వైద్యుల నిర్లక్ష్యానికి బాలింత బలి | Postpartum died due to negligence of doctors | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యానికి బాలింత బలి

Published Sun, Sep 21 2014 12:00 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

Postpartum died due to negligence of doctors

సిద్దిపేట టౌన్: వైద్యుల నిర్లక్ష్యానికి ఓ బాలింత బలి అయ్యింది. సిద్దిపేట మాతాశిశు సంక్షేమ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ మృతిరాలి బంధువులు, పుట్టింటి, అత్తింటి గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. బంధువులు చెప్పిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా గంభీరావుపేటకు చెందిన లావణ్య(22) ప్రసవం కోసం సిద్దిపేట మాతాశిశు సంక్షేమ ఆస్పత్రిలో శుక్రవారం చేరారు. మధ్యాహ్నం పండంటి ఆడబిడ్డను ప్రసవించింది.

కాగా రాత్రి ఆమె అకస్మికంగా అనారోగ్యానికి గురైంది. ఆమె కుటుంబ సభ్యులు డాక్టర్ సుజాతకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. కాంపౌండర్లు సైతం రాలేదు. దీంతో పరిస్థితి విషమించింది. బంధువులు ఆందోళనకు దిగడంతో కాంపౌండర్లు ఓ మాత్ర ఇచ్చారు. అయినా ఆమె ఆరోగ్యంలో మార్పు రాకపోవడంతో ఇంజక్షన్ ఇచ్చారు. ఆరోగ్యం మెరుగుపడకపోగా శరీరం నల్లగా మారింది. తీవ్ర బాధకు లావణ్య గురైంది. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఆయాసపడుతూ మరణించింది. సమాచారం అందుకున్న అత్తింటి గ్రామ ప్రజలు, పుట్టింటికి చెందిన మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామ ప్రజలు, బంధుమిత్రులు మాతా శిశు సంక్షేమ ఆస్పత్రికి శనివారం ఉదయం చేరుకున్నారు.

 ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే లావణ్య మృతి చెందిందని మండిపడ్డారు. డాక్టర్లు సరైన సమాధానం చెప్పకపోవడంతో రాస్తారోకోకు దిగారు. ఆస్పత్రి గేటు ఎదుట ధర్నా చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆర్డీఓ ముత్యంరెడ్డి విచారణకు ఆదేశించారు.

 ఉన్నతాధికారుల చర్చలు...
 సిద్దిపేట తహశీల్దార్ ఎన్‌వై గిరి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం, సీఐలు సైదులు, ప్రసన్నకుమార్, ఎస్‌ఐ, పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. అయినా ఆందోళన సద్దుమణగలేదు. బాలింత మృతి చెందిన విషయంపై అ ధికారులు విచారణ నిర్వహించారు. అనంతరం డాక్టర్ సుజాత, నర్సులు దాలమ్మ, మనోరంజనీ, రామభార్గవిలకు మెమో ఇచ్చా రు. సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు వీరిపై ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇవ్వడంతో బం ధువులు ఆందోళన విరమించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

 పసికందుకు అనారోగ్యం...
 తల్లి మరణంతో పసికందుకు చనుపాలు లేక అనారోగ్యానికి గురైంది. వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇక భర్త దేవరాజు వికలాంగుడు కావడంతో ఇరు కుటుంబాల సభ్యులు విచారం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని అన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement