉన్నాయి. వీటిని అరికట్టడానికి గాను నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా రాత్రి వేళ ప్రధాన రహదారులపై ప్రత్యేక నిఘా ఉంచాం. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి జరిమానాలు, జైలుశిక్ష పడుతుందనే విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. సురక్షిత ప్రయాణానికి మద్యం జోలికి వెళ్లకపోవడమే అన్ని విధాలా శ్రేయస్కరం. 
– చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement