
కరోనా నివారణకు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి జనతా కర్ఫ్యూనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆదివారం నగరంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వీరితో పాటు ప్రజాప్రతినిధులు సైతం తమవంతు బాధ్యతగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఒక్కొక్కరు ఒక్కోవిధంగా ఆదివారం కాలక్షేపాలతో గడిపారు. తమకిష్టమైన వంటకాలను ఆరగించారు. పుస్తక పఠనంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. మొత్తానికి జనతా కర్ఫ్యూను విజయవంతం చేయడంలో స్ఫూర్తిమంతంగా నిలిచారు.
పుస్తక పఠనంలో మునిగి..
కుత్బుల్లాపూర్: జనతా కరŠూయ్వలో భాగంగా ఆదివారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ ఇంటికే పరిమితమయ్యారు. ఉదయం పత్రిక పఠనం పూర్తి చేసిన ఆయన టిఫిన్ అనంతరం పలువురువు మహనీయుల జీవిత చరిత్ర పుస్తకాలను చదువుతూ కాలక్షేపం చేశారు. ఇంట్లో పిల్లలు అమ్మమ్మ వారి ఇంటికి వెళ్లడంతో ఇంట్లో ఒక్కరే ఉన్న వివేకానంద్ పుస్తక పఠనంలో మునిగిపోయారు. కరోనా బారి నుంచి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ ఆదేశాలను ఇదే తరహాలో ప్రజలు మద్దతు తెలిపితే తప్పకుండా కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడతామన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఇది అరుదైన రోజు
ఎల్‌బీనగర్: తన 36 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇతరులెవరూ లేకుండా కుటుంబంతో ఉండటం ఇదే ప్రథమమని ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్‌డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1986లో తాను మొదటిసారిగా కార్పొరేటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలను కలువకుండా.. వ్యక్తిగత సహాయకులు, గన్‌మెన్‌లు లేకుండా.. బంధువులను, స్నేహితులు లేకుండా ఉండటం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. గతంలో కర్ఫ్యూ విధిస్తే పాస్‌ల సహాయంతో బయటకు వచ్చేవారు. ఇప్పుడు ప్రజలే తామంతట తామే కర్ఫ్యూ విధించుకున్న రోజు. కరోనా వైరస్ నియంత్రనకు దేశ ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీసుకున్న నిర్ణయం పట్ల దేశం మొత్తం జనతా కర్ఫ్యూలో పాల్గొని ప్రజలు సహకరించారు. మా ఇంట్లో పనిమనుషులు కూడా సెలవు తీసుకున్నారు. నా డ్రైవర్ కూడా లేరు. ఇంట్లో మేమే టీ చేసుకోడం, వంట చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి టిఫిన్ చేయడం భోజనం చేయడం అంత కుటుంబ సభ్యులతో కలిసి గడపడం నా రాజకీయ జీవితంలో మొదటిసారి. జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన ప్రజానీకానికి జై కొడుతున్నాను.
ఇంట్లోనే ఉండి.. పొంగల్ వండి..
అల్వాల్: నిరంతరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలతో మమేకమయ్యే మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం ఆయన నివాసానికే పరిమితమయ్యారు. తనకు ఇష్టమైన పొంగల్ వంటకాన్ని చేసి కుటుంబ సభ్యులతో కలిసి ఆరగించారు. సాయంత్రం చప్పట్లతో వైద్యులకు, కార్మికులకు ఆయన అభినందనలు తెలిపారు.
మనవలతో మల్లారెడ్డి.. కుటుంబంతో తలసాని
కంటోన్మెంట్: జనతా కర్ఫ్యూలో భాగంగా రాష్ట్ర మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ఆదివారం కంటోన్మెంట్‌లోని తమ నివాసాలకే పరిమితమియ్యారు. బోయిన్‌పల్లి జయనగర్‌లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సాయంత్రం వరకు ఇంట్లోనే ఉన్నారు. చాలా కాలం తర్వాత పూర్తిస్థాయి ఇంటికి పరిమితమయ్యారు. మనవలతో సరదాగా ఆడుకుంటూ కాలక్షేపం చేశారు. సాయంత్రం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లి 5 గంటల సమయంలో కరోనాపై పోరాడుతున్న వైద్య, పోలీసులు, పారిశుద్ధ్య, మీడియా సిబ్బందికి చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంలో పాల్గొన్నారు. పశు సంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం మారేడుపల్లిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో గడిపారు. తనయుడు సాయికిరణ్ కుమారులతో సరదాగా ఆడుకుంటూ కాలక్షేపం చేశారు. సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.
అత్యవసరమైతేనే బయటకు రండి: మల్లారెడ్డి
ప్రజలు అత్యవసరమైతే మినహా కాలక్షేపానికి బయటికి రావొద్దని మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూలో భాగంగా స్వీయ నియంత్రణలో ఉన్న ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటోందన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రభుత్వం అందించే సూచనలు పాటించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అప్రమత్తతతోనే కరోనాను సమర్ధంగా ఎదుర్కోవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment