
బంగారు తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలా ?
హైదరాబాద్ : తెలంగాణ వచ్చి ఏడాదవుతున్నా రైతుల ఆత్మహత్యల ఆగలేదని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం వైఎస్ఆర్ సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలిందన్నారు. శనివారం హైదరాబాద్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ఒక్క హామీ కూడా అమలుకావడం లేదని ఆయన ఆరోపించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి రైతు పక్షపాతి అన్నముద్ర ఉందని పొంగులేటి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ పార్టీ పేరులోనే రైతుల ప్రస్తావన ఉందన్నారు. ఇది అంతం కాదు... అరంభం మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. అన్ని పార్టీలను కలుపుకుని రైతుల పక్షాన పోరాడతామన్నారు.
అందుకోసం ఆదివారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో రైతుదీక్ష నిర్వహిస్తున్నట్లు పొంగులేటి వెల్లడించారు. పార్లమెంట్, అసెంబ్లీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తామని చెప్పారు. బంగారు తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలా అన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.