నర్సాపూర్ రూరల్ : వ్యవసాయ బోరు మోటార్‌కు చెందిన ప్యానల్ బోర్డుకు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని చిన్నచింతకుంటలో సోమవారం వేకువజామున చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బ్యాగరి స్వామి (33) తనకున్న ఎకరం భూమిలో కరెంట్ కోతను దృష్టిలో ఉంచుకుని రబీలో మొక్క జొన్నను సాగు చేస్తున్నాడు. కాగా వ్యవసాయానికి షిఫ్ట్ పద్ధతిన ఒక వారం రాత్రి ఒక వారం పగలు కరెంట్ సరఫరా అవుతోంది. సోమవారం వేకువజామున 3 గంటల సమయంలో కరెంట్ సరఫరా అవుతుందని తెలుసుకుని ఆదివారం రాత్రి సుమారు పది గంటల సమయంలో ఇంటి నుంచి బయలు దేరాడు.
వేకువజామున కరెంట్ సరఫరా రాగానే స్తంభం నుంచి ప్యానల్ బోర్డు లోకి విద్యుత్ సరఫరా చేసే తీగ ఊడిపోయి ఉండడంతో మోటార్ ఆన్ కాలేదు. దీంతో బ్యాటరీ సాయంతో స్తంభం నుంచి కరెంట్ సరఫరా అయ్యే తీగను ప్యానల్ బోర్డుకు బిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం అటుగా వెళ్లిన ఇరుగు పొరుగు రైతులు విషయాన్ని గమనించి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి తరలి వెళ్లారు. మృతుని భార్య వీరమణి, ఇద్దరు కూతుళ్ళు మైత్రి (5) వైష్టవి (2)లతో పాటు తల్లి పోచమ్మలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ గోపీనాథ్ తెలిపారు.
మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సంఘటన స్థలాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎంపీపీ అధ్యక్షుడు రామన్నగారి శ్రీనివాస్‌గౌడ్, గ్రామ సర్పంచ్ సరళలు కోరారు. రాత్రి కరెంటే స్వామి ప్రాణాలు తీసిందని తోటి రైతులు ఆరోపించారు. సరైన వర్షాలు పడక రైతులు బోరు బావులను నమ్ముకుని పంటలు సాగు చేసుకుంటూ అనేక కష్టాలు పడుతున్నారని దీనికి తోడు కరెంట్ సమస్యలు తోడుకావడంతో రైతుల ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుదాఘాతంలో రైతు మృతి
Published Mon, Dec 15 2014 11:09 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement