చక్రం తిప్పుదాం
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలుగా ఎదిగేందుకు జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. పార్టీలో ప్రత్యర్థులపై అంతర్గతంగా పైచేయి సాధిస్తూనే రాష్ట్రస్థాయిలో ముఖ్య పదవుల కోసం పోటీ పడుతున్నారు. మంత్రి పదవి దక్కితేనే రాష్ట్రంలో చక్రం తిప్పొచ్చని అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లెక్కలు వేసుకుంటున్నారు. పీసీసీ పదవిపై మాజీ మంత్రి డీకే అరుణ, తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నాయకత్వంపై రేవంత్‌రెడ్డి కన్నేశారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా కీలక స్థానాలకు ఎగబాకేందుకు జిల్లాకు చెందిన నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో తాము కొనసాగుతున్న పార్టీల్లో గుర్తింపు తెచ్చుకున్న నేతలు ప్రస్తుతం, రాష్ట్ర రాజకీయాలపై కన్నేశారు. టీఆర్‌ఎస్‌కు జిల్లా నుంచి ఏడుగురు శాసనసభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్నా ఒక్కరికీ కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ముగ్గురు నేతలు మంత్రి పదవిని ఆశిస్తున్నా, ఇందులో ఇద్ద రు మాత్రం పదవిని ఆలంబనగా చేసుకుని రాష్ట్రస్థాయిలో బలమైన నేతలుగా ఎదగాలని భావిస్తున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్ర స్థాయిలో తమ రాజకీయ భవిష్యత్తుపై లెక్కలు వేసుకుంటున్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన జూపల్లి కృష్ణా రావు జిల్లా రాజకీయాల్లో పైచేయి సాధిం చేందుకు మంత్రి పదవి తోడ్పడుతుందనే సమీకరణాలు వేసుకుంటున్నారు. ఉద్యోగ సం ఘం నేతగా ఇప్పటికే రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన శ్రీనివాస్‌గౌడ్ మంత్రివర్గంలో చోటు దక్కితే మరింత బలమైన నేతగా ఎదగవచ్చని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నిరంజన్‌రెడ్డి వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే కీలక పదవి దక్కేదని పార్టీ నేతలు చెప్తుంటారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న నిరంజన్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో రాష్ట్రస్థాయిలో కీలక పదవి దక్కుతుందనే భరోసాతో ఉన్నారు.
పీసీసీ పదవిపై డీకే కన్ను
జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను శాసించిన డీకే అరుణ ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. మంత్రిగా పనిచేసిన కాలంలో జిల్లాలో పార్టీపై పట్టు సాధించడమే కాకుండా మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డికి ధీటుగా పావులు కదిపారు. 2014 సాధారణ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన డీకే అరుణ ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. కుటుంబ నేపథ్యం, వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, సామాజికవర్గం కోణంలోనూ తనకు అవకాశం దక్కుతుందనే కోణంలో డీకే అరుణ ఎత్తుగడలు వేస్తున్నారు.
తెలంగాణలో జిల్లాలవారీగా కాంగ్రెస్ పార్టీ నేతలు, వాని పనితీరును విశ్లేషించిన తర్వాత రాబోయే రోజుల్లో తాను కీలక నేతగా ఎదగడం ఖాయమనే అభిప్రాయంతో డీకే అరుణ ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో విద్యుత్ కోతలపై ‘మహాధర్నా’ నిర్వహించడం ద్వారా జిల్లాలో పార్టీపై తనకున్న పట్టు, తన ప్రాధాన్యతను కూడా వెల్లడించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎల్‌పీ నేతగా రేవంత్?
తెలంగాణలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాత్రం తెలుగుదేశానికి మంచి భవిష్యత్తు ఉంటుందనే అంచనాలో ఉన్నారు. ఇప్పటికే పార్టీలో కీలక నేతగా గుర్తింపు పొందిన రేవంత్‌రెడ్డి శాసనసభలో తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నాయకత్వం చేపట్టాలనే భావనలో ఉన్నారు. సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు లెజిస్లేచర్ పార్టీ లీడర్‌గా ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్, ఎర్రబెల్లిది ఒకే సామాజికవర్గం కావడంతో తనకు అవకాశం దక్కుతుందనే అంచనాలో ఉన్నారు.
శాసనసభ సమావేశాల్లో దూకుడుగా వ్యవహరిస్తూ, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. పార్టీలో అంతర్గతంగా పైచేయి సాధించి తెలంగాణ టీడీపీకి భవిష్యత్తులో తానే పెద్ద దిక్కు అనే భావన కలిగించే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నప్పటీ సౌమ్యుడిగా ముద్ర పడడం కూడా తనకు అనుకూలిస్తుందని రేవంత్ అంచనా వేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జిల్లాకు చెందిన నేతలు రాష్ట్రస్థాయిలో కీలక నేతలుగా ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తి రేపుతున్నాయి.