- అందుబాటులో పత్తి, వరి, మొక్కజొన్న, జీలుగ, సోయూబీన్
- జిల్లాలో 5,40,450 హెక్టార్ల విస్తీర్ణంలో పంటల సాగు
- వ్యవసాయ శాఖ అంచనా
- ఎమ్మార్పీకి మించి అమ్మితే చర్యలు
- జేడీఏ రామారావు హెచ్చరిక
వరంగల్, న్యూస్‌లైన్: ఖరీఫ్ సాగుకు అవసరమైన విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. సీజన్‌లో ముందుగా అవసరమైన పత్తి విత్తనాలపై వ్యవసాయ శాఖ దృష్టి కేంద్రీకరిం చింది. ఇదేకాకుండా... ప్రధానమైన వరి, మొక్కజొన్న, మిర్చి, వేరుశనగతోపాటు సబ్సిడీపై అందించే పలు విత్తనాలు మార్కెట్‌కు చేరుకున్నాయి.
జూన్ ప్రారంభమైనందున రుతుపవనాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయనే సమాచారంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇటీవల కురిసిన ఒకటిరెండు వర్షాలతో పొడి దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. నీటి వనరులు అం దుబాటులో ఉన్న కొందరు రైతులు పత్తి, మొక్కజొన్న, వరి విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
ముందు జాగ్రత్తగా విత్తనాల కొనుగోళ్లు సైతం సాగిస్తున్నారు. మరో ఒకటి, రెండు వర్షాలుకురిస్తే విత్తనాల కొనుగోళ్లు ఊపందుకునే అవకాశముంది. ఈ ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 5,40,450 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు వివిధ పంటలను సాగు చేస్తారనే అంచనాతో వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తొలకరికి ముందే విత్తనాలు మార్కెట్‌లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటే రైతుల నుంచి ఒత్తిడి తగ్గుతుందనే అంచనాతో వారు ముందుకు సాగుతున్నారు.
పత్తి : జిల్లాలో పత్తి సాధారణ విస్తీర్ణం 2,28,207 హెక్టార్లు కాగా... గత ఖరీఫ్‌లో 2,43,585 హెక్టార్ల విస్తీర్ణంలో సాగైంది. ఈ ఖరీఫ్‌లో 2,75,000 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. దీనినుగుణంగా వారు పత్తి విత్తనాలు సిద్ధం చేస్తున్నారు. ఖరీఫ్‌కు 14,56,200 పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమని అధికారులు ఇదివరకే ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం మార్కెట్‌లోకి 9,50,000 పత్తి విత్తన ప్యాకెట్లు మార్కెట్‌లోకి వచ్చాయి. బీటీ -2 రకం 450 గ్రాముల పత్తి విత్తన ప్యాకెట్ ధర రూ. 930లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సుమారు 2 లక్షల ప్యాకెట్ల మేరకు విక్రయించినట్లు అంచనా.
వరి : 1,60,000 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగవుతుందని అధికారుల అంచనా. దీనికనుగుణంగా 1,50,000 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉన్నట్లు ఏపీసీడ్స్ అధికారులు తెలిపారు. బీపీటీ-5204 సాంబమసూరి, ఎంటీయూ-1001, 1010, 7029 రకాల వరి విత్తనాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వరి విత్తనాలకు సంబంధించి కిలోకు రూ.5 సబ్సిడీ ఇస్తున్నారు.
మొక్కజొన్న : 73,000 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. దీనికి అవసరమైన వ వివిధ కంపెనీలకు చెందిన 5,000 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో పెట్టినట్లు తెలిపారు. మొక్కజొన్న విత్తనాలను కిలోకు రూ.25 సబ్సిడీ కింద అందజేస్తున్నారు.
జీలుగ : జిల్లాలో 4,000 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు అవసరం కాగా... ఇప్పటివరకు 2500 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నారుు. కిలోకు రూ.25 సబ్సిడీపై వీటిని విక్రయిస్తున్నారు.
సోయాబీన్ : 300 ఎకరాల విస్తీర్ణంలో రైతులు సోయాబీన్ సాగు చేస్తారని అధికారుల అంచనా. ఈ మేరకు 300 క్వింటాళ్ల విత్తనాలు అవరమవుతాయి. ప్రస్తుతం 180 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. 33 శాతం సబ్సీడీపై కిలోకు రూ.78 చొప్పున వీటిని విక్రయిస్తున్నారు.
మినుములు : జూన్ మొదటి వారంలో మినుము విత్తనాలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఏపీ సీడ్ జిల్లా మేనేజర్ సదానందం తెలిపారు.
అందుబాటులో అన్నిరకాల విత్తనాలు
ఈ ఖరీఫ్‌లో విత్తన సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం లేదు. గతంలో పత్తి విత్తనాల కోసం రైతులు పోటీపడేవారు. ఇప్పుడు అన్ని రకాల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాం. ఎవరైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవు. బ్లాక్ మార్కెట్, అదనంగా ధర వసూలు చేస్తే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలి.
- రామారావు, వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్