బిల్లు కట్టండి | Power Bills Electronic Department Medak | Sakshi
Sakshi News home page

బిల్లు కట్టండి

Published Sat, Dec 29 2018 1:11 PM | Last Updated on Thu, Jul 11 2019 6:28 PM

Power Bills Electronic Department Medak - Sakshi

మెదక్‌జోన్‌: విద్యుత్‌ బకాయిల వసూళ్ల కోసం ట్రాన్స్‌కో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. బకాయిలు పడ్డవారు వెంటనే చెల్లించాలని లేనిచో కనెక్షన్లు తొలగిస్తామంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.  ఇందుకు సంబంధించి ఆటోల్లో ఊరూర ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాలో 1,58,516 నివాస గృహాలకు కనెక్షన్లు ఉండగా ఇందుకు సంబంధించి సుమారు ఏడాదిగా  రూ. 18.81 కోట్లు బకాయి ఉంది . అలాగే జిల్లాలో అధికారికంగా 89,312 వ్యవసాయానికి కనెక్షన్లు ఉన్నాయి. వీటికి సంబంధించి నాలుగు సంవత్సరాలుగా జిల్లా వ్యాప్తంగా రూ. రూ. 13 కోట్లు బకాయిలు పేరుకపోయాయి.  ఇళ్లకు, వ్యవసాయ బోరుబావులకు సంబంధించి మొత్తం  జిల్లాలో  రూ 31.81 కోట్ల బకాయిలు ఉన్నాయి.

వీటిని  ఎలాగైన వసూళ్లు చేయాలనే ఉద్దేశంతో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.  బకాయిలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉండటంతో వాటిని చెల్లించాలని గ్రామాల్లో చాటింపును సైతం వేస్తున్నారు. వినియోగదారులు నెలనెల సకాలంలో  విద్యుత్‌ బిల్లులు చెల్లించకుంటే  నెలదాటితే ఆ బిల్లుపై అదనంగా రూ. 20 ఫైన్‌వేస్తున్నారు. గతంలో సకాలంలో బిల్లులు కట్టని వినియోగదారులకు అస్సలుకు వడ్డీ, చక్రవడ్డీలను సైతం వేసే వారు ప్రస్తుతం  సకాలంలో చెల్లించని వారికి కేవలం రూ. 20  ఫైన్‌ మాత్రమే వేస్తున్నారు.  దీంతో బకాయిలు పడ్డా విద్యుత్‌వినియోగదారులకు ఎంతోలాభం చేకూరుతోంది.

వ్యవసాయానికి రోజుకో రూపాయి..
2004 సంవత్సరం నుంచి దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించారు. నాటినుంచి నేటివరకు అన్నదాతలను ఆదుకునే బృహత్తర పథకంలో ఉచిత విద్యుత్తు అందిస్తున్నారు.  24 గంటలపాటు వ్యవసాయినికి ఉచిత విద్యుత్‌ను వాడుకున్నా రోజుకొక్క రూపాయిచొప్పున  నెలకు రూ. 30 చొప్పున సర్వీస్‌ చార్జీ వసూలు చేస్తున్నారు.  జిల్లా వ్యాప్తంగా 89,312 వ్యవసాయ పంపుసెట్లకు  కనెక్షన్లు ఉండగా నెలకు  రూ. 26,79,360 రూపాయలను వినియోగదారులు సంబంధిత ట్రాన్స్‌కోకు  చెల్లించాల్సి ఉంటోంది. కాగా  ఒక్కోబోరుకు నెలకు రూ. 30 రూలు చెల్లించాల్సి ఉండగా సకాలంలో చెల్లించకుండా ఒక్కరోజు ఆలస్యం చేసినా ఫైన్‌కింద రూ. 25 చెల్లించాల్సిన పరిస్థితి.

వ్యవసాయానికి సంబంధించి మొత్తం రూ. 13 కోట్లు బకాయిలు ఉన్నాయి. వ్యవసాయ పంపుసెట్లకు రోజుకో రూపాయి చొప్పున నామమాత్రపు బిల్లులు చెల్లించాల్సి ఉండగా  ఇళ్లకు మాత్రం వినియోగించినంత చెల్లించాల్సిందే. 0–50 యూనిట్ల  వరకు యూనిట్‌కు రూ. 1.45 , 51–100 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు రూ. 2.60, 100–200 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు రూ.4.30 చొప్పున చెల్లించాల్సి ఉంటోంది. వ్యవసాయం, ఇళ్లకు సంబంధించిన మొత్తం బకాయిలు  రూ. 31.81 కోట్లు ఉంది. వీటిని ఎలాగైనా వసూలు చేయాలనే ఉద్దేశంతో నిత్యం ఊరూర ఆటోల్లో తిరుగుతూ బిల్లులు చెల్లించాలని లేనిచో సర్వీస్‌ వైర్‌ను తొలగిస్తామంటూ  హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్ల వరకు ఉచితం...
 రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఇళ్లకు 0–50 యూనిట్ల వరకు ఉచితంగా  ఇస్తున్నారు. 50 యూనిట్లు దాటితే అందరిలాగా బిల్లులు చెల్లించాల్సిందే.  కాగా పరిమితి మేరకు మాత్రమే ఉచితంగా ఇస్తుండగా విషయం తెలియని  చాలామంది ఎస్సీ, ఎస్టీలు పూర్తిగా తమకు విద్యుత్‌ ఉచితంగా వస్తుందంటూ పరిమితి దాటాక సైతం బిల్లులు చెల్లించకపోవడంతో ఇళ్లకు కరెంట్‌ బిళ్లులు పేరుకపోతునట్లు అధికారులు చెబుతున్నారు. కాగా ఈ విషయాన్ని సంబంధిత అధికా>రులు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అర్థమైయ్యేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వెంటనే చెల్లించండి

జిల్లాలో  విద్యుత్తుశాఖకు బకాయిలు పడిన  వినియోగదారులు వెంటనే బిల్లులు చెల్లించండి. వ్యవసాయ పంపు సెట్లు, ఇళ్ల బిళ్లులకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా రూ.31.81 కోట్లు బకాయిలు పేరుకపోయాయి. వాటిని  వెంటనే చెల్లించాలి. లేచినో సర్వీస్‌ కనెక్షన్లను తొలగించాల్సి ఉంటుంది. విద్యుత్‌ వినియోగదారులు సహకరించి బిల్లులు వెంటనే చెల్లించాలి. –శ్రీనాథ్, ఈఈ, ట్రాన్స్‌కో మెదక్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement