డీఎస్పీ బదిలీ నిలిపివేయాలని ధర్నా నిర్వహిస్తున్న అఖిలపక్ష నాయకులు
సాక్షి, భూపాలపల్లి : అధికార పార్టీకి ఎదురు తిరిగితే జిల్లా పోలీసులకు మిగిలేది బదిలీనే. చిన్న వివాదాలకు సైతం రాజకీయాలను ఆపాదించి అధికారులను సాగనపుంతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారు. మొన్న కాటారం, మహదేవపూర్ సీఐల బదిలీ మరవకముందే పోలీసు శాఖలో మరో బదిలీ చోటుచేసుకుంది. ములుగు డీఎస్పీని ట్రాన్స్‌ఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఇటు పోలీస్ శాఖలో, అటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
జిల్లాలో పోలీసులకు అధికార పార్టీ నాయకులకు మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఏ సమస్యలోనైనా రాజకీయ నాయకుల ప్రమేయం ఉం టే బాధితులకు న్యాయం జరగదేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జరుగుతున్న సంఘటనలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. చిన్న పాటి భూ వివాదంలో ఏకంగా డీఎస్పీ స్థాయి వ్యక్తిని ఉన్నపళంగా బదిలీ చేశారం టే.. ఏమేరకు రాజకీయ ఒత్తిళ్లు పనిచేశాయో అర్థం అవుతోంది.
ఇంతకు ముందు కాటారంలో సీఐగా పనిచేసిన శంకర్‌రెడ్డి బదిలీ విషయం కూడా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కాటారం పరిధి లో ఇసుక, గుట్కా, బెల్ట్ షాపుల అక్రమ దందా పై ఉక్కుపాదం మోపారు. ఇసుక రవాణాలో ప్రతీరోజు ఏదో ఒకదగ్గర కేసు నమోదు అవు తుండడం ఇసుక వ్యాపారులకు కంటగింపుగా మారింది. దీంతో స్థానిక నాయకులు, ఇసుక వ్యాపారులు
మంత్రి స్థాయిలో పైరవీలు నడిపి బదిలీ చేయించారని స్థానిక ప్రజలు ఆరోపించారు.
ఇది జరిగిన కొద్ది రోజులకే ఓ రోడ్డు ప్రమాదం సంఘటనకు సంబంధించి ప్రతిపక్ష నాయకులకు సపోర్టుగా ఉంటున్నారనే కారణంతో మహదేవపూర్ సీఐని బదిలీ చేసినట్లు వినికిడి. ప్రస్తుతం ఇదే వరుసలో ములుగు డీఎస్పీ రాఘవేంద్రరెడ్డిని చేర్చారు. పోలీసు వృత్తికి రాజకీయాలు ఆపాదిస్తూ బదిలీ వేటు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గణపురం మండలం రవినగర్ భూవివాదంలో అధికార పార్టీ నాయకులపై చేయిచేకున్నారని ఆరోపిస్తూ ఆపార్టీ కార్యకర్తలు ధర్నా, రాస్తారో కో చేసిన విషయం తెలిసిందే. బాధితుల వివరాల ప్రకారం.. డీఎస్పీ రాఘవేంద్రారెడ్డి తమ కు న్యాయం చేయాలని చూశాడని, ఇది నచ్చకే అధికార పార్టీ నాయకులు డీఎస్పీపై ఆధారాలు లేని ఆరోపణలు చేసి ట్రాన్స్‌ఫర్ అయ్యేలా చేశారని మండిపడుతున్నారు. గతంలో వరంగల్ ఎంపీ ఉప ఎన్నికల సమయంలో అప్పటి ములుగు డీఎస్పీ, ప్రస్తుతం జిల్లాలో ఏఎస్పీగా పనిచేస్తున్న రాజ్‌మహేంద్ర నాయక్ బదిలీలోనూ రాజకీయ ప్రమేయం ఉందని ప్రజలు అంటున్నారు.
ములుగులో డీఎస్పీ మార్క్..
ములుగు సబ్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలను నియంత్రించడానికి డీఎస్పీ కృషి చేశారు. ఇందుకోసం ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యాపారులు, ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రజలకు పోలీసులకు మధ్య ఎలాంటి తారతమ్య బేధాలు ఉండకూడదనే ఉద్దేశ్యంతో ప్రజాబంధం(కనెక్టివిటీ పోలీసింగ్) కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారు. జాకారం వైటీసీలో జరుగుతున్న కానిస్టేబుల్ ట్రైనింగ్ క్యాంపు పట్ల ప్రత్యేక శ్రద్ధవహిస్తూ యువతలో స్ఫూర్తిని నింపుతున్నారు.
ఫలించని ప్రజల ఆందోళనలు..
ప్రతీసారి ప్రజ లు అధికారులు బదిలీలు ఆపాలని ధర్నా చేస్తున్నా పాలకులు పట్టించుకున్న దాఖాలాలు లేవు. ములుగు డీఎస్పీ బదిలీని అపాలని సుమారు 2వేల మంది ప్రజలు ధర్నాకు దిగారు. అక్రమ బదిలీని నిపివేయాలని ఎల్లారెడ్డిపల్లి గ్రామస్తులు రోడెక్కి ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని చూసిన అధికారిని అన్యాయంగా బదిలీ చేశారని ఆందోళన చేశారు. గతంలో కాటారం సీఐ శంకర్‌రెడ్డికి మద్దతుగా ప్రజలు, వివిధ సంఘాల నేతలు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు. విపక్ష పార్టీల ఆధ్వర్యం లో ప్రజాసంఘాలు ఆందోళనలు చేశారు. ప్రజలు ఎంతగా ప్రయత్నించినా ప్రభుత్వం స్పందించలేదు.
సామాన్యుడికి భరోసా ఏదీ..?
పోలీసులకే భరోసా కరువైంది. ఇక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఇటీవలి బదిలీల ఘటనలను బట్టి అర్థం చేసుకోవచ్చు. బాధితులకు న్యాయం చేయాలని చూస్తున్నప్పటికీ పలు రాజకీ య ఒత్తిళ్ల కారణంగా పోలీసులు ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజాయతీగా పనిచేస్తున్న పోలీస్ అధికారులకు ప్రభుత్వ ఇచ్చే బహుమతి బదిలీయేనా అని ప్రజలు ఆక్రోశిస్తున్నారు. తమకు న్యాయం చేయాలనుకున్న అధికా రిని అకారణంగా బదిలీ చేస్తున్నారంటూ రోడ్లపైకి వస్తున్నారు. జిల్లాలో సమర్థవంతమైన ఎస్పీ ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతోనే ట్రాన్స్‌ఫర్లు అవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment