'హిట్లర్, తుగ్లక్, నీరోలను మరిపిస్తున్నాడు'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ... తన వంద రోజుల పాలనలో హిట్లర్, తుగ్లక్లను మరిపిస్తున్నారని ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి పదవి చేపట్టి వంద రోజులైన నేపథ్యంలో ఆయన పాలనపైన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కేసీఆర్ పాలన హిట్లర్, తుగ్లక్లను మరిపిస్తున్నారంటూ అందుకు సంబంధించిన కర్రపత్రాలను పొన్నాల ఈ సందర్భంగా విడుదల చేశారు.
అనంతరం పొన్నాల మాట్లాడుతూ.... తెలంగాణ వచ్చిన ప్రజల్లో సంతోషం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నాడు స్వర్గాన్ని చూపాయని.... సీఎం పీఠం ఎక్కిన తర్వాత వాటిని అమలు చేయడానికి ఆయనకి మాత్రం నరకంగా ఉందని అభివర్ణించారు. తప్పులు చేయడంలో కేసీఆర్ శిశుపాలుడ్ని మించిపోయారన్నారు. అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ గోబెల్స్కే పాఠాలు చెబుతారని అన్నారు. కేసీఆర్ పాలన కుంభకర్ణుడి వారుసుడిగా, నీరోను తలపించేలా ఉందని పొన్నాల వ్యాఖ్యానించారు.
కరవు, కరెంట్ వంటి రైతాంగ సమస్యలపై సీఎం కేసీఆర్ సమీక్షించడం లేదని ఆరోపించారు. 167 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. తెలంగాణ సాధనలో భాగంగా మరణించిన కుటుంబాలను ఇప్పటికీ కేసీఆర్ సర్కార్ ఆదుకోలేదని విమర్శించారు. రుణమాఫీ, దళితులకు భూమి, ఎస్సీ మైనార్టీ రిజర్వేషన్లు... తదితర హామీల అమలు కార్యచరణ ఇప్పటికి ప్రకటించలేదన్నారు. ఈ లోపాలను ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదనే ఇతరపార్టీ నాయకుల ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ తీరుతో ప్రజలు విసిగిపోయారని పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు.