సాక్షి, నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులతో నగర రూపురేఖలు మారుతున్నాయి. ప్రభుత్వం నగరాభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగేళ్లలో ఏకంగా 850 కోట్ల రూపాయలు కేటాయించింది. దీంతో అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. అయినా కూడా కొన్ని సమస్యలు దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. వీటిని కూడా పరిష్కరించాలని అర్బన్ ప్రజలు కోరుతున్నారు.
2014లో అర్బన్ నియోజక వర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తా ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొట్టమొదటిసారిగా టీఆర్‌ఎస్ అర్బన్‌లో గెలిచింది. అనంతరం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయా నియోజక వర్గాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులను కేటాయించింది. అందులో భాగంగానే నిజామాబాద్ అర్బన్‌కు ప్రత్యేక నిధులతో ప్రముఖ పనులను చేపట్టేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం ఈ పనులు కొనసాగుతున్నాయి.
కొనసాగుతున్న అభివృద్ధి పనులు
నిజామాబాద్ అర్బన్‌లో నాలుగున్నరేళ్లలో రూ. 850 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా పేర్కొంటున్నారు. ఇందులో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు రూ. 200 కోట్లు, మిషన్‌భగీరథకు రూ. 9 కోట్లు, రోడ్ల సుందరీకరణకు రూ. 14 కోట్లు, డ్రెయినేజీల నిర్మాణానికి రూ. 10 కోట్లు, చౌరస్తాల అభివృద్ధికి 7 కోట్లు, శ్మశానవాటికల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి, సృతివనాల ఏర్పాటుకు, రఘునాథ చెరువు అభివృద్ధికి రూ. 23 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. మిషన్‌భగీరథ పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. ప్రస్తుతం నగరంలో రోడ్ల మరమ్మత్తులు, చౌరస్తాల అభివృద్ధి, శ్మశాన వాటిక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. అలాగే అర్బన్ పరిధిలో 1,100 డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు మంజూరయ్యాయి.
వీటి నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కొత్త కలెక్టరేట్ నిర్మాణం, ఐటీ హబ్ భవనాల పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. అలాగే డివిజన్‌లలో కులసంఘాల భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అలాగే 14 పార్క్‌లను అభివృద్ధి పరుస్తున్నారు. అమృత్ కింద 4 అధునాతన నీటి ట్యాంకుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ భవన నిర్మాణం, రాజీవ్‌గాంధీ ఆడిటోరియం మరమ్మతులు చేపడుతున్నారు. ప్రతి డివిజన్‌లో సీసీ రోడ్డు, తారు రోడ్ల నిర్మాణాలు, కొన్ని చోట్ల పూర్తికాగా, మరికొన్ని చోట్ల కొనసాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో పనులన్నీ పూర్తయితే నగరం సుందరంగా మారనుంది. ప్రధాన రహదారుల వెంట, చౌరస్తాల వద్ద డివైడర్ల విస్తరణ, సెంట్రల్‌లైటింగ్ వ్యవస్థ పనులు జరుగుతున్నాయి. మహిళల కోసం ప్రత్యేకంగా స్టేడియం కూడా మంజూరైంది. మైనారిటీ గురుకులాల ఏర్పాటు జరిగింది.
పరిష్కరించాల్సిన సమస్యలు
నగరంలో ప్రస్తుతం జరుగుతున్న పనులే కాకుండా మరికొన్ని సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజీ ఏర్పాటు కావాల్సి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా సమస్య ఉంది. అలాగే నగరానికి కొత్త మాస్టర్ ప్లాన్ అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇది కూడా కొన్నేళ్లుగా పరిష్కారం కావడంలేదు. అలాగే శివారు కాలనీల్లో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలు, తాగునీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఫ్లైఓవర్‌బ్రిడ్జిలు, డబుల్‌బెడ్‌రూంల ఇళ్లు అందుబాటులోకి రావాల్సి ఉంది. ప్రసూతి ఆస్పత్రి ఏర్పాటు కావాల్సి ఉంది. అలాగే ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. దీనికి పరిష్కార మార్గాలు, ప్రత్యామ్నాయ సౌకర్యాలు అందుబాటులోకి రావాలి.
అమలవుతున్న పథకాలు
పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు, షాదీముబారక్ తదితర పథకాలు అమలవుతున్నాయి.
సిట్టింగ్ ఎమ్మెల్యే వివరాలు
నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా 2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో నిజామాబాద్ ఎంపీ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2014లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కారు గుర్తుపై బరిలో దిగి విజయం సాధించారు. ప్రస్తుతం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి టీఆర్‌ఎస్ నుంచి తిరిగి పోటీ చేస్తున్నారు.
2018 ఓటర్ల జాబితా..
మొత్తం ఓటర్లు | 2,41,562 |
పురుషులు | 1,18,773 |
స్త్రీలు | 1,22,606 |
ఇతరులు | 46 మంది |
పోలింగ్ స్టేషన్లు | 218 |
Comments
Please login to add a commentAdd a comment