ప్రాణహితపై చిత్తశుద్ధి కరువు
- వర్షాభావంపై రైతులకు అవగాహన కల్పించాలి
- మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి
నవీపేట : ప్రాణహిత ప్రాజెక్ట్ పనులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడారు. భూ ఉపరితలం నుంచి 300 అడుగుల లోతులో టన్నెల్ నిర్మాణ పనులు చేపడుతున్నారని, టన్నెల్ లోపల చుట్టూ సీసీతో ప్లాస్టరింగ్ చేయాలనే నిబంధన ఉందని అన్నారు. కానీ సీసీ పనులను చేపట్టకపోవడంతో 200 అడుగుల లోతులో ఉన్న రైతుల బోర్లు వట్టిపోతున్నాయన్నారు. భూగర్భ జల మట్టం తగ్గుతున్నందున రైతులకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ హయాంలో రూకల్పన చేసిన ఎర్రకుంట రిజర్వాయర్ పనులపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రుణమాపీ పథకంతో రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. పహణీ నకలు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే రైతులకు ఆలస్యంగా ధృవీకరణ పత్రాలను అందిస్తున్నారని రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతు లింబయ్యకు అప్పులు లేవని ఆర్డీవో పేర్కొనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
రైతు ఆత్మహత్యలను ప్రభుత్వం ధృవీకరించడం లేదన్నారు. రూ. 35 వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న వాటర్ గ్రిడ్ పథకంపై విసృ్తత ప్రచారం చేస్తున్న ప్రభుత్వం జిల్లాలోని 30 గ్రామాలకు ఫ్లోరైడ్ రహిత నీటిని అందించే యంచ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించడం లేదని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ మాట్లాడుతూ.. ప్రాణహిత ప్రాజెక్ట్ పనులలో 20, 21, 22 ప్యాకేజీలలో నిలిచిన పనులను పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21న మహాపాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్‌గా నవీపేట జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్‌ను నియమించినట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ రాజేందర్ గౌడ్, వైస్ ఎంపీపీ గోవర్దన్ రెడ్డి, నాయకులు సూరిబాబు,తెడ్డు పోశెట్టి, సాయరెడ్డి, మహిపాల్‌రెడ్డి,సంజీవ్‌రావ్, దేవరాజ్, గంగాదర్, రవీందర్‌రావ్ పాల్గొన్నారు.