సాక్షి, హన్మకొండ అర్బన్: ఎన్నికల్లో ప్రతి ఓటూ ఎంతో కీలకం. అందుకే పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు కూడా పూర్తి స్థాయిలో తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని వారి కోసం ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. ఓటుహక్కును వినియోగించుకునే విషయంలో మాత్రం ఉద్యోగులు అంతగా ఆసక్తి చూపడం లేదని గత అనుభవాలు గుర్తుచేస్తున్నాయి. విధుల్లో ఉండేవారిలో 50 శాతం మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ తీసుకుంటే.. దాంట్లో కొందరు ఓటు వేసినా సకాలంలో పంపించరు. మరి మరికొందరు పోస్టల్ ఓట్లు తప్పుల తడకలుగా ఉండటంతో వాటిని పరిగణలోకి తీసుకోరు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా పోస్టల్ బ్యాలెట్ విషయంలో మాత్రం ఆశించిన ఫలితం కానరావడంలేదు.
పోస్టల్ బ్యాలెట్ విధానం ఓసారి పరిశీలిద్దాం....
పోస్టల్ బ్యాలెట్ కోసం ఉపయోగించే ఫారాలు..
ఫారం–12: పోస్టల్ బ్యాలెట్‌కోసం దరఖాస్తు చేసే పత్రం
ఫారం–13ఏ: ఓటరు ధ్రువీకరణ పత్రం
ఫారం 13బీ: కవరు లోపలి కవరు పోస్టల్ బ్యాలెట్ పెట్సాల్సిన కవరు.
పారం 13సీ– కవరు బీ పైన ఉండే కవరు. రిటర్నింగ్ అధికారికి తిరిగి పంపించాల్సిన కవరు.
13బీ కవరులో పోస్టల్ బ్యాలెట్ , 13ఏ ఓటరు డిక్లేరేషన్ పెట్టాలి.
ఫారం–13 డీ ఓటరుకు సూచనలు, సలహాలు
పోస్టల్ బ్యాలెట్ తిరస్కరణ ఎందుకంటే.....
ఉద్యోగి డిక్లేరేషన్‌లో సంతకం లేకపోవడం
డిక్లేరేషన్‌లో బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్ రాయక పోవడం
గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ లేకపోవడం
ఓటేసిన పోస్టల్ బ్యాలెట్‌ను 13బీ కవరులో పెట్టకపోవడం, సీలు వేయక పోవడం
పోస్టల్ బ్యాలెట్, డిక్లరేషన్ ఒకే కవరులో పెట్టడం.
బ్యాలెట్‌లో సంతకం చేయడం, ఓటు రహస్యతను కాపాడక పోవడం
ఏ అభ్యర్థికి చెందకుండా పైన లేదా కింద మార్క్ చేయడం వంటి కారణాలు..
పోస్టల్ బ్యాలెట్ పొందడం... పూర్తిచేసి అందజేయడం..
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులకు ఉత్తర్వులతోపాటు ఫారం–12 అందజేస్తారు. ఫారం 12ను పూర్తిగా నింపి రిటర్నింగ్ అధికారికి ఎన్నికల మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో ఏర్పాటు చేసే ఫెసిటిటేషన్ కేంద్రంలో అందజేయాలి.
ఉద్యోగికి అదే ఆర్‌ఓ పరిధిలోని నియోజకవర్గం పరిధిలో ఓటు ఉన్నట్‌లైతే పోస్టల్ బ్యాలెట్ నేరుగా> లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా అందజేస్తారు.
ఉద్యోగి ఫారం 12తోపాటు ఎన్నికల విధుల ఉత్తర్వుల కాపీ, ఓటరు గుర్తింపు కార్డు, ఉద్యోగి గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీలు జతచేయాలి.
ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో రెండో విడత శిక్షణ సమయంలో ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద అందరికీ అందుబాటులో ఉండే విధంగా పోస్టల్ బ్యాలెట్ డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ పొందిన ఉద్యోగులందరూ తమ ఓటుహక్కును వినియోగించుకుని ఫారం–13 కవర్ బీలో మార్క్ చేసిన పోస్టల్ బ్యాలెట్ పొందుపరిచి కవర్‌తో పాటు ధ్రువీకరణ పత్రం 13ఏ గెజిటెడ్ అధికారి సర్టిఫై చేసిన సంతకంతో కవర్ బీ (13సీ) కవర్లో పొందుపరిచి డ్రాప్ బాక్స్‌లో వేయాలి. లేదా ఆర్‌ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేయవచ్చు, లేదా ఆర్‌ఓకు నిర్ధిష్ట సమయంలో చేరే విధంగా పోస్టుద్వారా పంపించవచ్చు.
కవర్‌కు ఏవిధమైన పోస్టల్ స్టాంపులు అంటించాల్సిన అవరంలేదు.
పోలింగ్‌కు ఏడు రోజులు ముందు వరకు ఫారం 12, సంబంధిత పత్రాలు అందజేసి ఆర్‌ఓ నుంచి పోస్టల్ బ్యాలెట్ పొందవచ్చు. తీసుకున్న పోస్టల్ బ్యాలెట్ తిరిగి ఆర్‌ఓకు ఓట్ల లెక్కింపు తేదీ ఉదయం ఆరు గంటల్లోపు చేరే విధంగా అందజేయడానికి అవకాశం ఉంటుంది.
పోస్టల్ బ్యాలెట్ తక్కువ వినియోగానికి కారణాలు...
ఆర్‌ఓ వద్ద పోస్టల్ బ్యాలెట్ తీసుకోవడంపై ఎన్నికల విధుల్లో ఉన్నవారు ఆసక్తి చూపకపోవడం
ఎన్నికల విధుల ఉత్తర్వుల కాపీ ఫారం–12 సకాలంలో అందజేయకపోవడం
ఫారం పూర్తి చేసే సమయంలో ఓటరు జాబితాలోని వివరాలు సరిగా అందజేయకపోవడం
ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి సరైన సమయంలో డ్యూటీ ఆర్డర్లు అందకపోవడం
ఫారం–12లో చిరునామా సక్రమంగా ఇవ్వకపోవడం
తీసుకున్న బ్యాలెట్ పేపర్‌ను నిర్ణీత సమయంలోగా ఆర్‌ఓకు పంపక పోవడం
శాసనసభ ఎన్నికల్లో అర్బన్ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు..
నియోజక వర్గం | పోలైన ఓట్లు | చెల్లనివి |
వరంగల్ పశ్చిమ | 2293 | 34 |
వరంగల్ తూర్పు | 1308 | 43 |
వర్ధన్నపేట | 749 | 16 |
మొత్తం | 4350 | 93 |
Comments
Please login to add a commentAdd a comment