చేగుంట (తూప్రాన్): కూలీపనుల కోసం హైదరాబాద్‌కు వచ్చి లాక్‌డౌన్ సందర్భంగా తమ సొంత రాష్ట్రానికి వెళ్తున్న ఓ గర్భిణి దారిలో రోడ్డుపక్కనే ప్రసవించింది. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తిశివునూర్ శివారులో జాతీయ రహదారిపై మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో కూలికోసం అనితాబాయి లోకేశ్ దంపతులు కొంతకాలం కిందట ఛత్తీస్‌గఢ్ నుంచి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి వచ్చారు. లాక్‌డౌన్ నిబంధనలను కేంద్రం సడలించడంతో తమ రాష్ట్రానికి వెళ్లాలనుకున్న అనితాబాయి కుటుంబీకులు ఓ వాహనంలో సోమవారం రాత్రి బయలుదేరారు. నార్సింగి వద్ద అనితాబాయికి పురిటి నొప్పులు రావడంతో వాహన డ్రైవర్ వారిని జప్తిశివునూర్ శివారులో దింపేసి వెళ్లిపోయాడు.
మంగళవారం ఉదయం అనితాబాయి రోడ్డుపక్కనే ప్రసవించి పాపకు జన్మనిచ్చింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న నార్సింగి ఎస్‌ఐ రాజేశ్ ఉన్నతాధికారుల సూచనలతో తల్లిపాపలను అంబులెన్స్‌లో రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. రామాయం పేట సీఐ నాగార్జునగౌడ్ ఆస్పత్రికి చేరుకొని తల్లీపాపల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. స్థానికుల సాయంతో బేబీకిట్‌ను అందజేసి ఎలాంటి అవసరం ఉన్నా తాము ఆదుకుంటామని సీఐ అనిత కుటుంబీకులకు హామీ ఇచ్చారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో తల్లీపాపలకు మెరుగైన వైద్యం అందించినట్లు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment