
సాక్షి, హైదరాబాద్ : రాజధాని గులాబీమయమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆదివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రగతి నివేదన సభకు హైదరాబాద్ శివార్లలోని కొంగరకలాన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సభా వేదిక, మైదానంతోపాటు సభకు దారితీసే ఔటర్ రింగ్‌రోడ్డు గులాబీ జెండాలతో రెపరెపలాడుతోంది. సభ కోసం భారీ వేదికను నిర్మించారు. 100 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో పటిష్టంగా నిర్మించిన వేదికపై 300 మంది ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్యులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లకు వేదికపై కూర్చునే అవకాశముంది. భారీ వర్షం వచ్చినా వేదికపై ఉన్న వారికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రూఫ్‌ను నిర్మించారు. వేదిక పరిసరాల్లో కంకర, సిమెంటుతో రోడ్డు వేశారు. దూరప్రాంతాల నుంచి వస్తున్న టీఆర్‌ఎస్ శ్రేణుల ట్రాక్టర్లలో చాలా మటుకు శనివారం సాయంత్రానికే సభా మైదానానికి చేరుకున్నాయి. అయితే ట్రాఫిక్ జామ్‌ను నివారించేందుకు శనివారం అర్ధరాత్రి వరకే ట్రాక్టర్లను అనుమతించాలని పోలీసులు నిర్ణయించారు.
హెలికాప్టర్‌లో సభాస్థలికి చేరుకోనున్న కేసీఆర్...
ప్రగతి నివేదన సభకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక హెలికాప్టర్‌లో సాయంత్రం 5.30 గంటలకు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే సభకు వచ్చే జనం, వాతావరణం వంటి వాటితో ఈ షెడ్యూల్‌లో మార్పులు ఉండే అవకాశం ఉందంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం ముగియనుంది. ఆ తరువాత సభాస్థలికి కేసీఆర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు అన్ని ప్రాంతాల నుంచి సభా మైదానానికి ప్రజలు చేరుకుంటారు. 3 గంటల ప్రాంతంలో సాంస్కతిక కార్యక్రమాలు, ప్రగతిని వివరించే పాటలు, కళారూపాల ప్రదర్శన ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పార్టీకి చెందిన ముఖ్య నేతల ప్రసంగాలు ప్రారంభమవుతాయి. కొందరు ముఖ్యుల ప్రసంగాల మధ్యలోనే పాటలు, సాంస్కృతిక కళారూపాల ప్రదర్శన జరగనుంది. కేసీఆర్ సభకు చేరుకున్నాక ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ ప్రసంగాలు ఉండే అవకాశముందని పార్టీ ముఖ్యులు వెల్లడించారు.
సిద్ధమైన కేసీఆర్ ప్రసంగం...
ప్రగతి నివేదన సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సిన సందేశంపై కేసీఆర్ కసరత్తు పూర్తి చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఫాంహౌస్‌లో దీనికి తుది మెరుగులు చేశారు. కొందరు ముఖ్య నేతలు, అధికారులు, సలహాదారులతో కలసి ఈ సభ ద్వారా ప్రజలకు నివేదించాల్సిన ముఖ్య అంశాలపై కసరత్తు చేపట్టారు. 13 ఏళ్ల ఉద్యమకాలం, రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం, చేసిన త్యాగాల నుంచి ప్రారంభించి వర్తమాన పరిస్థితుల దాకా అన్ని విషయాలపై సంక్షిప్తంగా మాట్లాడనున్నారు.
రుణమాఫీ నుంచి రైతుబంధు దాకా...
పంట రుణాల మాఫీ నుంచి ప్రస్తుతం అమలు చేస్తున్న రైతుబంధు దాకా రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలను కేసీఆర్ వివరించనున్నారు. రుణమాఫీ, వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్, సబ్సిడీపై యంత్రాల పంపిణీ, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పథకం దాకా అన్ని అంశాలనూ వివరించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు విద్యను అందించడానికి రెసిడెన్షియల్ పాఠశాలలు, ఉద్యోగాల భర్తీ, యువతకు ఉపాధి కల్పన కోసం తీసుకున్న చర్యలను చెప్పనున్నారు. గ్రామాల్లోని వృత్తుల పరిరక్షణ కోసం ఉచితంగా చేప పిల్లలు, గొర్రెల పంపిణీ పథకాలను గుర్తుచేయనున్నారు. బాలింతలు, శిశువుల కోసం అందిస్తున్న కేసీఆర్ కిట్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు ఆర్థిక సాయం, ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్, కంటి వెలుగు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటాన్ని వివరించనున్నారు.
ప్రధానంగా సాగునీటిని అందించడానికి పూర్తి చేస్తున్న కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను, ఇంటింటికీ తాగునీటిని అందించడానికి చేపట్టిన మిషన్ భగీరథను, చిన్ననీటి వనరులను పరిరక్షించడానికి అమలు చేసిన మిషన్ కాకతీయ వంటి పథకాలు, వాటి ద్వారా పొందిన ఫలితాలను చెప్పనున్నారు. ఆసరా పింఛన్లు, ఉచిత బియ్యం, విద్యార్థులకు సన్న బియ్యం, అమరుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం, పేదలకు పట్టాలు, కిందిస్థాయి ఉద్యోగులకు బీమా, ఆత్మగౌరవ భవనాలు, జీతాల పెంపు, వివిధ వర్గాలకు సంక్షేమ పథకాలు, పారిశ్రామిక విధానం వంటి వాటిపై కేసీఆర్ సంక్షిప్తంగా వివరించనున్నారు.
ప్రతిపక్షాలపై ఎదురుదాడి...
తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వారే తెలంగాణ అభివృద్ధిలోనూ అడ్డపడుతున్నారంటూ ప్రతిపక్షాలపై కేసీఆర్ ఎదురుదాడి చేయనున్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైన్, కేంద్రం నుంచి అనుమతులు రాకుండా అడ్డుపడటం, కోర్టుల్లో కేసులు వేయడం వంటి వాటిపైనా విమర్శనాస్త్రాలను సంధించనున్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన 51 నెలల్లో సాధించిన విజయాలను చెబుతూనే అడ్డుకోవడానికి కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల వైఖరిని ఎండగట్టనున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 50 ఏళ్లలోని వైఫల్యాలపై విమర్శలు గుప్పించనున్నారు. టీఆర్‌ఎస్‌కు మరోసారి అవకాశం ఇస్తే అమలు చేయనున్న పథకాలను కూడా ఈ సభ ద్వారా కేసీఆర్ చెప్పనున్నారు.