సిద్దిపేట జిల్లా ఖాయం | pond in field of tourism as Komati | Sakshi
Sakshi News home page

సిద్దిపేట జిల్లా ఖాయం

Published Sun, Sep 28 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM

సిద్దిపేట జిల్లా ఖాయం

సిద్దిపేట జిల్లా ఖాయం

- పర్యాటక క్షేత్రంగా కోమటి చెరువు
- మరో రూ.7 కోట్లతో అభివృద్ధి పనులు
- రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్
 సిద్దిపేట జోన్: త్వరలోనే సిద్దిపేట కేంద్రం జిల్లా ఏర్పాటు కావడం ఖాయమని రాష్ట్ర  నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శనివారం పట్టణంలోని కోమటి చెరువు శివారులో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భం గా సుమారు రూ. 1.5 కోట్లతో చేపట్టిన ఆడిటోరియం, హోటల్, బోటింగ్‌ను మంత్రి హరీష్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, ఫారూక్‌హుస్సేన్, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాలు లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. పార్కుల వల్లే స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకర వాతావరణం సాధ్యమవుతుందన్నారు. అందువల్లే మహానగరాలకే పరిమితమైన  బోటింగ్ సంస్కృతిని సిద్దిపేటలో ప్రారంచామన్నారు. సిద్దిపేటలోని కోమటిచెరువుకు ఇప్పటివరకు రూ. కోటి రూపాయలు వెచ్చించామనీ,  మరో ఐదు కోట్ల వెచ్చించి చెరువు అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తానన్నారు. అదే విధంగా పర్యాటక శాఖకు చెందిన రెండు కోట్ల రూపాయల నిధులతో చెరువు కట్టను ఆధునీకరించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

పట్టణానికి చెందిన ప్రజల వాకింగ్ సౌకర్యార్థం చెరువు చుట్టు వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తానన్నారు. అంతేకాకుండా సిద్దిపేట పట్టణ వాసులకు నిత్యం సరఫరా చేస్తున్నట్లే, భవిష్యత్‌లో సిద్దిపేట మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలకూ తాగునీరు అందిస్తామన్నారు. సుమారు ఐదు కోట్ల రూపాయలతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. సిద్దిపేటలోని ఐటీఐ భవన నిర్మాణానికి మూడు కోట్లు మంజూరు చేస్తానని ప్రస్తుతం కొనసాగుతున్న భవనాన్ని డ్వాక్రా మహిళ సంఘాల టౌన్ హాల్‌గా మార్చనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మన పండుగలకు సముచిత గౌరవం లభిస్తుందన్నారు.

అందుకనుగుణంగానే సీఎం కేసీఆర్ దసరాకు సెలవుల సంఖ్యను పెంచారన్నారు. ఈ నెల 30న సిద్దిపేటలో జరిగే బతుకమ్మ జాతరను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సద్దుల బతుకమ్మ రోజు ఉత్తమ బహుమతులను గుర్తించి తన వంతుగా 50 చీరలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఫారూక్‌హుస్సేన్, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాలు మాట్లాడుతూ, సిద్దిపేట పట్టణ ప్రజలకు కోమటి చెరువు అభివృద్ధి ఒక వరం లాంటిందన్నారు. మినీ ట్యాంక్ బండ్ తరహాలో భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధికి అవకాశం ఉందని ఆకాంక్షించారు.

అంతకు ముందు పర్యాటక శాఖ, సమాచార శాఖ ఆధ్వర్యంలో రూపొందిం చిన బ్రోచర్లను మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీలు, కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డ్వామా రాజేశ్వర్‌రెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి, తహశీల్దార్ రాములు, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, బాలవికాస ఈడీ శౌరిరెడ్డి, సెట్విన్ ఇన్‌చార్జి అమీనా, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, టీఆర్‌ఎస్ నాయకులు చిన్న, వెంకట్‌గౌడ్, సా యిరాం, ప్రభాకర్, రాంచంద్రారెడ్డి, మర్పల్లి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
 
బోటు షికారు
పట్టణ శివారులోని కోమటి చెరువులో నూతనంగా  బోటింగ్‌ను ప్రారంభించిన నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, ఫారూక్‌హుస్సేన్, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాలు బోటులో కోమటి చెరువులో షికారు చేశారు.
 
మాది రైతు ప్రభుత్వం
సిద్దిపేట టౌన్/ అర్బన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పారు. సిద్దిపేట ఎన్‌జీఓ భవన్‌లో శనివారం రాత్రి జరిగిన రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా పని చేస్తుందన్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను దశల వారీగా మూడు సంవత్సరాల్లో పరిష్కరిస్తామన్నారు. దీర్ఘకాలికంగా తెలంగాణలోని భూగర్భ జల వనరులను పెంపొందించడానికి చెరువులను పునరుద్ధరిస్తామన్నారు.

రైతులకిచ్చిన మాట ప్రకారం రుణ మాఫీకి ప్రభుత్వం చిత్తశుద్ధితో నిధులను మంజూరు చేస్తుందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. ఆత్మహత్యలు లేని తెలంగాణ రాష్ట్రం కోసమే ఇన్ని రోజులు పోరాడామన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఈ సందర్భంగా పరామర్శించారు. వారికి సహాయపడుతానని భరోసా ఇచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement