విడగొట్టి.. వదిలేశారు! | pranahita project development stoped | Sakshi
Sakshi News home page

విడగొట్టి.. వదిలేశారు!

Published Fri, Mar 2 2018 4:22 AM | Last Updated on Sat, Aug 25 2018 6:58 PM

pranahita project development stoped - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా లోని 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేందుకు చేపట్టిన ప్రాణహిత ప్రాజెక్టు పడకేసింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును ప్రాణహిత, కాళేశ్వరం ఎత్తిపోతలుగా విభజించాక.. ప్రాణ హితను ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టింది. ప్రాజెక్టులో భాగంగా నిర్మించాల్సిన తమ్మిడిహెట్టి బ్యారేజీ వద్ద మూడున్నరేళ్లుగా తట్టెడు మట్టి తీయలేదు. భూ సేకరణ, అటవీ అను మతులపై అసలు పట్టింపే లేకపోవడంతో ప్రాజెక్టు అతీగతీ లేకుండా పోతోంది.

రూ.6,465 కోట్ల ప్రాజెక్టు
ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారా ఆదిలాబాద్‌ జిల్లాలో 56 వేల ఎకరాలకు నీరందించాలని గతంలో నిర్ణయించగా, మరో 1.44 లక్షల ఎకరాలు కలిపి 2 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా కొత్త ప్రణాళిక రూపొందించారు. తమ్మిడిహెట్టి వద్ద 4.5 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించి 20 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు రూ.965 కోట్లు అవసరమవుతాయని తొలుత అంచనా వేశారు. కానీ తర్వాత దాన్ని రూ.1,918.7 కోట్లకు సవరించారు. 70 కిలోమీటర్ల ప్రధాన, నెట్‌వర్క్‌ కాల్వలకు నీటి పంపిణీకి కలిపి మొత్తంగా రూ.6,465 కోట్లు అవసరమవుతుందని తేల్చారు. ఈ అంచనాలు పూర్తయి ఏడాదిన్నర గడుస్తున్నా అటవీ అనుమతులు, భూ సేకరణ కారణంగా అడుగు ముందుకు పడటం లేదు.  

ఒక్క ఎకరా కూడా..
తమ్మిడిహెట్టి బ్యారేజీకి 965 ఎకరాల భూ సేకరణ అవసరం ఉండగా ఇప్పటివరకు ఒక్క ఎకరం కూడా సేకరించలేదు. ఇందులో మహారాష్ట్ర పరిధిలోనూ 60 ఎకరాలు ఉండగా ఆ ప్రక్రియ కూడా ముందుకెళ్లలేదు. ప్రాజెక్టులో పూర్తి నిర్మాణాలకు 8,709.5 ఎకరాలు అవసరమని అంచ నా వేశారు. ఇందులో రిజర్వ్‌ అటవీ భూమిలోని 508 హెక్టార్ల బదిలీకి కేంద్రం అంగీకరించింది. కానీ పరిహారం చెల్లించక రెండోదశ ప్రక్రియ మొదలవలేదు. తమ్మిడిహెట్టి బ్యారేజీ 2.15 కిలోమీటర్ల నిర్మాణ ప్రాంతం రాష్ట్ర పరిధిలో.. కవ్వాల్, మహారాష్ట్ర పరిధిలో ఉంది. అంతర్రాష్ట్ర ఒప్పందాల్లో భాగంగా భూమి ఇచ్చేందుకు మహారాష్ట్ర సమ్మతించడంతో పర్యావరణ, అటవీ అనుమతులు దక్కాయి. కానీ పరిహారం చెల్లింపులో అటవీ శాఖ జాప్యంతో అడుగు ముందుకు పడలేదు. మరో 1,155 ఎకరాలు (622 హెక్టార్లు) టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో ఉంది.  

‘గ్రావిటీ’సర్వే గాల్లోనే..
కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిళ్ల బ్యారేజీకి తమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు చేపట్టిన సర్వే పనులపై వ్యాప్కోస్‌ దాగుడుమూతలు ఆడుతోంది. తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో 44 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర జల సంఘం చెప్పింది. ఈ నేపథ్యంలో తమ్మిడిహెట్టి రెగ్యులేటర్‌ ఎత్తును 145 మీటర్ల నుంచి మరో మీటర్‌కు తగ్గిస్తే మరో 20–30 టీఎంసీల లభ్యత పెరుగుతుందని, మొత్తంగా 70 టీఎంసీలను గ్రావిటీతో 72వ కిలోమీటర్‌ వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి కాలువ ద్వారా సుందిళ్లలో కలపాలని సర్కారు ప్రతిపాదించింది. ఆ సర్వే బాధ్యతలను 2016 మార్చి 18వ తేదీన వ్యాప్కోస్‌కు అప్పగించి రూ.6.67 కోట్లు కేటాయించింది. అయితే హెలికాప్టర్‌లో లోపాలు, జూన్‌ వర్షాలతో సర్వేకు బ్రేక్‌ పడింది. తర్వాత కాళేశ్వరంలోని మల్లన్నసాగర్‌–సింగూరు, నార్లాపూర్‌–డిండి అలైన్‌మెంట్‌లో బిజీగా ఉండటంతో సుందిళ్ల వైపు వ్యాప్కోస్‌ కన్నెత్తి చూడలేదు. మరోవైపు సర్వే నిధులు సవరించి 9.35 కోట్ల రూపాయలు కేటాయించాలని వ్యాప్కోస్‌ కోరడం గమనార్హం.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement