సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తన సొంత జిల్లా వరంగల్‌లో దళితుల భూమిని కబ్జా చేశారంటూ మంగళవారం టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సావధాన తీర్మానం ఇచ్చారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ గ్రామంలో దాదాపు తొమ్మిది ఎకరాల భూమిని కబ్జా చేశారని, దీన్ని అక్రమంగా క్రమబద్ధీకరించుకున్నారన్నది ఆ తీర్మానం సారాంశం. బుధవారం ఈ అంశంపై సభలో సవివరంగా చర్చించనున్నారని సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు.. రాంపూర్ గ్రామంలో 1971లో 337, 338, 339 సర్వే నంబర్లలో సుమారు 9 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆ గ్రామానికి చెందిన అయిదుగురు దళితులకు కేటాయించారు. వరంగల్-హైదరాబాద్ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఈ భూమిని పొన్నాల 1991లో కబ్జా చేశారన్నది అభియోగం.
ఈ భూమికి సంబంధించిన పట్టాలు ఇంకా దళితుల దగ్గరే ఉన్నాయని, కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం మారిపోయాయని ఎమ్మెల్యేలు తమ తీర్మానంలో ఆరోపించినట్లు తెలిసింది. 2002లోనే గ్రామస్తులు ఈ భూముల విషయంపై పోరాడారని, ఒకరు కోర్టులో రిట్ పిటిషన్ వేసినా, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా పొన్నాల అడ్డుకున్నారన్న విమర్శ ఉంది. 2002లో ఈ భూమి పక్కనే ఏపీఐఐసీ ద్వారా పరిశ్రమ స్థాపిస్తానని చెప్పి మరో అయిదు ఎకరాలు తీసుకున్నా.. ఇప్పటికీ ఎలాంటి పరిశ్రమను నెలకొల్పలేదని ఆరోపిస్తున్నారు. దళితు భూమి సుమారు రూ.36 కోట్లు సహా మొత్తం భూమి విలువ రూ.52 కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తమ పార్టీ అధ్యక్షుడు కే సీఆర్ దృష్టికి ఈ భూముల వ్యవ హారాన్ని రాంపూర్ గ్రామస్తులు తీసుకువచ్చారని కూడా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.