పోస్టింగ్..‘టెస్టింగ్’ | Posting .. 'testing' | Sakshi

పోస్టింగ్..‘టెస్టింగ్’

Jun 11 2014 3:37 AM | Updated on Sep 2 2017 8:35 AM

పోస్టింగ్..‘టెస్టింగ్’

పోస్టింగ్..‘టెస్టింగ్’

తహశీల్దార్ల కేటాయింపు జిల్లా ఉన్నతాధికారులకు పెద్ద పరీక్షగా మారింది. జాబితాతో అర్ధరాత్రి వరకు కుస్తీపట్టిన అధికారులు పరిష్కారం చూపలేకపోయారు.

తహశీల్దార్ల కేటాయింపుపైఅర్ధరాత్రి వరకు కసరత్తు
పేర్లు వెల్లడించలేకఅధికారుల ఉక్కిరిబిక్కిరి
ఎమ్మెల్యేల తీవ్ర ఒత్తిళ్లే కారణమా?
నేడు వెల్లడిస్తాం: డీఆర్వో  

 
తహశీల్దార్ల కేటాయింపు జిల్లా ఉన్నతాధికారులకు పెద్ద పరీక్షగా మారింది. జాబితాతో అర్ధరాత్రి వరకు కుస్తీపట్టిన అధికారులు పరిష్కారం చూపలేకపోయారు. తమ వారికి అనువైనచోట విధులు కేటాయిం చాలని ఎమ్మెల్యేలు కొందరు అధికారులపై ఒత్తిడి పెంచడంతో పోస్టింగ్‌లు కేటాయించలేక.. జాబితా వెల్లడించలేక తలలు పట్టుకుంటున్నారు. ఇలాఉండగా, విద్యాసంవత్సరం ప్రారంభమవడంతో ధ్రువీకరణపత్రాల కోసం విద్యార్థులు చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకునేవారులేరు. 

కలెక్టరేట్: ఎన్నికల తరువాత అంతర్‌జిల్లాల నుంచి జిల్లాకు వచ్చిన 38 మంది తహశీల్దార్లను ఆయా మండలాలకు కేటాయించేందుకు మంగళవారం అర్ధరాత్రి వరకు అధికారులు తీవ్ర కసరత్తు చేసి చివరి జాబితాను వెల్లడించలేకపోయారు. పోస్టింగ్స్ విషయంలో కొందరు  తహశీల్దార్లు ఎమ్మెల్యేలనే రంగంలోకి దింపడంతో అధికారులు కంగుతింటున్నారు. తమవారికి అనుకూలమైన చోట పోస్టింగ్ ఇవ్వాలని జిల్లాలోని 14 మంది ఎమ్మెల్యేలు ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. ఇక అధికారులు గత పదిరోజులుగా చేస్తున్న కసరత్తు మంగళవారంతో ముగుస్తుందని అంతా భావించారు. తీరా ఒత్తిళ్ల నేపథ్యంలో జాబితాను వెల్లడించలేకపోయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే తుది కసరత్తు ఎప్పుడు ముగుస్తుందనే విషయంపై అయోమయం నెలకొంది. ఇదిలాఉండగా, ఇక జిల్లాలో అతిప్రాముఖ్యం కలిగిన ఐదు మండలాలకు అధికారుల ఎంపిక జిల్లా అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. ముందుగా ఈ మండలాలకు అధికారులను నియమించారు. అయితే సదరు ప్రజాప్రతినిధులకు నచ్చకపోవడంతో ఇదివరకు రెండుసార్లు జాబితాను మార్చినట్లు సమాచారం. తహశీల్దార్ల పోస్టింగ్స్ విషయంలో ఎప్పుడూ యూనియన్ నేతలది హడావుడి కనిపించేది. కానీ ఈసారి ఎమ్మెల్యేలు రంగంలోకి దిగడంతో వారంతా మౌనం దాల్చారు. ఇక తహశీల్దార్లు ఆశించిన మండలాలకు తమను కేటాయిస్తే అడిగిన ఆఫర్లను ప్రకటిస్తున్నట్లు స్థానికంగా జోరుగా ప్రచారం సాగుతోంది.

 వీడని ఉత్కంఠ!

 తహశీల్దార్లను మండలాలకు కేటాయించే ప్రక్రియ రోజురోజుకూ పెండింగ్ పడటంతో జిల్లాలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అసలే పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు సర్టిఫికెట్ల జారీ అత్యవసరమైంది. ఈ సమయంలో తహశీల్దార్లు లేని కారణంగా ధ్రువీకరణపత్రాలు పెండింగ్‌కే పరిమితమవుతుండటంతో వారు గందరగోళానికి గురవుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థులు పాఠశాలు, కళాశాలలకు వెళ్లడం కష్టమే అనిపిస్తోంది. మరోవైపు ఖరీఫ్ సీజన్ ఆరంభం కావడంతో రైతులు రుణాలు, ఎరువులు, విత్తనాల కోసం అధికారుల కోసం పరుగులు పెడుతున్నారు. ఈ సమయంలో అన్నదాతలకు సమాధానం చెప్పేవారు లేకపోవడంతో బిక్కమోహం వేస్తున్నారు.
 
నేడు వెల్లడిస్తాం..

 తహశీల్దార్లను జిల్లాలోని ఆయా మండలాలకు కేటాయించిన జాబితాను బుధవారం వెల్లడిస్తామని డీఆర్వో రాంకిషన్ తెలిపారు. ఇందుకు సంబంధించి జాబితాను సిద్ధంచేసినా కలెక్టర్ ఆమోదించకపోవడంతోనే వెల్లడించలేకపోయామని చెప్పారు. నేటితో ప్రక్రియను పూర్తిచేసి మరోవారం రోజుల్లో అందరూ విధుల్లో ఉండేవిధంగా చూస్తామని ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement